ప్రసవం కోసం హైదరాబాద్‌కు.. చికిత్స మధ్యలోనే హఠాన్మరణం.. కరోనా టెస్ట్ చేస్తే..

ABN , First Publish Date - 2020-07-21T20:49:56+05:30 IST

కరోనాతో చేర్యాలకు చెందిన ఓ ఫర్టిలైజర్‌ వ్యాపారి మృతి చెందాడు. కొద్దిరోజులక్రితం తీవ్రజ్వరంతో అస్వస్తతకు గురైన వ్యాపారి ఈ నెల 11న యశోద ఆస్పత్రిలో చేరాడు. పది రోజులుగా కరోనాతో పోరాడిన ఆయన పరిస్థితి విషమించి

ప్రసవం కోసం హైదరాబాద్‌కు.. చికిత్స మధ్యలోనే హఠాన్మరణం.. కరోనా టెస్ట్ చేస్తే..

చేర్యాలలో ఫర్టిలైజర్‌ వ్యాపారి మృతి


చేర్యాల/సిద్దిపేట(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలో సోమవారం 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. హుస్నాబాద్ లో ముగ్గురికి, సిద్ధిపేట, దుబ్బాక, తొగుటలో ఒక్కొక్కరికీ వైరస్ సోకినట్లు తెలిసింది. ర్యాపిడ్ టెస్టులో పది మంది నుంచి శాంపిల్స్ సేకరించగా చిన్నకోడురు మండలంలో నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. చేర్యాలలో ఒకరు, అదే మండలం వీరన్నపేటలో మరొకరు వైరస్ బారిన పడి మృతి చెందారు.


కరోనాతో చేర్యాలకు చెందిన ఓ ఫర్టిలైజర్‌ వ్యాపారి మృతి చెందాడు. కొద్దిరోజులక్రితం తీవ్రజ్వరంతో అస్వస్తతకు గురైన వ్యాపారి ఈ నెల 11న యశోద ఆస్పత్రిలో చేరాడు. పది రోజులుగా కరోనాతో పోరాడిన ఆయన పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి కన్నుమూశాడు. వ్యాపారి చనిపోయిన విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని తామే ఖననం చేస్తామని ఆస్పత్రివర్గాలు తెలపడంతో కుటుంబసభ్యులు చివరి చూపునకు నోచుకోలేదు. ఫర్టిలైజర్‌ వ్యాపారి మృతికి సంతాపంగా చేర్యాల పట్టణంలో మంగళవారం సంపూర్ణ బంద్‌ పాటిస్తున్నట్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు ప్రకటించారు.


మృతిచెందిన గర్భిణికి పాజిటివ్‌

చేర్యాల మండలం వీరన్నపేటకు చెందిన గర్భిణి ఆదివారం రాత్రి మృతిచెందగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రసవం కోసం ఆమెను మూడురోజుల క్రితం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవం కోసం పరీక్షలు చేస్తుండగా, ఆమె హఠాన్మరణం చెందింది. రిపోర్టుల్లో పాజిటివ్‌ అని తేలింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి శివారులోని వ్యవసాయబావి వద్ద గోతి తీసి పూడ్చిపెట్టారు. ఈ మేరకు సోమవారం కొమురవెల్లి పీహెచ్‌సీ వైద్యాధికారులు మృతురాలి కుటుంబీకులు ముగ్గురిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వైద్యసిబ్బంది గ్రామంలో ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో కరోనా కలకలం

తొగుట మండలం తుక్కాపూర్‌ శివారులో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్యాకేజీ-12లో మెగా కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడిని హోం క్వారంటైన్‌లో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. మల్లన్నసాగర్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా రాగా వారితో పనిచేస్తున్న వారికి ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. అందులో ఇంజనీర్‌కు పాజిటివ్‌గా తేలిందని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ తెలిపారు.


హుస్నాబాద్‌లో ముగ్గురికి పాజిటివ్‌

హుస్నాబాద్‌ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. భర్త, భార్యతో పాటు కుమారుడికి జ్వరం రావడంతో కరీంనగర్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా వారికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు చెప్పారు. వీరిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. కాగా హుస్నాబాద్‌ ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా సోకినట్లు సమాచారం. ఆ ఉద్యోగి హుజూరాబాద్‌ నుంచి వస్తుంటాడని తెలిసింది. దీంతో సోమవారం ఎల్‌ఐసీ కార్యాలయాన్ని మూసేసి శానిటైజ్‌ చేసినట్లు సమాచారం. 


దుబ్బాకలో ఒకరికి పాజిటివ్‌

తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు అనుమానితులకు సోమవారం పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి పార్మాసిస్టుకు రెండు రోజుల క్రితం ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతడిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. సోమవారం కుటుంబీకులకు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా అతని కుమారుడికి పాజిటివ్‌గా తేలింది. అతన్ని కూడా హోం ఐసోలేషన్‌ చేశారు. అలాగే ఆదివారం రాత్రి ఓ యువకుడిని 108లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అతడికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి తండ్రి కండక్టర్‌గా పని చేస్తుండడంతో రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన కుటుంబసభ్యులకు సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. 


కరోనాను జయించి విధుల్లో చేరిన సర్పంచ్‌ 

నెల రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న రామారం సర్పంచ్‌ సరోజన విధుల్లో చేరింది. సోమవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి గ్రామాభివృద్ధిపై చర్చించారు. వృద్ధాప్యానికి తోడు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కోలుకుని విధుల్లో చేరడంపై పాలకవర్గ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-21T20:49:56+05:30 IST