ప్రమాద ఘంటికలు..

ABN , First Publish Date - 2021-04-11T05:40:56+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రెండో దశ వ్యాప్తిలో భాగంగా ఉధృతి పెరుగుతోంది. ఫలితంగా ఒక్కసారిగా పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలోకి పాజిటివ్‌ కేసులు చేరుకున్నాయి. దీంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ప్రమాద ఘంటికలు..
బాధితులను క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్న వైద్యసిబ్బంది

 జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

 గత నాలుగు రోజులుగా వందల సంఖ్యలో నమోదు 

 శనివారం ఒక్కరోజే భారీగా 279 మందికి పాజిటివ్‌ 

గుజరాతీపేట, ఏప్రిల్‌ 10: జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రెండో దశ వ్యాప్తిలో భాగంగా ఉధృతి పెరుగుతోంది. ఫలితంగా ఒక్కసారిగా పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలోకి పాజిటివ్‌ కేసులు చేరుకున్నాయి. దీంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రారంభమైన గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ అధికారులు  9,83,594 మంది నుంచి నమూనాలు సేకరించారు. తాజాగా శనివారం 2,100 మందికి కరోనా పరీక్షలు చేయగా... 279 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 48,041కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. శనివారం కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 47 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ కేంద్రంలో 828 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 94 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 101 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 1,023 మంది బాధితులు ఉన్నారు. ఈ నెల ప్రారంభం నాటికి ఇరవై లోపు ఉన్న కేసులు క్రమేణా పెరుగుతూ వచ్చాయి. ఈ నెల 2న 54, 3న 51, 4న 58, 5న 52 కేసులు నమోదయ్యాయి. కానీ, గత నాలుగు రోజులుగా మాత్రం వందల్లో కేసులు నమోదవుతున్నాయి. 6న 102, 7న 123, 8న 185, 9న 100 కేసులు   చొప్పున నమోదయ్యాయి. శనివారం ఏకంగా 279 కేసులు  వెలుగు చూడడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్కసారిగా మూడు రెట్లు కేసులు పెరగడంతో మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని వైద్యావర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన రెండు రోజుల్లో కరోనాతో ఇద్దరు మృత్యువాత పడ్డారని జిల్లా అదనపు వైద్యఆరోగ్యశాఖాధికారి బగాది జగన్నాథరావు తెలిపారు. కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవిడ్‌ లక్షణాలున్న వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని తెలిపారు. మాస్కులు, శానిటైజర్‌ వినియోగంతో పాటు భౌతిక దూరంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  


‘ఎల్‌.ఎన్‌.పేట’లో 11 మందికి పాజిటివ్‌


ఎల్‌.ఎన్‌.పేట: ఎల్‌.ఎన్‌.పేట మండలంలో రోజురోజుకు కరోనా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓ ప్రధాన కూడలిలో ముగ్గురికి, మరో కాలనీలో ఎనిమిది మందికి శనివారం కరోనా పాజిటివ్‌గా గుర్తించి  క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, వైద్యాధికారి రెడ్డి హేమలత తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని వారు కోరారు. 

Updated Date - 2021-04-11T05:40:56+05:30 IST