Abn logo
Apr 8 2020 @ 03:35AM

గడప దాటితే గండమే..!

ప్రొద్దుటూరులో మరొక పాజిటివ్‌ నిర్ధారణ

28కి చేరిన కరోనా కేసులు

లాక్‌డౌన్‌కు నేటితో 18 రోజులు

ఈ వారం రోజులు అత్యంత కీలకం

కరోనా కట్టడికి రెడ్‌జోన్‌ పరిధిలో పకడ్బందీ చర్యలు

జిల్లాలో స్టేజ్‌-2 దశలో కోవిడ్‌-19 వ్యాప్తి

బందోబస్తు విధుల్లో ఆర్టీసీ కండక్టర్లు, పీఈటీలు


కడప, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అందరినీ వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో రెడ్‌జోన్‌ పరిధిలో పకడ్బందీగా కర్ఫ్యూ తరహా బందోబస్తు అమలుచేస్తున్నారు. కోవిడ్‌-19 కట్టడికి మార్చి 22న జనతా కర్ఫ్యూ.. 23 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. నేటితో 18 రోజులు..కరోనాపై విజయం సాధించాలంటే ఈ వారం, పదిరోజులు ఎంతో కీలకం. మరిన్ని కష్టనష్టాలు ఎదుర్కొని ఈ గండం నుంచి గట్టెక్కే దిశగా ప్రజలు సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.


ప్రొద్దుటూరులో మరో పాజిటివ్‌ నిర్ధారణ

జిల్లాలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతూ వచ్చాయి. 1న ఒకేసారి 15 కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ 27కు చేరింది. మంగళవారం ప్రొద్దుటూరులో మరో పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 28కి చేరింది.


రెడ్‌జోన్‌ పరిధిలో పకడ్బందీ బందోబస్తు

పాజిటివ్‌ బాధితులు ఉన్న ఏరియా చుట్టూ కంటోన్మెంట్‌ రెడ్‌జోన్‌గా గుర్తించి పకడ్బందీ కర్ఫ్యూ తరహా బందోబస్తు అమలు చేస్తున్నారు. కడప నగరంలో ఆలంఖాన్‌పల్లె, సాయిపేట, టూటౌన్‌ ఏరియా ప్రాంతాల్లో రెడ్‌జోన్‌ అమలులో ఉంది. ఇక్కడి నుంచి ఒక్కరిని కూడా బయటికి రాకుండా చూస్తున్నారు. ఆలంఖాన్‌పల్లె ఏరియాను పోలీసులు దిగ్బంధం చేశారు. ఆటోలు, ఇతర వాహనాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిస్తున్నారు. ప్రొద్దుటూరు, బద్వేలు, వేంపల్లె, పులివెందుల, మైదుకూరు ప్రాంతాల్లోనూ రెడ్‌జోన్‌ పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే.. ఏ అవసరం లేకున్నా కొందరు ఇళ్లల్లో ఉండలేక అత్యవసరం ఉందని పాత మెడిసిన్‌ ప్రిస్కిప్షన్‌ పట్టుకుని మందుల కోసం అంటూ బయటికి రావడం విమర్శలకు తావిస్తోంది. ఆరోగ్య సమస్య చెబుతుండడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.


బందోబస్తు విధుల్లో ఆర్టీసీ సిబ్బంది, పీఈటీలు

జిల్లాలో లాక్‌డౌన్‌ బందోబస్తు విధుల్లో హోంగార్డు, కానిస్టేబుల్‌, మహిళా కానిస్టేబుల్‌, ఏఆర్‌ ఫోర్స్‌తో కలుపుకుని ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ స్థాయి అధికారి వరకు 4500 మంది నిమగ్నమయ్యారు. పోలీసులకు తోడుగా బందోబస్తు విధుల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఆయా సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్ల వార్డెన్లను నియమించారు. వీరు పోలీసులతో పాటు బందోబస్తులో పాల్గొంటున్నారు.


ఐసోలేషన్‌లో సౌకర్యాలు కల్పించండి

కడప నగరం ఫాతిమా మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవంటూ అక్కడ ఉంటున్న కరోనా బాధితుడు ఒకరు మాట్లాడిన వీడియో వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లాలో ఫాతిమా మెడికల్‌ కళాశాల ఐసోలేషన్‌లో నీటి వసతి లేదని, గదులు చీకటిగా ఉన్నాయని, పిలిచినా ఎవరూ పలకడం లేదంటూ ఆ వీడియోలో వివరించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళితే అదంతా అబద్ధమని, ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొనడం కొసమెరుపు.


జిల్లాలో కోవిడ్‌-19 పాజిటివ్‌ వివరాలు

కడప : 6

ప్రొద్దుటూరు : 11

పులివెందుల : 4

వేంపల్లె : 2

బద్వేలు : 3

మైదుకూరు : 2


7వతేదీ వరకు..

మొత్తం శాంపిల్స్‌ : 503

రిజల్ట్స్‌ వచ్చినవి : 353

నెగటివ్‌ : 329

పాజిటివ్‌ : 28

రిజల్డ్స్‌ పెండింగ్‌ : 181

7వతేదీ తీసిన శాంపిల్స్‌ : 68

Advertisement
Advertisement
Advertisement