గాలి ద్వారా కరోనా.. చాన్సుంది!

ABN , First Publish Date - 2020-07-11T07:05:33+05:30 IST

గాలి ద్వారానూ కరోనా వైరస్‌ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) అభిప్రాయపడింది. ఈ వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌కు గాలి ద్వారా కూడా సోకే శక్తి ఉందని.. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ 32

గాలి ద్వారా కరోనా.. చాన్సుంది!

  • ఇరుకైన జనసమ్మర్ద ప్రాంతాల్లో అతి సూక్ష్మ తుంపర్ల ద్వారా వ్యాప్తి
  • కొన్ని వైద్య ప్రక్రియలు నిర్వహించే సమయంలోనూ అలా వ్యాపించవచ్చు
  • అందుకు ఆధారాలు లభిస్తున్నాయి: డబ్ల్యూహెచ్‌వో.. మార్గదర్శకాల జారీ


గాలి ద్వారానూ కరోనా వైరస్‌ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) అభిప్రాయపడింది. ఈ వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌కు గాలి ద్వారా కూడా సోకే శక్తి ఉందని.. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యుహెచ్‌వోకు ఇటీవలే లేఖ రాసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన చేసింది. ఇరుకైన జనసమ్మర్ద ప్రాంతాల్లో వైరస్‌ సోకినవారి నుంచి వెలువడే అతి సూక్ష్మ తుంపర్ల ద్వారా ఇతరులకు సోకే (ఏరోసాల్‌ ట్రాన్స్‌మిషన్‌) అవకాశం ఉందని పేర్కొంది. ‘‘రెస్టారెంట్లు, వ్యాయామ శిక్షణ తరగతులు, సంగీత కచేరీలు జరిగే ప్రాంతాలలో కొవిడ్‌ ఎలా వ్యాపిస్తోందనే విషయాన్ని తెలుసుకోవటానికి చేసిన అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత.. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశముందని భావిస్తున్నాం. తాజా గాలి, వెలుతురు సోకని గదుల్లో, ఎక్కువ మంది ఒకే చోట నివసించే ప్రాంతాల్లో.. వైరస్‌ సోకిన వ్యక్తులు ఎక్కువ సేపు ఉంటే, గాలి ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని డబ్ల్యూహెచ్‌వోలో కొవిడ్‌-19కు సంబంధించి టెక్నికల్‌ హెడ్‌ మరియావాన్‌ కెర్ఖోవే అన్నారు. అలాగే.. ఏరోసాల్స్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల వైద్య ప్రక్రియల ద్వారా కూడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముందని వెల్లడించారు. ఉదాహరణకు దంత వైద్యులు, మత్తుమందు ఇచ్చే వైద్యులు చాలా సందర్భాల్లో రోగులకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయాల్లో ఉత్పత్తి అయ్యే ఏరోసాల్స్‌ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం..

  • ఎక్కువ మంది గుమ్మిగూడే ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలి.
  • రెస్టారెంట్లు, సంగీత కచేరీలు జరిగే ప్రాంతాలు మొదలైనచోట్ల మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలి. 
  • తక్కువ వెలుతురు, గాలి ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.
  • ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.
  • చేతులను కనీసం 20 సెకన్లపాటు తరచూ కడుక్కొంటూ ఉండాలి.
  • ముఖాన్ని తప్పనిసరి అయితే తప్ప ముట్టుకోకూడదు.
  • చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.


రెండు ఆధారాలు!

కరోనా వ్యాప్తి చెందటం ప్రారంభించిన తొలినాళ్లలో.. ఇది డ్రాప్‌లెట్‌ వైరస్‌ అనే చాలామంది భావించారు. అయితే గాలి ఎక్కువగా సోకని ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమ్మిగూడినప్పుడు ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోందని తేలినప్పుడు.. శాస్త్ర ప్రపంచంలో చర్చ ప్రారంభమయింది. ఉదాహరణకు మార్చి 10న సియాటెల్‌లోని ఒక చర్చిలో 61 మంది సంగీతకారులు ఒక చోట చేరి ప్రాక్టీసు చేశారు. వీరు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నారు. ఒకరిని ఒకరు  తాకలేదు. తరచు శానిటైజర్లను ఉపయోగించారు. అయినా వారిలో 31 మందికి కరోనా సోకింది. ఇద్దరు సంగీతకారులు మరణించారు. దీనితో వైరస్‌ ఏరోసాల్స్‌ ద్వారా వ్యాపించిఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఇదే విధంగా చైనాలోని గాంగ్‌జూలో ఒక రెస్టారెంట్‌లో ఏసీలో నుంచి వచ్చే గాలి ద్వారా పది మందికి వైరస్‌ సోకిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Updated Date - 2020-07-11T07:05:33+05:30 IST