Abn logo
Feb 23 2020 @ 00:44AM

కరోనా: చైనా బాధ్యతారాహిత్యం

అధునాతన సాంకేతికతలతో సమాచార విప్లవం ఒక శాశ్వత విప్లవంగా వర్ధిల్లుతున్న యుగమిది. చైనాలో దశాబ్దాల క్రితం కోట్లాది ప్రజలను బలిగొన్న కరువు కాటకాలకు, ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభణకు ప్రధాన కారణం ఆ దేశ పాలకులు తమ పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరించడమే... మన ‘అర్థ శాస్త్ర’ కర్త నిర్దేశించినట్టు ప్రజలకు భావ స్వాతంత్ర్యమివ్వాలి. ప్రభుత్వమూ, మార్కెట్లూ ఏకమై సమాజాన్ని వెనక్కి నెట్టి వేస్తున్న వైనాన్ని గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవాలన్న సమకాలీన ఆర్థిక వేత్త రఘురాం రాజన్ విజ్ఞతాయుత సూచనని మనం పాటించాలి.


పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం ప్రాముఖ్యత గురించి ఆర్థిక వేత్త అమర్త్య సేన్ తన పుస్తకాలు, ప్రసంగాలలో ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. ఏ సమాజంలోనైనా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కొరవడితే జరిగేదేమిటి, అవి ఎందుకు అవసరమో వివరించడానికి కమ్యూనిస్టు చైనాను ఉదాహరణగా ఆయన చూపుతారు. 1950వ దశకంలో చైనా ప్రభుత్వం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను ఆచరణలోకి తెచ్చింది. అయితే ఆహారోత్పత్తిలో సంపూర్ణ స్వావలంబన లక్ష్య పరిపూర్తికి వాటివల్ల చెప్పుకోదగిన దోహదం జరగలేదు. పైగా తీవ్ర ఆహార కొరత నెలకొన్నది. 1959-62 సంవత్సరాల మధ్య మూడు కోట్ల మంది చైనా ప్రజలు ఆకలిదప్పులకు తాళలేక చనిపోయారు. ఈ ఆకలి చావుల విషాదాన్ని చైనా పాలకులు విశాల ప్రపంచానికే కాదు, కరువు సీమలకు ఆవలవున్న తమ దేశ ప్రజలకు సైతం తెలియనివ్వలేదు. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని అరికట్టడం వల్లే ఆ ఘోర వైపరీత్యాన్ని చైనా పాలకులు కప్పిపుచ్చగలిగారు. ప్రైవేట్ మార్కెట్లకు అనుమతి లేకపోవడంతో పాటు ఆహార సరఫరా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేది.


స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ప్రైవేట్ మార్కెట్లు లేకపోవడం వల్లే కోట్ల సంఖ్యలో ప్రజలు ఆకలిదప్పులతో మరణించవలసిన దుస్థితి ఏర్పడిందని అమర్త్య సేన్ వాదిస్తారు. పత్రికా స్వేచ్ఛ వుంటే ఆ కరువుకాటకాల గురించి చైనా ప్రజలందరికీ తెలిసివుండేది. ప్రైవేట్ మార్కెట్లు ఉన్నట్టయితే వ్యాపారులు అధిక ధరలకే అయినప్పటికీ ఆ క్షామపీడిత ప్రాంతాలకు సరఫరా చేసేవారు. తద్వారా ఆకలిచావులను నివారించడం సాధ్యమయివుండేది.. జననష్టం అపారంగా వుండేది కాదు. పత్రికా స్వేచ్ఛ, ప్రైవేట్ మార్కెట్లు ఉన్న సమాజంలో కరువు కాటకాలను, కనీసం వాటి తీవ్రతను నివారించడం ఎలా సాధ్యమో చెప్పేందుకు బెంగాల్ కరువును అమర్త్య సేన్ ఉదహరిస్తుంటారు. స్వాతంత్ర్యానికి పూర్వం, ద్వితీయ ప్రపంచ యుద్ధ సంగ్రామ కాలంలో బెంగాల్లో ఆహార కొరత ఏర్పడింది. బ్రిటిష్ వలసపాలకులు ఆహారధాన్యాలను ఆగ్నేయాసియా, ఉత్తర ఆఫ్రికాలోని తమ సైనిక దళాలకు పంపడం వల్లే ఆ కరువు నెలకొన్నది. దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఆ కరువు కోరల్లో చిక్కుకుని చనిపోయారు. అయితే ఆ పరాయి పాలనలోనూ మన దేశంలో పత్రికా స్వాతంత్ర్యం వున్నది. ప్రైవేట్ మార్కెట్లూ వున్నాయి. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పుణ్యమా అని వ్యాపార వర్గాలు దక్షిణ భారతావని, పంజాబ్, సింధ్ రాష్ట్రాల వ్యాపారులు బెంగాల్‌కు ఆహారధాన్యాలను తరలించి జననష్టాన్ని కొంతవరకు నివారించగలిగారు. 


చైనా పాలకులు ఇప్పటికీ తమ పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తూనేవున్నారు. ఈ అప్రజాస్వామిక పాలన విషాదమే నేడు చైనా(వుహాన్ రాష్ట్రం)లో దావానలంలా వ్యాపిస్తున్న ‘నావెల్‌ కరోనా వైరస్‌ (nCoV-19). ఈ మహమ్మారి వైరస్‌ విజృంభణ ఆ రాష్ట్రంలో 2019 డిసెంబరు మొదటి వారంలోనే మొదలయింది. అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పొక్కనీయలేదు. బీజింగ్‌లోని జాతీయ ప్రభుత్వానికి సైతం సమాచారమందించలేదు. 2020 జనవరి 19న 40 వేల మందికి వుహాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఆ విందు మరుసటి రోజు అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జాంగ్‌ నన్షన్‌ ఒక సంచలన ప్రకటన చేశాడు. వూహాన్ రాష్ట్రంలో మున్నెన్నడూ వినని, చూడని అంటువ్యాధి ఒకటి విశృంఖలంగా విస్తరిస్తున్నదని ఆ ప్రకటనలో ఆయన వివరించాడు. (ఆసక్తికరమైన విషయమేమిటంటే డాక్టర్ జాంగ్‌ నన్షన్ మహాశయుడే 2002–03లో విరుచుకు పడ్డ SARS అంటు వ్యాధి గురించి కూడా ప్రజలకు ప్రప్రథమంగా వెల్లడించాడు).


కరోనా మహమ్మారి విషయమై చేసిన ప్రకటనకు వుహాన్ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రతికూలంగా ప్రతిస్పందించింది.. డాక్టర్ జాంగ్ నన్షన్‌ను భయపెట్టి ‘తను చెప్పింది నిజం కాదని’ ప్రకటింపజేసింది! అయితే కరోనా మహమ్మారి తీవ్రతను వుహాన్ పాలకులు గుర్తించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరి 23న వూహాన్ నగరాన్ని దిగ్బంధం చేసి, ఒక క్వారంటైన్‌గా అన్నిదార్లు మూసివేసింది. కానీ అప్పటికే అంటే డాక్టర్ జాంగ్ నన్షన్ ప్రకటన చేసిన జనవరి 20 నాటికే ఆ నగరం నుండి మొత్తం 10 లక్షల మంది మామూలు పనుల మీద బయట ప్రాంతాలకు వెళ్ళారు. వారిలో కొంతమంది విదేశీయులు కూడా వున్నారు. ఫలితంగా కరోనా మహమ్మారి ఇతర ప్రాంతాలలోని వారికి కూడా సోకడం ప్రారంభమయింది. పాలకుల బాధ్యతారాహిత్యం వల్లే ఈ ఉపద్రవం సంభవించింది. ఈ సందర్భంగా డాక్టర్ లీ వెలియలింగ్ అనే డాక్టర్ గురించి ప్రస్తావించవలసివున్నది. ఈయన వుహాన్ నగరంలోని ఒక ఆస్పత్రిలో పనిచేస్తుండేవాడు. పాలకుల వైఖరితో విభేదించే సాహసి. 2019 డిసెంబరు 20నుంచి ప్రతి రోజూ సగటున 900 మంది రోగులు తమ ఆస్పత్రికి చికిత్సకు వస్తున్నారని సామాజిక మాధ్యమాల ద్వారా విశాల ప్రపంచానికి తెలియజేశాడు. అయితే వుహాన్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి గురించి ప్రజలకు తెలియజేసి, వ్యాధి సోకకుండా వుండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అప్రమత్తం చేయలేదు. ఇదెంత బాధ్యతా రాహిత్యమో కదా! చైనా పాలకులకు ఇది పరిపాటే. దురదృష్టవశాత్తు డాక్టర్ లీ వెలియలింగ్‌ కరోనా మహమ్మారి బారినపడి మరణించాడు. 


‘అర్థశాస్త్ర’ గ్రంథకర్త చాణక్యుడు ప్రవచించిన ఒక సత్యాన్ని గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా వుంటుంది. ‘రాజు భూమికి చెవులు ఆనించి ప్రజల నాడిని వినాలి. లేకపోతే పెనుముప్పు వాటిల్లుతుంద’ని ఆయన చెప్పారు. మరి చైనా పాలకులు ఇటువంటి వివేకాన్ని పాటిస్తున్నారా? లేదు. పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను నిరాకరిస్తే కరువు కాటకాలు, కరోనా మహమ్మారి మొదలైన విపత్తులను నివారించడం సాధ్యం కాదు. చైనాలో ఇంతవరకు 75 వేల మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 2118 మంది పైగా మరణించారు. ఈ వైరస్‌ గురించి ప్రజలను సకాలంలో హెచ్చరించి వుంటే ఆ మహమ్మారి ఇంతగా వ్యాపించివుండేది కాదు. మృతుల సంఖ్య సైతం ఇంతగా వుండేదికాదు. పౌర సమాజానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వుంటే ఇటువంటి ఉపద్రవాలను ఆదిలోనే ఎదుర్కోవడం సులభమవుతుంది. విఖ్యాత ఆర్థికవేత్త రఘురాం రాజన్‌ తన ‘థర్డ్ పిల్లర్’ అనే పుస్తకంలో ఇలా రాశారు: ‘ప్రభుత్వం, మార్కెట్లు (కార్పొరేట్లు), సమాజం అనేవి ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు. అయితే ప్రభుత్వం, మార్కెట్లు ఏకమై సమాజాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. అసలు సమాజ శ్రేయస్సు కాపాడడానికే ప్రభుత్వం, మార్కెట్లు ఆచరణలోకి వచ్చాయి. ఈ సత్యాన్ని అవి మరచిపోతున్నాయి. ఈ తప్పును గుర్తించి, దాన్ని మనం ఎంత త్వరగా దిద్దుకుంటే అంత మంచిది’. 


మహమ్మారుల విజృంభణకు మరో కారణం ప్రజల ఆహార అలవాట్లు. మనిషికి వేల సంవత్సరాల నుంచి కాల్చిన ఆహారంగానీ, బాగా ఉడికించిన ఆహారంగానీ తినడం అవాటయింది. అతని జీర్ణకోశం అందుకు అనుగుణంగా పరిణామం చెందుతూ వచ్చింది. పెంపుడు జంతువులు మచ్చిక చేసినవై ఉండి, తిన్న తిండి కాలుష్యరహితమై ఉంటుంది. అందుకని ప్రమాదకరమైన బాక్టీరియా వాటి మాంసంలో ఉండదు. ఈ సందర్భంగా చైనా ప్రజల ఆహార అలవాట్ల గురించి కొంత చెప్పాలి. తమకు కావాల్సిన మాంసాహార ఉత్పత్తులను ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌, బ్రెజిల్‌ ఇంకా ఎన్నో దేశాల నుంచి చైనా వారు దిగుమతి చేసుకుంటున్నారు. అవి గొర్రెలు, పందులు మొదలైన జంతువుల మాంసంతో తయారుచేసిన ఉత్పత్తులు. వీటితో సమస్యలేదు. అయితే చైనావారు ఎంతో ప్రీతిగా తినే కొన్ని జంతువులు వారి పెరటి దొడ్లో పెరిగేవి కావు. అవి అడవి జంతువులు. వాటిలో పలురకాల సూక్ష్మ జీవులు వుంటాయి. వాటి నుండి వచ్చిందే ‘కరోనా వైరస్‌-–19’. ఇది ఇప్పుడు విజృంభించి చైనాకు, ప్రపంచానికి అపార నష్టం కలిగిస్తున్నది. అసలే ఆర్థిక వ్యవస్థల మందగమనాలతో సతమతమవుతున్న ప్రపంచం మీద మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కరోనా మహమ్మారి విరుచుకు పడింది. 


ఈ వ్యాధి గురించి చైనా ప్రభుత్వం సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఇప్పుడే కాదు, సార్స్ వైరస్‌ విజృంభించినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు ఏకీకృతమై వున్నాయి. తమ సామాజిక స్థిరత్వం భగ్నమవుతుందన్న భయంతోనో లేదా మరేదైనా కారణంతోనో చైనా పాలకులు అన్ని విషయాలను దాస్తున్నారు. ఈనాడు అంతర్జాలం, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ లాంటి ఎన్నో అధునాతన సాంకేతికతల ద్వారా ఏ సమాచారమైనా చిటికెలో సమస్త ప్రపంచానికి అందుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో సమాచారాన్ని తొక్కి పెట్టడం వల్ల అన్ని విధాలా అపారనష్టం సంభవిస్తున్నది. సమాచార విప్లవానికి చైనా ఎందుకనో భయపడుతున్నది. వివిధ వ్యవహారాలలో తాను అనుసరిస్తున్నవి వక్రమార్గాలనే నిజం ప్రపంచానికి తెలుస్తుందనేనా?ఇరుగుపొరుగు దేశాలను బీజింగ్ పాలకులు భయపెట్టే విధానం చూస్తే అది నిజమే అనిపిస్తున్నది. చాణుక్యుడు చెప్పిన మరో సత్యాన్ని కూడా మనం సదా జ్ఞాపకముంచుకోవాలి. ఆ రాజనీతిజ్ఞుడు ఇలా అన్నాడు: ‘రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజుతో పాటు ప్రజలు కూడా ఆర్థికంగా బలపడాలి. పాలితులకు భావ స్వాతంత్ర్యం ఉండాలి; వారు స్వేచ్ఛగా మాట్లాడాలి. లేనిపక్షంలో రాజ్యంలో ఏమి జరుగుతున్నదో రాజుకు తెలియదు’.

ఆచార్య చుంచు సుబ్రహ్మణ్యం

ఆర్థికశాస్త్ర విశ్రాంతాచార్యులు

వి.దేవానంద్‌

పరిశోధకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం

Advertisement
Advertisement
Advertisement