కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-19T04:56:30+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో థర్డ్‌వేవ్‌ తడాఖా చూపుతోంది.

కరోనా పంజా

  • పోలీస్‌, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను వదలని మహమ్మారి
  • భారీగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
  • పోలీస్‌స్టేషన్‌లోకి రావొద్దంటున్న అధికారులు
  • ఆరుబయటే ఫిర్యాదుల స్వీకరణ


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో థర్డ్‌వేవ్‌ తడాఖా చూపుతోంది. కొవిడ్‌ కేసులు గణనీయంగా.. వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మహమ్మారి ప్రభుత్వ కార్యాలయాలపైనా తన పంజా విసురుతోంది. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారు. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌  / ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ ప్రతినిధి / తాండూరు / మేడ్చల్‌ : అందరిని భయపెట్టే పోలీసులు... ఇప్పుడు కొవిడ్‌ను చూసి భయపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించాలంటే పోలీసులు వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైరస్‌ వ్యాప్తి అధకంగా ఉండటంతో పోలీ్‌సస్టేషన్‌లోకి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదులు బయట నుంచే తీసుకుంటున్నారు. పోలీసుశాఖలో సీఐ, ఎస్సైలతోసాటు కానిస్టేబుల్స్‌కు వరుసగా కరోనా బారిన పడటంతో మిగిలిన సిబ్బంది విధులకు రావాలంటేనే హడలెత్తుతున్నారు. చేవెళ్ల సీఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌, 9మంది కానిస్టేబుల్స్‌కు కరోనా సోకింది. షాద్‌నగర్‌ పరిధిలో సీఐతోపాటు నలుగురు కానిస్టేబుల్స్‌ను మహమ్మారి వదల్లేదు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఓ సీఐతోపాటు ఇద్దరు ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు 21మంది కానిస్టేబుల్స్‌, ఇద్దరు హోంగార్డులు వైరస్‌ బారిన పడ్డారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో 20మందికి కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. పెద్దసంఖ్యలో పోలీసులు వైరస్‌ బారిన పడటంతో స్టేషన్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదుదారుల కోసం పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ప్రత్యేక టెంట్‌ వేశారు. అలాగే హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో 15 మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, మరో 14 మంది కానిస్టేబుల్స్‌ వైరస్‌ బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్నారు. చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 8మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 11 మంది పోలీసులకు కరోనా సోకగా అందులో హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు ఉండగా, 10 మంది కానిస్టేబుల్స్‌ ఉన్నారు. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 20 మంది పోలీసులు కరోనాతో బాధపడుతున్నారు. ఇందులో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది ఉన్నారు. 


వైద్య సిబ్బందినీ వదలని కరోనా

కరోనా కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముఖ్యంగా వైద్యసేవలు అందించే వైద్య సిబ్బందిపై వైరస్‌ పంజా విసురుతోంది. డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు కిందిస్థాయి సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. వైద్యసిబ్బందికి కరోనా సోకడంతో ఇతర సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 53 మంది వైద్య సిబ్బంది కరోనా సోకడంతో విలవిల్లాడుతున్నారు. ఇందులో 9మంది డాక్టర్లు ఉండగా, 44 మంది సిబ్బంది ఉన్నారు. అత్యధికంగా షాద్‌నగర్‌ పరిధిలో వైద్య సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు కోవిడ్‌ రక్కసితో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం ఆర్డీవోను, కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో నలుగురు సిబ్బందిని మహమ్మారి వదల్లేదు.


కలెక్టరేట్‌లో కలకలం 

వికారాబాద్‌ కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేపుతోంది. జిల్లా కలెక్టర్‌కు సహాయకులుగా వ్యవహరిస్తున్న ఓ తహసీల్దార్‌తోపాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ సోకినట్లు తెలిసింది. వీరిలో ఒక డ్రైవర్‌ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ సెక్షన్‌లో ఓ ఉద్యోగికి కూడా పాజిటివ్‌ వచ్చింది. కలెక్టరేట్‌లో ఉండే ఓ శాఖ జిల్లా అధికారి కూడా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లతోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది.


తాండూరు డివిజన్‌లో 102 పాజిటివ్‌ కేసులు

తాండూరు డివిజన్‌లో మంగళవారం కరోనా కేసులు సెంచరీ దాటాయి. 102 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాండూరు జిల్లా ప్రభుత్వా సుపత్రిలో మంగళవారం 206మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 91 మందికి కొవిడ్‌ వచ్చినట్లు నిర్ధారిం చారు. తాండూరు మండలంలో నలుగురికి, పెద్దేముల్‌ మండలంలో ముగ్గురికి, యాలాల మండలంలో ముగ్గురికి, బషీరాబాద్‌ మండలంలో ఒకరికి పాజి టివ్‌గా నిర్ధారణ జరిగినట్లు వైద్య సిబ్బంది వెల్లడిం చారు. తాండూరు ప్రభుత్వ జిల్లాసుపత్రిలో ఆర్‌ఎంఓ తోపాటు నలుగురు వైద్యులకు, ఆరుగురు వైద్య సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వారిని హోం క్వారంటైన్‌కు పరిమితం చేసినట్లు తాండూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌ తెలి పారు. తాండూరు మండలం కరణ్‌కోట్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో రెండు రోజుల క్రితం తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వాంతులు, విరేచనాలతో అతిసార బారినపడి అతను మంగళవారం మృతి చెందినట్లు జిల్లాసుపత్రి సూపరింటెండెంట్‌ వెల్లడిం చారు. పోలీసుశాఖకు చెందిన షీటీంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రాగా షీటీంను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమై బ్యాంకులో శానిటైజేషన్‌ చేయించారు.


ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 1,672 పాజిటివ్‌ కేసులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ కేసులు శరవేగంగా పెరుగుతు న్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,672 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 591 కేసులు నమోదు కాగా, నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో 594 కరోనా కేసులు నమోద య్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 252 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 235 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


కట్టడి చర్యలు కరువు

జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతున్నా కట్టడి చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో ముందస్తు జాగ్రత్తలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.  సందర్శకులు వచ్చే కార్యాలయాల్లో చాలావరకు శానిటైజర్‌ అందుబాటులో లేదు. మాస్క్‌ ధరిస్తేనే కార్యాలయాల్లోకి అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఉమ్మడి జిల్లాలో పోలీసుశాఖలో కొవిడ్‌ వివరాలు

సీఐలు : 03

ఎస్సైలు : 02

హెడ్‌కానిస్టేబుల్స్‌ : 03

కానిస్టేబుల్స్‌ : 92

హోంగార్డులు : 02

మొత్తం : 102

పారిశుధ్య కార్మికులు

ఇబ్రహీంపట్నం : 03


వైద్యశాఖలో బాధితుల వివరాలు

నియోజకవర్గం డాక్టర్లు సిబ్బందికి

చేవెళ్ల 02 05

షాద్‌నగర్‌ 00 15

ఇబ్రహీంపట్నం 01 05

మహేశ్వరం 01 03

తాండూరు 05 06

పరిగి 00 01

మేడ్చల్‌ 00 09

మొత్తం 09 44

Updated Date - 2022-01-19T04:56:30+05:30 IST