ద్రావిడ వర్శిటీపై కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-23T06:33:56+05:30 IST

కరోనా పంజా దెబ్బకు ద్రావిడ విశ్వవిద్యాలయం విలవిలలాడుతోంది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా సుమారు 40-50 మంది విద్యార్థులు, 15-20 మంది బోధన, బోధనేతర సిబ్బంది కరోనా బారిన పడినట్లు సమాచారం.

ద్రావిడ వర్శిటీపై కరోనా పంజా

పాఠశాలలూ మినహాయింపు కాదు


కుప్పం, జనవరి 22: కరోనా పంజా దెబ్బకు ద్రావిడ విశ్వవిద్యాలయం విలవిలలాడుతోంది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా సుమారు 40-50 మంది విద్యార్థులు, 15-20 మంది బోధన, బోధనేతర సిబ్బంది కరోనా బారిన పడినట్లు సమాచారం. ఒక్క ప్రసారాంగలోనే ఆరుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు చెబుతున్నారు. సంక్రాంతి సెలవులకు సొంత గ్రామాలకు వెళ్లిన సిబ్బంది, విద్యార్థులు తిరిగి విశ్వవిద్యాలయం చేరుకున్నాక పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగాయంటున్నారు.కుప్పం జడ్పీ బాలికోన్నత పాఠశాలలోనే ఇటీవల ముగ్గురు ఉపాధ్యాయులతోపాటు మరో నలుగురు వారి కుటుంబ సభ్యులకు సైతం కరోనా సోకింది. అలాగే ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఆర్‌.పేట ఉన్నత పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు కరోనా వాత పడ్డారు. కుప్పం మండలంలో 25మంది ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. మరో 25మందికి కూడా కరోనా సోకినట్లు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ సర్టిఫికెట్‌తో అధికారికంగా ఆరుగురు ఉపాధ్యాయులు సెలవు తీసుకున్నారు. మిగిలిన వారు మెడికల్‌ సర్టిఫికెట్‌తోనే సెలవులో వెళ్లారు. గతేడాది కరోనా సోకిన వారికి 13 రోజులపాటు ప్రత్యేక సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పుడు ఉన్న సెలవులనే వినియోగించుకోవాలనడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కరోనా సోకినా అంతగా ప్రభావం చూపని ఉపాధ్యాయులు సెలవులను వృథా చేసుకోవడం ఎందుకని రెండుమూడు రోజులపాటు మాత్రం సెలవులో వెళ్లి, తర్వాతి రోజునుంచి పాఠశాలలకు వచ్చేస్తున్నారు. దీంతో విద్యాసంస్థల్లో పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రైవేటు విద్యాసంస్థలూ ఇందుకు  మినహాయింపు కాదు.పెద్దయెత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నా యాజమాన్యాలు బయట పెట్టడంలేదు. ఫీజులకోసం గుట్టుగా స్కూళ్లను నడిపించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - 2022-01-23T06:33:56+05:30 IST