ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-19T04:05:44+05:30 IST

మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ -19 కరోనా వైరస్‌ అన్ని వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్య ప్రజలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలతోపాటు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ ఉధృతి నుంచి ప్రజలను కాపాడేందుకు ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులను సైతం కరోనా విడిచి పెట్టడం లేదు.

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై కరోనా పంజా
ఆర్టీసీ బస్టాండులో సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

వ్యాధిబారిన పడుతున్న వైద్యులు, సిబ్బంది

పోలీస్‌ శాఖనూ వీడని మహమ్మారి

డిపార్టుమెంట్లపైనా విరుచుకుపడుతున్న వైరస్‌

మంచిర్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ -19 కరోనా వైరస్‌ అన్ని వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్య ప్రజలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలతోపాటు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ ఉధృతి నుంచి ప్రజలను కాపాడేందుకు ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌  అయిన వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులను సైతం కరోనా విడిచి పెట్టడం లేదు. జిల్లాలో పెద్ద మొత్తంలో సామాన్య ప్రజలతోపాటు వైద్య సిబ్బంది, పోలీసులు వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది.

కరోనా బారిన వైద్య సిబ్బంది...

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పది మంది వైద్యులు, మరో 40 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే రోగులను పరీక్షించాల్సిన వైద్యులు, సిబ్బందికి వైరస్‌ సోకుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించే ఆరుగురు సిబ్బంది, ఒక వైద్యుడు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు పారిశుధ్య విభాగంలో పని చేసే పలువురు సిబ్బందికి కరోనా సోకడంతో వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, ఒక ల్యాబ్‌టెక్నిషియన్‌ కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురు జిల్లాలోని పీహెచ్‌సీలలో విధులు నిర్వహించే వైద్యులు ఉన్నారు.

పోలీస్‌ శాఖనూ వీడని వైరస్‌

కరోనా కట్టడిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పోలీస్‌ శాఖనూ వైరస్‌ వీడడం లేదు. థర్డ్‌ వేవ్‌ విజృంభణతో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏసీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు వివిధ పోలీస్‌స్టేషన్లలో పని చేస్తున్న సుమారు 70 మందికి కరోనా సోకింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, కిందిస్థాయి సిబ్బంది కొవిడ్‌ బాధితుల్లో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా హోం ఐసోలేషన్లలో ఉంటూ  చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా కరోనా విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో అధికారులు, సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

డిపార్టుమెంట్లలో కలకలం

ఆర్టీసీలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. మంచిర్యాల డిపో పరిధిలోనే 11 మంది సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా మంగళవారం మరో ఐదుగురికి వైరస్‌ సోకింది. ఆర్టీసీ సిబ్బంది కోసం బస్టాండ్‌లో వైద్య సిబ్బంది కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వైరస్‌ బారిన పడితే ప్రజలకు సోకుతుందనే ఉద్దేశ్యంతో పరీక్షలు చేస్తున్నారు. డ్రైవర్లు డ్యూటీకి వెళ్లే ముందు మద్యం సేవించిందీ, లేనిది తెలుసుకునేందుకు ఆర్టీసీ అధికారులు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేస్తారు. ఒకే పరికరంతో సిబ్బంది అందరికీ పరీక్షలు చేస్తుండటంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పంచాయతీశాఖలోనూ సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. రెండు రోజుల క్రితం బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

మున్సిపల్‌ సిబ్బందికి కరోనా

మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బందిలో 6గురికి మంగళవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించుకోగా 6గురికి పాజిటివ్‌ అని తేలడంతో సిబ్బంది జాగ్రత్త పడ్డారు.  కార్యాలయానికి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2022-01-19T04:05:44+05:30 IST