పసివాళ్లపై కరోనా పంజా!

ABN , First Publish Date - 2022-01-22T07:16:53+05:30 IST

పసిపిల్లలపైనా కరోనా పంజా విసురుతోంది. తొలి రెండు

పసివాళ్లపై కరోనా పంజా!

  • నాలుగు రోజుల్లో 13 మంది 
  • చిన్నారులకు కరోనా పాజిటివ్‌ 
  • జ్వరం, ఆయాసం, దగ్గు
  • కడుపు నొప్పి, విరేచనాలు
  • నిలోఫర్‌లో చేరిక.. మున్ముందు 
  • పిల్లల్లో కేసులు పెరిగే ప్రమాదం 
  • చిన్నారులకు ప్రత్యేకంగా 150 
  • పడకలతో ఐసొలేషన్‌ వార్డు
  • కొవిడ్‌ సోకిన 8 మంది గర్భిణులకూ చికిత్స 



మంగళ్‌హాట్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పసిపిల్లలపైనా కరోనా పంజా విసురుతోంది. తొలి రెండు వేవ్‌లకు భిన్నంగా ఇప్పుడు పిల్లలను అస్వస్థత పాల్జేస్తోంది. నిలోఫర్‌కు గత నాలుగు రోజుల్లో వివిధ లక్షణాలతో వచ్చిన పిల్లల్లో 13 మందికి కరోనా అని తేలింది. గాంధీలో కొవిడ్‌ సోకిన ఐదుగురు పిల్లలు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం జ్వర సర్వేతో పిల్లల్లో మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాగా కరోనా సోకిన 13 మంది పిల్లల కోసం నిలోఫర్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. రానున్న రోజుల్లో కొవిడ్‌తో మరింత మంది చిన్నారులు ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్‌తో వచ్చే చిన్నారుల కోసం ప్రత్యేకంగా 150 పడకలతో ఐసొలేషన్‌ వార్డును సిద్ధం చేశారు. 


ప్రస్తుతం నిలోపర్‌లో చికిత్స పొందుతున్న 13 మంది చిన్నారులు జ్వరం, ఆయాసం, జలుబు, విరేచనాలు, కడుపు నొప్పితో ఆస్పతిక్రి వచ్చారు. నమూనాలు సేకరించి పరీక్షించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రోజూ ఓపీ చికిత్సల నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు, కడుపు నొప్పి, విరేచనాలతో చిన్నారులు వస్తున్నారు.


నిత్యం 1000-1100 వరకు ఓపీ ఉండగా అందులో వందకు పైనే చిన్నారులు వస్తున్నారు. గత 10 రోజుల్లో నిలోపర్‌లోని 20 మందికి పైగా గర్భిణులకు కొవిడ్‌ సోకింది. వీరిలో 12 మందికి ప్రసవాలు చేశారు. మరో 8 మంది గర్భిణులు ఐసొలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువులపై కరోనా ప్రభావం పడకుండా ఉండేందుకు నిలోఫర్‌ ఆస్పత్రి వైద్య బృందం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రసవించిన తల్లులు తప్పని సరిగా మాస్కులు ధరించేలా అక్కడి సిబ్బంది ద్వారా అవగాహన పెంచడంతో పాటు పసికందులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. కొవిడ్‌ పరీక్షల నిమిత్తం నమూనాలు స్వీకరించేందుకు మూడు షిఫ్టుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.  



పిల్లలకు సొంత వైద్యం వద్దు

కరోనా పాజిటవ్‌ వచ్చిన చిన్నారులకు 103 డిగ్రీల జ్వరంతో పాటు దమ్ము, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుందని నిలోఫర్‌ వైద్యులు తెలిపారు. 24 గంటల పాటు అత్యధిక జ్వరం ఉంటుందన్నారు. ఈ లక్షణాలు ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించాలని సూచించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే సొంత వైద్యం అస్సలు చేయరాదని, ముఖ్యంగా యాంటి బయాటిక్స్‌ వాడడం వల్ల ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, తగిన మోతాదులో పారసిటమాల్‌ మందులను వాడటంతో పాటు పిల్లల వైద్యులను సంప్రదించాలని తెలిపారు. 


Updated Date - 2022-01-22T07:16:53+05:30 IST