సింహాలపై కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-05T08:12:12+05:30 IST

రాజసంగా జూలు విదిల్చి.. దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించే సింహాలపైనా కరోనా పంజా విసిరింది.

సింహాలపై కరోనా పంజా

  • హైదరాబాద్‌ జూలోని 8 సింహాలకు వైరస్‌
  • దేశంలోనే తొలిసారిగా జంతువులకు  
  • ఆహారాన్నిచ్చే కేర్‌ టేకర్ల ద్వారానే వ్యాప్తి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ,/మదీనా, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజసంగా జూలు విదిల్చి.. దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించే సింహాలపైనా కరోనా పంజా విసిరింది. హైదరాబాద్‌ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని ఎనిమిది ఆసియా సింహాలకు కరోనా సోకింది. జంతువులకు కరోనా సోకడం దేశంలో ఇదే తొలిసారి. కరోనా సోకిన వాటిలో నాలుగు ఆడ,  నాలుగు మగ సింహాలు ఉన్నాయి. జూ పార్క్‌లో మొత్తం 11 ఆసియా సింహాలుండటంతో.. కరోనా సోకిన సింహాలను వేర్వేరు ఎన్‌క్లోజర్స్‌లో గాలి వెలుతురు వచ్చే విధంగా ఐపొలేషన్‌ చేశారు. ఆ సింహాలకు కావాల్సిన ఆహారం, అవసరమైన మందులను కూడా జూ వెటర్నరీ వైద్యులు అందిస్తున్నారు. ప్రస్తుతం సింహాల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వారు పేర్కొన్నారు. 


సింహాలకు కరోనా ఎలా సోకిందన్న దానిపై కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఇటీవల జూ సిబ్బందిలో దాదాపు 30 మందికిపైగా కరోనా సోకింది. వీరిలో సింహాల కేర్‌ టేకర్లూ ఉన్నారని.. వారి ద్వారానే సింహాలకు కరోనా వచ్చిందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఈ సింహాలకు తీవ్ర జ్వరంతో పాటు పొడి దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులుండటాన్ని కేర్‌ టేకర్స్‌ గమనించారని జూపార్క్‌ సిబ్బంది తెలిపారు. గతనెల 24న ముక్కు, గొంతు నుంచి నమునాలను పశువైద్యుల బృందంతో సేకరించి తార్నాకలోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించినట్లు వెల్లడించారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో 8 సింహాలకు కరోనా పాజిటివ్‌గా సీసీఎంబీ మంగళవారం నిర్ధారించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సింహాలకు సీటీస్కాన్‌ పరీక్షలు చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకుని చికిత్సను అందించాలని యోచిస్తున్నారు. కాగా హైదరాబాద్‌ జూలో కరో నా సోకిన సింహాలన్నీ కోలుకుంటున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 


కోలుకుంటున్నాయి 

కరోనా లక్షణాలు కనిపించిన రోజు నుంచే ముందు జాగ్రత్తగా చికిత్స ప్రారంభించాం. లక్షణాలు కనిపించిన సింహాలను వేర్వేరుగా ఐసోలేషన్‌ చేసి మందులు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. దీంతో సింహాలు అన్నీ ఇప్పటికే బాగా కోలుకున్నాయి. సింహాలన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. సింహాలు ఆహారం తినడంతో పాటు లక్షణాలు పూర్తిగా తగ్గాయి. ఇతర జంతువులకు కూడా ముందు జాగ్రత్తగా పలు విటమిన్‌ మందులను అందిస్తున్నాం.

 డాక్టర్‌ ఎంఏ హకీం, జూ డిప్యూటీ డైరెక్టర్‌

Updated Date - 2021-05-05T08:12:12+05:30 IST