రెవెన్యూ, సర్వేపై కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-06T09:38:50+05:30 IST

రెవెన్యూ, సర్వే శాఖలో కరోనా మహమ్మారి వణకు పుట్టిస్తోంది. ఒకవైపు భూముల రీ సర్వే ప్రాజెక్టు, మరోవైపు రెగ్యులర్‌ రెవన్యూ సేవలు కొనసాగుతుండటంతో ఉద్యోగులు, అధికారులు కరోనా బారిన పడుతున్నారు

రెవెన్యూ, సర్వేపై కరోనా పంజా

ఇప్పటివరకు 26 మంది సిబ్బంది మృతి.. 80 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స

భయంభయంగా ఉద్యోగులు విధులు

వర్క్‌ఫ్రమ్‌ హోం అవకాశమివ్వాలని వినతి

కరోనా ఉధృతి త గ్గేదాకా రీ సర్వే ఆపాలి

ప్రభుత్వాన్ని కోరుతున్న సర్వే ఉద్యోగులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రెవెన్యూ, సర్వే శాఖలో కరోనా మహమ్మారి వణకు పుట్టిస్తోంది. ఒకవైపు భూముల రీ సర్వే ప్రాజెక్టు, మరోవైపు రెగ్యులర్‌ రెవన్యూ సేవలు కొనసాగుతుండటంతో ఉద్యోగులు, అధికారులు కరోనా బారిన పడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సెకండ్‌ వేవ్‌లో 120 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. వారిలో 26 మంది మరణించారని, 80 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత కోసం వర్క్‌ఫ్రమ్‌ హోం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు సర్వేశాఖలోనూ ఎక్కువగా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కరోనా ఉధృతి తగ్గేవరకు భూముల రీ సర్వే పనులు వాయిదా వేయాలని కోరుతున్నారు.


ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ కీలకమైనది. కరోనా కట్టడి సేవల్లోనూ అది కీలకభాగస్వామిగా ఉంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు, సిబ్బంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది కరోనా బారినపడుతున్నారు. గతేడాది కరోనా సమయంలో 1200 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. 47 మంది మరణించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘం లెక్కల ప్రకారం సెకండ్‌ వేవ్‌లో 40 రోజుల వ్యవధిలో 850 మందికి కరోనా సోకగా.. 19 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం నెల్లూరు రూరల్‌ మండలం తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వీఆర్‌వో ఇరగవరపు వెంకటేశ్వరరావు రెండురోజుల క్రితం కరోనాతో మరణించారు. ఇప్పటికే  మగ్గురు సీనియర్‌ అధికారులు చికిత్స పొందుతున్నారని, ఆరుగురు తహసీల్దార్లు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  


ఎందుకీ పరిస్థితి? 

రాష్ట్రంలో ప్రస్తుతం భూముల సమగ్ర సర్వే సాగుతోంది. దీనికోసం రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పనిచేస్తున్నారు. దీనికితోడు శిక్షణ కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో రైతులు, భూ యజమానులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. మరోవైపు సర్వేశాఖ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటి వల్ల కరోనా వైరస్‌ అల్లుకుపోతోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు శిక్షణ కార్యక్రమాలు నిలిపివేయాలని సర్వేయర్లు ఉన్నతాధికారులను కోరారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో తాము శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేమని కొందరు తహసీల్దార్లు చెప్పేశారు. ఈ విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. 


రీ సర్వే వాయిదా వేయాలి: ఉద్యోగుల సంఘం

కరోనా తీవ్రత కొనసాగుతున్నందున అది తగ్గేవరకు భూముల రీ సర్వే పనులను వాయిదా వేయాలని సర్వే ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో పలువురు సర్వేయర్లు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కరోనా తీవ్రత తగ్గేవరకు రీ సర్వే పనులు, శిక్షణ కార్యక్రమాలు వాయిదావేస్తూ ఆదేశాలివ్వాలని సం ఘం కోరింది.


సర్వే శాఖ పరిస్థితి దయనీయం

సర్వేశాఖ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంవ్యాప్తంగా 12 మందికిపైగా సర్వే ఉద్యోగులు మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో కొనపాల్‌ అప్పారావు, విశాఖ జిల్లాలో వీఆర్‌ఎం పాత్రో, కుమార్‌, చిట్టిబాబు, నరేశ్‌ కుమార్‌ మరణించారు. వీరంతా సర్వేయర్లు. విజయనగరం జిల్లాలోనూ నలుగురు, తిరుపతిలోని స్పెషల్‌ యూనిట్‌లో పనిచేస్తోన్న బాలరాజు చనిపోయారు. గోలుగొండ మండలం, సి.హెచ్‌ నాగాపురం గ్రామ సర్వేయర్‌ జీవిత బుధవారం కరోనాతో మరణించారు. గుంటూరు జిల్లాలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే (డీఐ) పానకాల శర్మ, మరో సర్వేయర్‌ శేషగిరి రావు కరోనాతోనే ప్రాణాలు విడిచారు.


సర్వేశాఖ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ను ఇటీ వల కరోనా కబళించింది. నలుగురు సీనియర్‌ అధికారులు, మరి కొందరు సిబ్బంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామంతో సర్వే ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. తమకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని కోరినా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. 

Updated Date - 2021-05-06T09:38:50+05:30 IST