కరోనాను నియంత్రణకే ఇంటింటి జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-23T05:21:16+05:30 IST

కరోనాను నియంత్రణకే ఇంటింటి జ్వర సర్వే

కరోనాను నియంత్రణకే ఇంటింటి జ్వర సర్వే
పరిగి : జ్వర సర్వేలో పాల్గొని కరోనా మందులు అందజేస్తున్న పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, వైద్యసిబ్బంది

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 
  • కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే 
  • ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మందులు అందజేత

పరిగి/పూడూర్‌/దౌల్తాబాద్‌/బషీరాబాద్‌/నవాబుపేట/ఘట్‌కేసర్‌ జనవరి 22 : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకే ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వేను నిర్వహిస్తున్నామని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి మునిసిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో వైద్యసిబ్బంది చేపడుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి కరోనా మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు, ఒంటినొప్పులు, ఇతర లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని, కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా వారంరోజులపాటు మందులు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరాన్ని పాటించాలని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్పా బయటకు వెళ్లరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, కమిషనర్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్లు అర్చన, నాగేశ్వర్‌, మునీరు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రవి, ఫసీయోద్దీన్‌లు పాల్గొన్నారు.  కాగా, కొత్తగా రోడ్లు వేయడానికి రూ.5.50 కోట్ల నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి నుంచి సుల్తాన్‌నగర్‌, నారాయణపూర్‌ వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ.22లక్షలతో చేపట్టనున్న పనులను పరిశీలించారు. పరిగి-తొండపల్లి, సుల్తాన్‌పూర్‌-ఊటుపల్లి గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణాలు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పూడూర్‌ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు ఫీవర్‌ సర్వేను నిర్వహించారు. మండలవ్యాప్తంగా 1814 కుటుంబాలను సర్వే చేయగా జ్వర లక్షణాలు ఉన్న 62 మందిని గుర్తించి 16 మందికి మెడికల్‌ కిట్లు అందించారు. అలాగే దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో 2667 ఇళ్లలో సర్వే చేయగా 9876 మందిని పరీక్షించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా 24 మందికి జ్వర లక్షణాలు ఉండటంతో మెడికల్‌ కిట్లను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండలంలోని నీళ్లపల్లి, జలాల్‌పూర్‌, పర్వత్‌పల్లి గ్రామాల్లో జరుగుతున్న జ్వర సర్వేను ఎంపీడీవో రమేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యసిబ్బందితో కలిసి సర్వే తీరును స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి, వివరాలను పక్కగా నమోదు చేయాలని, ఏమైనా లక్షణాలుంటే మెడికల్‌ కిట్లు అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా నవాబుపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఆశావర్కర్లు, వైద్య బృందం పర్యటించి జ్వర సర్వే నిర్వహించారు. ఈ మేరకు 10,612 గృహాల్లో సర్వేచేయగా 66 మంది జ్వరం బారిన పడ్డారని, 66 మందికి మెడికల్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. అదేవిధంగా కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి సూచించారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో కమిషనర్‌ సురే్‌షతో కలిసి ఫీవర్‌ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో 18 బృందాలు 1629 ఇళ్లను సర్వేచేయగా 14మందికి లక్షణాలున్నట్లు గుర్తించి మందుల కిట్లను అందజేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కౌన్సిలర్‌ సాయిరెడ్డి, రాజశేఖర్‌. కో-ఆప్షన్‌ సభ్యుడు అక్రం అలీ, నాయకులు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఘట్‌కేసర్‌ మండల పరిధిలో గత రెండు రోజులుగా 2998 ఇళ్లలో సర్వే చేసి 299 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. వారందరికీ మెడికల్‌ కిట్లను అందజేయడంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు కమిషనర్‌ వసంత తెలిపారు.

Updated Date - 2022-01-23T05:21:16+05:30 IST