Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి

  • వందశాతం వ్యాక్సినేషన్‌ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ
  • టీకా వేసుకోవడం, మాస్కులు ధరించడం తప్పనిసరి
  • సమీక్ష సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణ చర్యలు తప్పకుండా పాటించాలని, ఈనెలాఖరు వరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై గురువారం డీపీఆర్‌సీలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశానికి ఆమె హాజరై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్క్‌ ధరించడం, వ్యాక్సిన్‌ వేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి కరోనా నియంత్రణ చర్యలు ప్రజలు పాటించాలన్నారు. కరోనాపై ఆందోళన చెందవద్దని, అపోహలు, దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సంపూర్ణ వ్యాక్సినేషన్‌ లక్ష్యం కోసం పంచాయతీ, మునిసిపల్‌, విద్య, వైద్య ఆరోగ్యం తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌పై పోరాడేందుకు రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ వేసుకోకుండా వెనుకంజ వేస్తున్న ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని ఆమె అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. తక్కువ వ్యాక్సినేషన్‌ ఉన్న ప్రాంతాలపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలని, వలస కార్మికులను గుర్తించి వ్యాక్సిన్‌ వేయాలన్నారు.  క్షేత్రస్థాయి ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని, ఏరియా ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌, రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. విద్యా సంస్థలు, వసతిగృహాల్లో కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఒమైక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్నందున జిల్లా ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ సెప్టెంబర్‌ 15 నుంచి ఇప్పటివరకు జిల్లాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 5.82 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేశామన్నారు. మొదటి డోస్‌ వేసుకున్న 27 వేల మంది 2వ డోస్‌కు అర్హులుగా ఉన్నారని, వీరందరి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, టీఎ్‌సడబ్ల్యుఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, డీఎంహెచ్‌వో తుకారాంభట్‌, డీఐవో జీవరాజ్‌, డీఎ్‌సవో అరవింద్‌, డీఈవో రేణుకాదేవి, డీపీవో మల్లారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement