‘పట్టు’తప్పుతోంది..!

ABN , First Publish Date - 2021-08-01T05:53:06+05:30 IST

కరోనా ప్రభావం పట్టు పరిశ్రమల నిర్వహణపై పడింది. గత ఏడాదిగా అనుకున్న లక్ష్యాల మేరకు మల్బరీ తోటల సాగు, పట్టు గూళ్ల (కకూన్స్‌) ఉత్పత్తి జరగడం లేదు. ఎంతో ఓర్పుతో చేయాల్సిన పట్టు సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చిన్న, మధ్యతరగతి రైతు కుటుంబాలకు మల్బరీ సాగు ఉపాధి కల్పిస్తూ వస్తోంది. గతంలో ఎక్కువ మంది రైతులు సాగు చేసేవారు. క్రమేపీ సాగు తగ్గుముఖం పట్టింది. గత ఏడాది కరోనాకు ముందు మల్బరీ సాగు ఆశాజనకంగా ఉండేది. 11 మండలాల్లోని 40 గ్రామాల్లో 525 ఎకరాల్లో మల్బరీ సాగుచేసేవారు. ప్రత్యక్షంగా 382 రైతు కుటుంబాలు పట్టు గూళ్ల పెంపకం, దారం ఉత్పత్తి ద్వారా లబ్ధి పొందేవి. పట్టు ఉత్పత్తి చేసిన గూళ్లకు ప్రభుత్వం కిలోకు రూ.50 చెల్లిస్తోంది. దీంతో పాటు ఎకరాకు రూ

‘పట్టు’తప్పుతోంది..!




కరోనా దెబ్బకు మల్బరీ సాగులో వెనుకంజ

లక్ష్యాలకు దూరంగా పట్టు పరిశ్రమ

రైతుల నిరాసక్తత

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా ప్రభావం పట్టు పరిశ్రమల నిర్వహణపై పడింది. గత ఏడాదిగా అనుకున్న లక్ష్యాల మేరకు మల్బరీ తోటల సాగు, పట్టు గూళ్ల (కకూన్స్‌) ఉత్పత్తి జరగడం లేదు. ఎంతో ఓర్పుతో చేయాల్సిన పట్టు సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చిన్న, మధ్యతరగతి రైతు కుటుంబాలకు మల్బరీ సాగు ఉపాధి కల్పిస్తూ వస్తోంది. గతంలో ఎక్కువ మంది రైతులు సాగు చేసేవారు. క్రమేపీ సాగు తగ్గుముఖం పట్టింది. గత ఏడాది కరోనాకు ముందు మల్బరీ సాగు ఆశాజనకంగా ఉండేది. 11 మండలాల్లోని 40 గ్రామాల్లో 525 ఎకరాల్లో మల్బరీ సాగుచేసేవారు. ప్రత్యక్షంగా 382 రైతు కుటుంబాలు పట్టు గూళ్ల పెంపకం, దారం ఉత్పత్తి ద్వారా లబ్ధి పొందేవి.  పట్టు ఉత్పత్తి చేసిన గూళ్లకు ప్రభుత్వం కిలోకు రూ.50 చెల్లిస్తోంది. దీంతో పాటు ఎకరాకు రూ.1,000 రూపంలో సబ్జిడీ అందిస్తోంది.  ఎకరా మల్బరీ తోటల పెంపకం, పట్టుగూళ్ల ఉత్పత్తి ద్వారా మూడు నెలలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఆదాయం సమకూరేది. కానీ అవగాహన లేక చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 


ముందుకు రాని రైతులు

 కేంద్ర సిల్క్‌ బోర్డు, రాష్ట్ర పట్టు పరిశ్రమ సంయుక్త ఆధ్వర్యంలో మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకంతో గూళ్లను తయారీ యూనిట్లకు రాయితీతో కూడిన రుణం అందిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 70 శాతం రాయితీతో రూ.4 లక్షల వరకూ రుణం అందిస్తున్నారు. రైతులకు సాగు సలహాలు, సూచనలు అందించేందుకు శ్రీకాకుళం, సీతంపేట, పాలకొండల్లో కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశారు. అయినా జిల్లాలో రైతులు పట్టు సాగు, మల్బరీ తోటల పెంపకానికి ముందుకు రావడం లేదు. గత ఏడాది కరోనా తొలి దశ విజృంభణ కారణంగా పట్టు పరిశ్రమ పడకేసింది.  ప్రస్తుతం రెండో దశ కొనసాగుతున్నందున రైతులు మల్బరీ సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు.  2020-21 సంవత్సరానికి గాను 200 ఎకరాల్లో మల్బరీ తోటల పెంపకం చేపట్టాలని నిర్ణయిచారు. కేవలం 95 ఎకరాలు మాత్రమే సాగు చేయగలిగారు. రైతులకు 6 లక్షల పట్టు గుడ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం 2.40 లక్షల గుడ్లు మాత్రమే పంపిణీ జరిగింది. దీంతో పట్టు గూళ్ల (కకూన్స్‌) ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో 2021-22 ఏడాదికి గాను 150 ఎకరాల్లో మల్బరీ తోటల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 4.50 లక్షల పట్టు గుడ్లను రైతులకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 


 లక్ష్యాలను అధిగమిస్తాం

జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనుకున్న లక్ష్యాలను డిసెంబరు నాటికి చేరుకుంటాం. కరోనా కారణంగా పట్టు సాగుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం వాస్తవమే. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చేకూరే మల్బరీ తోటల పెంపకం, పట్టు గూళ్ల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రణస్థలం, పాలకొండ, సీతంపేట, మందసల్లో రైతులను ఎంపిక చేశాం

- సాల్మన్‌రాజు, ఏడీ, పట్టు పరిశ్రమ శాఖ, శ్రీకాకుళం



Updated Date - 2021-08-01T05:53:06+05:30 IST