కాటేసిన మహమ్మారి

ABN , First Publish Date - 2021-05-10T05:49:59+05:30 IST

కాటేసిన మహమ్మారి

కాటేసిన మహమ్మారి

కొవిడ్‌తో ఐదుగురి మృతి 

వెంకటాపూర్‌(రామప్ప) మే 9 : కరోనాతో మృతి చెందిన మరో సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాపయ్యపల్లె గ్రామానికి చెందిన  వ్యక్తి (58)  గత నెల 29న జ్వరం రావడంతో ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్‌ అని అక్కడి డాక్టర్లు నిర్ధారించడంతో హోంఐసోలేషన్‌లో ఉన్నాడు. బుధవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు.  

గాంధీనగర్‌ వాసి..

చిట్యాల : మండలంలోని జడల్‌పేట శివారు గాంధీనగర్‌కు చెందిన వ్యక్తి (48) కరోనాతో శనివారం రాత్రి మృతి చెందాడు. హన్యకొండలో ప్రైవేటు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఈనెల 4న కరోనా పాజిటివ్‌ రావడంతో 5న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా అంబులెన్సు లో చిట్యాల సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు.  మృతుడుకి భార్య కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భూపాలపల్లిలో వృద్ధురాలు.. 

కృష్ణకాలనీ : భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఫకీర్‌గడ్డకు చెందిన వృద్దురాలు (75) కరోనాతో ఆదివారం రాత్రి మృతి చెందింది.  పది రోజులుగా జ్వరంతో బాధపడిన ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి కన్నుమూసింది. విషయం తెలుసుకున్న మునిసిపాలిటీ సిబ్బంది ట్రాక్టర్‌లో మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం తీసుకెళ్లారు. తన కొడుకు, కోడలితో కలిసి ఆమె నివాసముంటోంది.

వాజేడులో గ్రామీణ వైద్యుడు..  

వాజేడు : మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్‌ఎంపీ (గ్రామీణ వైద్యుడు) కరోనాతో ఆది వారం మృతిచెందాడు.   పది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన్ను (60) మొదట భద్రాచ లంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపో వడంతో వెంటీలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్న క్రమంలో  పరిస్థితి విషమించి ఆయన మృతిచెందారు.

మృతుడికి  కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండగా అంత ర్జాతీయ విమాన సర్వీసులు బంద్‌ కావడంతో తండ్రి ఆఖరి చూపునకు సైతం నోచుకోలేదు. 40 ఏళ్లుగా వైద్యం చేస్తూ అందరికీ సుపరిచితుడిగా ఉన్న వైద్యుడి మృతితో మండలంలో విషాదఛాయలు అలుము కున్నాయి.  

అన్‌సాన్‌పల్లిలో మరొకరు.. 

మల్హర్‌  : మండలంలోని అన్‌సాన్‌పల్లి గ్రామానికి ఆర్‌ఎంపీ (38) కరోనాతో ఆదివారం మృతి చెందారు. పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కొద్ది రోజులుగా హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 


Updated Date - 2021-05-10T05:49:59+05:30 IST