కృష్ణాలో 86 కరోనా మరణాలు.. అనధికారికంగా ఎంత మంది చనిపోయారో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-07-18T17:03:53+05:30 IST

జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. తొలి కరోనా మరణం మార్చి 30న విజయవాడలోని పాతబస్తీలో నమోదైంది. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి తండ్రి న్యుమోనియా వ్యాధి లక్షణాలతో కొవిడ్

కృష్ణాలో 86 కరోనా మరణాలు.. అనధికారికంగా ఎంత మంది చనిపోయారో తెలిస్తే..

ప్రాణాలతో చెలగాటమా..

కొవిడ్ ఆసుపత్రుల్లో ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం

అనధికారికంగా 15 రోజుల్లో 96 మరణాలు

200కు చేరువలో మృతులు.. అధికారికంగా ప్రకటించినవి 86


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. తొలి కరోనా మరణం మార్చి 30న విజయవాడలోని పాతబస్తీలో నమోదైంది. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి తండ్రి న్యుమోనియా వ్యాధి లక్షణాలతో కొవిడ్‌ ఆసుపత్రిలో చేరగా, పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన మరణానికి ముందురోజే ఆయన భార్య కూడా అవే లక్షణాలతో మరణించారు. ఒక రోజు తేడాతో భార్యాభర్తలు మరణించడంతో నగరంలో కలకలం చెలరేగింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 4న మచిలీపట్నంలో మరో వ్యక్తి, అదే నెల 12న మొగల్రాజపురానికి చెందిన ఇంకో వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. ఆ తర్వాత మే, జూన్‌ నెలల్లో విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో దాదాపు ప్రతిరోజూ రెండు, మూడు కరోనా మరణాలు నమోదు కాగా.. ఈ నెలలో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.


ఆసుపత్రిలోని ఐసీయూ విభాగాల్లో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ నెలలో 15 మంది, మేలో 30 మందికి పైగా, జూన్‌లో 45 మందికి పైగా.. ఇలా మూడు నెలల్లో 90 మందికి పైగా కరోనా బాధితులు మరణించగా, ఈ నెలలో కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 96 మంది వైరస్‌ బారినపడి మరణించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ ఐదు నుంచి పది మందికి పైగా కరోనా వల్ల మృత్యువాత పడుతున్నారు. ఆరో తేదీ ఒక్కరోజే 10 మంది, 14వ తేదీన 12 మంది మృత్యువాత పడ్డారు. అయితే జిల్లాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి శుక్రవారం వరకు కేవలం 86 మంది మాత్రమే కరోనా కారణంగా మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా  ప్రకటించింది. ఇందుకు భిన్నంగా ఒక్క విజయవాడలోని కొవిడ్‌ ఆసుపత్రిలో నమోదైన మరణాలే 200కు చేరువగా ఉన్నట్లు అనధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇతర అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఇక్కడకు వచ్చి మరణించినవారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంది. 


నిర్లక్ష్యమే కారణమా? 

కరోనా లక్షణాలతో కొవిడ్‌ ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చోటుచేసు కుంటోందని, ఈ కారణంగానే మరణాలు పెరుగుతు న్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం అందని కారణంగా ఒక్కరూ మరణించకూడదని సీఎం జగన్‌ చెబుతుండగా.. ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యవైఖరి కారణంగా సకాలంలో వైద్యం అందక మరణిస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నగరానికి చెందిన ఓ వృద్ధురాలి టెస్టు రిపోర్టులు పదే పదే గల్లంతవడం, చివరికి ఆమె రిపోర్టులు రాకుండానే కన్నుమూయడం ఇందుకు నిదర్శనం. ఇటీవల అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని అతని భార్య  తీసుకురాగా, వివరాలు నమోదుచేయకుండానే ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలోకి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆ వృద్ధుడు మరణించాడు. అతని కోసం భార్య ఆసుపత్రి చుట్టూ తిరిగినా, సిబ్బంది చెప్పలేకపోయారు. పది రోజుల తరువాత పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, వేరొక పేరుతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచినుట్ట గుర్తించారు. ఈ ఘటనపై కలెక్టరు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆ విచారణ ఎంతవరకు వచ్చిందో అధికారులకే తెలియాలి. 


Updated Date - 2020-07-18T17:03:53+05:30 IST