Abn logo
Oct 18 2021 @ 01:41AM

ముంబై, ఢిల్లీలో కరోనా మరణాలు ‘సున్నా’

వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక తొలిసారి

కేసులు 500.. కట్టడి ప్రాంతాలు జీరో

‘పిల్లలకు టీకా’పై కచ్చితమైన గడువు చెప్పలేం

కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ వీకే పాల్‌ 

కరోనా కేసులు 500కు పరిమితం కట్టడి ప్రాంతాలు జీరో


ముంబై, న్యూఢిల్లీ, అక్టోబరు 17: రోజుకు కరోనా వైరస్‌ బారిన వేలాది మంది.. వందల కొద్దీ మరణాలు..! కొవిడ్‌ ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు ఇంతకుమించిన సంఖ్యలో బాధితులు..! కరోనా మొదటి, రెండో దశల్లో దేశంలో తీవ్రంగా ప్రభావితమైన ముంబైలో ఓ దశలో పరిస్థితి ఇది. సెకండ్‌ వేవ్‌లో అయితే ఒక్క రోజే 11 వేలపైగా కేసులు వచ్చాయి. రోజూ శ్మశానవాటికల్లో పెద్దఎత్తున జరిగిన అంత్యక్రియలు.. ఆపై మరణాల లెక్కల సవరణ పరిస్థితి తీవ్రతను చాటాయి. అలాంటి స్థితి నుంచి ముంబై తేరుకుంది. నగరంలో కరోనా పాజిటివ్‌ రేటు 0.06కు తగ్గింది. ఇప్పుడు కట్టడి ప్రాంతాలు లేవు. తాజాగా ఆదివారం నగరంలో శనివారం కరోనాతో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కొవిడ్‌ ప్రారంభమయ్యాక ఇది తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల కేసులు కూడా 500కు అటుఇటుగానే ఉంటున్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆదివారం కరోనాతో ఒక్కరూ చనిపోలేదు. 32 కొత్త కేసులు వచ్చాయి. ఢిల్లీలో ఈ నెలలో రెండే మరణాలు నమోదయ్యాయి. ఇక.. శనివారం దేశంలో 14,146 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గత ఏడున్నర నెలల్లో ఇవే అత్యల్పం.


పిల్లలకు టీకాపై గడువు చెప్పలేం..

శాస్త్రీయ హేతుబద్ధత, సరఫరా పరిస్థితుల ఆధారంగా పిల్లలు, కౌమార దశలోని వారికి టీకా పంపిణీపై తుది నిర్ణయం తీసుకుంటామని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. కచ్చితమైన గడువు ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. 12 ఏళ్లు దాటిన పిల్లలకు పంపిణీ చేసేందుకు జైకొవ్‌-డి టీకాకు, 2 నుంచి 18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ టీకాకు ఇటీవల అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్‌ వీకే పాల్‌ ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. జై కొవ్‌-డిని దేశ వ్యాక్సినేషన్‌లో భాగం చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయని తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్‌ ఇప్పటికే వయోజనులకు పంపిణీ విభాగంలో ఉందని, ఇప్పుడు పిల్లలకూ ఈ టీకా అందుబాటులోకి వచ్చినందున.. ఎలా పంపిణీ చేయాలన్న దానిపై పరిశీలన సాగించాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గింది కానీ కరోనా అంతం కాలేదని పేర్కొన్నారు.


అతి సుదీర్ఘ ఆంక్షలకు మెల్‌బోర్న్‌ బైబై

మొత్తం ఆరు లాక్‌డౌన్లు.. వ్యవధి 262 రోజులు..! ప్రపంచంలో మరే నగరమూ లేనంతగా సుదీర్ఘ కాలం ఆంక్షల్లో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరం లాక్‌డౌన్‌కు వీడ్కోలు పలకనుంది. విక్టోరియా రాష్ట్రంలో అర్హులైన 70 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి కావడంతో.. రాజధాని నగరం మెల్‌బోర్న్‌లో వచ్చే శుక్రవారం నుంచి ఆంక్షలను ఎత్తివేయనున్నారు. కాగా, మెల్‌బోర్న్‌ కంటే ముందు అత్యధిక కాలం లాక్‌డౌన్‌ లో ఉన్న నగరం అర్జెంటీనా రాజధాని బ్యూన్‌సఎయిర్స్‌ (234 రోజులు). మరోవైపు రష్యాలో ఎన్నడూలేనంతగా ఆదివారం 34,303 మంది కరోనా బారినపడ్డారు. సరిగ్గా నెల క్రితంతో పోలిస్తే ఈ కేసులు 70 శాతం అధికం. తాజాగా 999 మంది మృతిచెందారు.