కుటుంబంలోని నలుగురిని మింగేసిన క‌రోనా... అనాథ‌లైన ఇద్ద‌రు చిన్నారులు!

ABN , First Publish Date - 2021-05-10T12:19:01+05:30 IST

కరోనా ఇన్ఫెక్షన్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది.

కుటుంబంలోని నలుగురిని మింగేసిన క‌రోనా... అనాథ‌లైన ఇద్ద‌రు చిన్నారులు!

ఘ‌జియాబాద్‌: కరోనా ఇన్ఫెక్షన్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. లెక్క‌కుమించి జ‌నం ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. వారిలోని కొంద‌రు మృత్యువాత ప‌డుతున్నారు. యూపీలోని ఘ‌జియాబాద్‌లో గ‌ల క్రాసింగ్ రిపబ్లిక్ టౌన్ షిప్‌కు చెందిన పంచశీల్ వెల్లింగ్ట‌న్‌లోని ఒక కుటుంబాన్ని క‌రోనా కాటు వేసింది. 12 రోజుల వ్య‌వ‌ధిలో నలుగురు మరణించారు. ఆ కుటుంబంలోని భార్య‌భర్త, కొడుకు, కోడలు ఒక్కొక్క‌రుగా మృతి చెందార‌ని స్థానికులు తెలిపారు. 


ఈ సంద‌ర్భంగా సొసైటీ నివాసి రాజ్‌కుమార్ రాఠీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రాంతానికి చెందిన‌వారు ప్రతి రెండుమూడు రోజుల‌కు ఒకరు చొప్పున మ‌ర‌ణిస్తున్నార‌న్నారు. ఇప్పటివరకు సొసైటీలోని సుమారు 10 నుంచి 12 మంది కరోనా కాటుకు బ‌ల‌య్యార‌న్నారు. దుర్గేష్ ప్రసాద్ తన భార్య, కొడుకు, కోడ‌లితో కలిసి సొసైటీ టవర్ -2 లోని ఫ్లాట్ నెంబర్ -205 లో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 27 న ఆయన మృతి చెందారు. అదే సమయంలో అతని కుమారుడు అశ్వని, భార్య నిర్మల గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో క‌రోనాకు చికిత్స పొందుతున్నారు. మే 4 న, అశ్వని కుమార్ శారదా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ అంటువ్యాధి కారణంగా భార్య‌ సంతోష్ కుమారి కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే మే 5 న ఇంట్లో తుది శ్వాస విడిచారు. రెండు రోజుల తరువాత కోడ‌లు నిర్మల కుమారి తుది శ్వాస విడిచారు. వీరి దహన సంస్కారాల కోసం అంబులెన్స్ కోసం ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ  ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని, దీంతో ప్రైవేట్ అంబులెన్సుల స‌హ‌కారంతో మృత‌దేహాల‌ను స్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించి, అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించామ‌న్నారు. ఇప్పుడు వారి కుటుంబంలోని ఇద్ద‌రు చిన్నారులు మాత్ర‌మే మిగిలార‌న్నారు. 

Updated Date - 2021-05-10T12:19:01+05:30 IST