కుటుంబాలను కబళిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-05-08T08:00:06+05:30 IST

రాష్ట్రంలో కరోనా కుటుంబాలను కబళిస్తోంది. వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

కుటుంబాలను కబళిస్తున్న కరోనా

  • 12 రోజుల్లో కుమారుడు, తల్లిదండ్రుల మృతి
  • 15 రోజుల్లో తల్లీ కుమారుడు వైర్‌సకు బలి
  • మరో కుటుంబంలోనూ ముగ్గురు..


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా కుటుంబాలను కబళిస్తోంది. వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువున భరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ హెచ్‌బీ కాలనీ ఫేజ్‌-2 సంయుక్త కార్యదర్శి ప్రభుకుమార్‌ (42) గత నెల 25న కరోనాతో మృతి చెందారు. ఆయన తల్లిదండ్రులకూ పాజిటివ్‌ వచ్చింది. కుమారుడి మరణంతో వారు కుంగిపోయారు. ఆ బెంగతో బుధవారం ప్రభు తల్లి, గురువారం తండ్రి చనిపోయారు. హెచ్‌బీ కాలనీ లక్ష్మీనగర్‌లోని మరో కుటుంబంలోనూ కరోనా విషాదం నింపింది. ఫంక్షన్‌ హాల్‌ యజమాని బడేమియా (70) పెద్ద కుమారుడు వైర్‌సతో 6 నెలల క్రితం చనిపోయాడు. బడేమియా, చిన్న కొడుకు ఇటీవల కరోనా బారినపడ్డారు. చిన్న కుమారుడు గత వారం,  మూడు రోజుల క్రితం బడేమియా చనిపోయారు. 


యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనాతో 15 రోజుల్లో తల్లి కుమారుడు చనిపోయారు. భువనగిరికి చెందిన ఆర్‌ఎంపీ గుమ్మడి రాజు భార్య ఉమాదేవి (45) వైర్‌సతో ఏప్రిల్‌ 22న మృతిచెందారు. ఆమె దశదిన కర్మ మరుసటి రోజే పెద్ద కుమారుడు భరద్వాజ్‌ (20)కు పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం అచ్చంపల్లిలో అన్నదమ్ములు ఆలేటి తిరుపతిరెడ్డి(65), ఎల్లారెడ్డి(68) కొవిడ్‌తో చనిపోయారు. వీరికి వారం క్రితం పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం ఇద్దరూ మృతి చెందారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూర్‌ గ్రామానికి చెందిన వొద్దిపర్తి రామాచార్యులు(70) ఈ నెల 4న కరోనాతో చనిపోయారు. ఆయన పెద్ద కొడుకు లక్ష్మణాచార్యులు(38) శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-05-08T08:00:06+05:30 IST