వాయువేగంతో కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2022-01-18T04:03:48+05:30 IST

కొవిడ్‌ మూడోదశలో కరోనా వైరస్‌ వాయువేగంగా వ్యాపిస్తోంది. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు, ప్రభుత్వ సిబ్బంది కరోనాబారిన పడుతున్నారు.

వాయువేగంతో కరోనా వ్యాప్తి
జిల్లా వైద్యశాలలో స్కానింగ్‌ రూం వద్ద గుంపుగా గర్భిణులు

పలువురు ప్రముఖులకు కరోనా

చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం

పట్టించుకోని ప్రజలు.. భౌతికదూరం, మాస్కు ఊసే లేదు

 

మార్కాపురం, జనవరి 17 : కొవిడ్‌ మూడోదశలో కరోనా వైరస్‌ వాయువేగంగా వ్యాపిస్తోంది. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు, ప్రభుత్వ సిబ్బంది కరోనాబారిన పడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంలో అధికారులు వైఫల్యం చెందారు. మూడో దశలో కరోనా వ్యాప్తి వేగంగా ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ  చేసినప్పటికీ నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తు మార్కాపురం జిల్లా వైద్యశాలలోనే నివారణ చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.


బాధితుల్లో ప్రముఖులు, వైద్యారోగ్య సిబ్బంది

మార్కాపురం పట్టణంలో నివాసముండే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం ఒంగోలు సంఘమిత్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సతీమణి కల్పనకు పాజిటివ్‌. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణకు గతవారమే కరోనా వచ్చింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నెగెటివ్‌. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం నూతన పాలకమండలి అధ్యక్షుడిగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న  కేశవరావు, మరో నలుగురు సభ్యులు కరోనాకు గురయ్యారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌-2 దంపతులు చీతిరాజుపల్లి అంజమ్మ శ్రీనివా్‌సలు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్యశాలలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. 


చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం

ఏదైనా రోగం వస్తే నయం చేయడానికి అందరూ వెళ్లేది మార్కాపురం జిల్లా వైద్యశాలకే. కానీ అక్కడ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లా వైద్యశాలకు రోజూ 400 నుంచి 500 వరకూ రోగులు, గర్భిణులు వస్తుంటారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలలో ప్రాఽథమికమైనది భౌతికదూరం పాటించడం. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అటువంటి చర్యలేవీ వైద్యశాలలో చేపట్టలేదు. ఔట్‌ పేషంట్ల రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, గర్భిణుల స్కానింగ్‌ గది వద్ద రద్దీగా ఉంటున్నారు. ఇక్కడ భౌతికదూరం, మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధనలు కన్పించడం లేదు. మూడోదశలో  కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో నివారణా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయడంలో అధికారులు దృష్టి సారించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-01-18T04:03:48+05:30 IST