కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-02-21T07:28:47+05:30 IST

మరో మహమ్మారి అనుకొనే స్థాయిలో ప్రపంచాన్ని భయోత్పాతంలో ముంచేసిన కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నది..

కరోనా కలకలం

మరో మహమ్మారి అనుకొనే స్థాయిలో ప్రపంచాన్ని భయోత్పాతంలో ముంచేసిన కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా కేసులు 70వేలకు మించినా, మరణాల సంఖ్య ప్రస్తుతానికి దాదాపు రెండువేలు. కొత్తకేసుల సంఖ్య తగ్గుతున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా భరోసా ఇస్తోంది. ఇతర కరోనా వైరస్‌లతో పోల్చితే ‘కొవిడ్‌–19’ అంత ప్రమాదకారి కాదని కూడా ఇది చెబుతున్నది. చైనాలో వైరస్‌ ప్రభావం స్వల్పస్థాయిలో ఉన్న 44వేల కేసుల్లో 80శాతం త్వరలోనే కోలుకుంటారనీ, ఐదుశాతం కేసుల్లో మాత్రమే తీవ్రత హెచ్చుగా ఉన్నదని సమాచారం. నమోదవుతున్న మరణాల్లో కూడా అత్యధికులు వృద్ధులే ఉండటానికి ఊపిరితిత్తులపై ఈ వైరస్‌ చూపే ప్రభావం కారణం. కరోనా వైరస్‌ను పసిగట్టడం, అడ్డుకోవడంలో చైనా విఫలమైనమాట వాస్తవం. ఇప్పటికీ, నియంత్రణ, తీవ్రతల విషయంలో చైనా నిజాలు చెప్పడం లేదన్న అనుమానాలూ ఉన్నాయి. చైనా దాటి కరోనా చాలా దేశాలకు పాకిపోయిన కారణంగా ఇప్పుడప్పుడే ప్రపంచానికి ఈ ఉపద్రవం తప్పిపోయినట్టుగా భావించలేం.


డిసెంబరులోనే చైనా వైద్యుడొకరు కరోనాను గుర్తించి హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో పాటు ఆయనపై నిందలు వేసిందనీ, చివరకు ఆ వైద్యుడు కూడా కరోనాకు బలయ్యాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న ఓ రాష్ట్రంలో ప్రభుత్వమే వేలాదిమందికి భారీ అధికారిక విందు ఇవ్వడమూ దాని వ్యాప్తికి దోహదం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి ఇంతగా చేజారినా, తదనంతర కాలంలో వైరస్‌ జీనోమ్‌ను వెతికిపట్టుకోవడం, నిర్థారణ పరీక్షలను సిద్ధం చేయడం సహా దానిని నియంత్రించే విషయంలో చైనా ప్రదర్శించిన సమర్థత, వేగం మెచ్చుకోతగింది. కొద్దిరోజుల్లోనే అది రెండు అతిపెద్ద ఆసుపత్రులను నిర్మించింది. అనేక నిర్మాణాలు తాత్కాలిక ఆసుపత్రులుగా రూపం మార్చుకున్నాయి. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు నగరాలను సైతం చైనా దిగ్బంధించింది. ఈ వైరస్‌ విషయంలో తొలినాళ్ళలో నిర్లక్ష్యాన్నీ, రహస్యాన్నీ పాటించకుండా, సకాలంలో స్పందించి, పారదర్శకంగా ఉండివుంటే చైనా శక్తిసామర్థ్యాలరీత్యా నియంత్రణ ఇంత సమస్యాత్మకమయ్యేది కాదేమో! తియాన్‌మెన్‌స్క్వేర్‌ హత్యలు, భూకంప మరణాల లెక్కలు ఎలాగూ బయటకు పొక్కవు. కానీ, ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించే అంశాల్లోనూ అదే దాపరికాన్నే పాటిస్తే ఎలా? గతంలో ‘సార్స్‌’ వైరస్‌ విషయంలోనూ చైనా ఇలాగే ప్రపంచానికి నష్టం చేకూర్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నిజాన్ని నిర్భయంగా చాటిచెప్పినప్పుడు అనుమానాలకు అవకాశం ఉండదు. రహస్య జీవాయుధ ప్రయోగాలే కరోనాకు కారణమనీ, గబ్బిలాలపై ప్రయోగాలే ఈ దుస్థితిని తెచ్చాయనీ ఏవేవో అనుమానాలకు అది ఆస్కారం ఇచ్చింది. చైనా ప్రజల ఆహార అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడానికి కూడా ప్రభుత్వమే కారణం. హెచ్చరికలు చేసినవారి నోరుమూయించడం, వైరస్‌ విజృంభణ నిర్థారించినందుకు పదిమంది డాక్టర్లను జైల్లోపెట్టడం, బాధితుల సంఖ్య హెచ్చుతున్నా అధికారిక లెక్కలు మార్చకపోవడం వంటి స్వల్పబుద్ధి చేష్టల వల్ల ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియచేస్తున్న వివరాల్లోనూ అది పారదర్శకత పాటించడంలేదన్న అనుమానాలు వేళ్ళూనుకున్నాయి.


కరోనా కాటుతో చైనా ఆర్థికం చావుదెబ్బతిన్నది. మిలటరీని బలోపేతం చేసుకొనే ప్రణాళికలను అటకెక్కించవలసి వచ్చింది. వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బిఆర్‌ఐ ప్రాజెక్టు మరింత వెనక్కుపోవచ్చు. పదినగరాలు, వేలాది ఫ్యాక్టరీలు మూతబడిన కారణంగా చైనా సరఫరాలమీద ఆధారపడిన దేశాలన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. బల్క్‌ డ్రగ్స్‌ విషయంలో చైనామీద ఆధారపడిన భారత్‌ ఫార్మారంగానికి కష్టాలు ఆరంభమైనాయి. కొన్ని మందుల ధరలు ఇప్పటికే పెరిగాయి. తయారీ రంగం తలకిందులవుతున్నది. ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌, కెమికల్స్‌ ఇత్యాది రంగాలపై కొవిడ్‌ త్వరలోనే తీవ్ర ప్రభావం చూపబోతున్నది. యాపిల్‌ వంటి గ్లోబల్‌ కంపెనీలు చవిచూడబోయే నష్టాలను లెక్కలేసుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గబోతున్నట్టు ఐఎమ్‌ఎఫ్‌ ప్రకటించింది. 2003లో సార్స్‌ ఇదే తరహాలో ప్రపంచ ఆర్థికాన్ని దెబ్బతీసింది. చైనా తన దాపరికంతో తాను ప్రమాదంలో పడటమే కాక, మిగతా ప్రపంచాన్నీ కష్టాల్లోకి నెట్టివేస్తున్నది. ఇప్పటికైనా అది పారదర్శకతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తే మంచిది.

Updated Date - 2020-02-21T07:28:47+05:30 IST