ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా కలవరం

ABN , First Publish Date - 2022-01-18T06:26:57+05:30 IST

జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా కలవరం

పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన

కనీస జాగ్రత్తలు తీసుకోని ప్రభుత్వం

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 17 : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కరోనా మొదటివేవ్‌, రెండో వేవ్‌లో ప్రభుత్వ  ఉద్యోగులు భారీగా వైరస్‌ బారిన పడ్డారు. కొందరు తీవ్రస్థాయిలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.  మరికొంతమంది మృతిచెందారు. గత ఐదారు నెలల నుంచి పాజిటివ్‌  కేసులు తగ్గుతూ వస్తుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు యథా విధిగా పనిచేస్తున్నాయి. అయితే వారం నుంచి జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులు వణికిపోతున్నారు. జిల్లాలో గత నాలుగైదు రోజుల నుంచి 100కిపైగానే పాజిటివ్‌లు వస్తుండగా, మిగిలిన ప్రధాన పట్టణాల్లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒంగోలుకు వివిధ పనుల కోసం జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు కూడా వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యాలయాలకు వచ్చే వారిలో ఎవరికి ఏమి ఉందో తెలియని పరిస్థితి. దీంతో విధులు నిర్వహించే ఉద్యోగులు కరోనా భయంతో కలవరపడుతున్నారు. 


శానిటైజర్‌ కూడా సరఫరా చేయని  వైనం

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్‌ కూడా సరఫరా చేయని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యంచేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్లతో పాటు మాస్కులు, వివిధ పనుల కోసం నేరుగా లోపలికి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 



Updated Date - 2022-01-18T06:26:57+05:30 IST