కరోనా డాక్టర్ల రక్షణకు విధివిధానాలు

ABN , First Publish Date - 2020-03-26T09:36:38+05:30 IST

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పోరాడుతున్న వైద్యుల రక్షణకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాలని...

కరోనా డాక్టర్ల రక్షణకు విధివిధానాలు

  • శానిటైజర్లు, మాస్క్‌ల ధరల కట్టడి
  • ప్రధానికి డాక్టర్‌ రఘురామ్‌ సూచన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పోరాడుతున్న వైద్యుల రక్షణకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాలని అసోసియేషన్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ పి. రఘురామ్‌ ప్రధానిని కోరారు. బుధవారం ప్రధాని మోదీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వైద్యుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానికి వివరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కరోనా వ్యాధిగ్రస్తులతో పనిచేస్తున్నప్పుడు ఎలా పనిచేయాలి, వారికి కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై ప్రతి జిల్లాకు నోడల్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని కోరారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే ప్రత్యేక దుస్తులు, ఉపకరణాలు తక్కువగా ఉన్నాయని వాటిని అందించాలని కోరారు. కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, మాస్క్‌ల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటిని నియంత్రించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్లు కొన్ని ప్రాంతాల్లో సామాజికంగా వెలివేయబడుతున్నారని, వారికి కరోనా వ్యాపించిందని భావించిన ప్రజలు దూరం పాటిస్తున్నారని తెలిపారు. కరోనా వ్యాపించిందన్న అనుమానంతో వరంగల్‌ వైద్య విద్యార్థులను ఇంటి యజమానులు ఖాళీ చేయించడంతో వారు రోడ్డున పడ్డారని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు.  కేరళ 300 మంది వైద్య సిబ్బందిని అత్యవసరంగా విధుల్లోకి తీసుకుందని గుర్తుచేశారు. భారీగా కరోనా బాధితులు వచ్చే అవకాశమున్నందున ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసీయూ వార్డులను సిద్ధంగా ఉంచేలా ఆదేశాలివ్వాలని ఆయన ప్రధానిని కోరారు.


ఇక ఇబ్బడిముబ్బడిగా శానిటైజర్లు

ఇదిలావుండగా, హ్యాండ్‌ శానిటైజర్ల ఉత్పత్తి పెరగనున్నది. యుద్ధ ప్రాతిపదికన వాటి ఉత్పత్తిని పెంచేందుకు ప్లాంట్లు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆలిండియా డిస్టిలరీల  అసోసియేషన్‌ బుధవారం ఈ విషయం ప్రకటించింది. పంజాబ్‌, హరియాణ, రాజస్థాన్‌, కర్ణాటక, యూపీ, తమిళనాడు, గుజరాత్‌, ఇతర రాష్ట్రాల్లోని డిస్టిలరీలు హ్యాండ్‌ శానిటైజర్ల ఉత్పత్తిని ప్రారంభించాయని అసోసియేషన్‌  తెలిపింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా లైసెన్సులు కూడా ఇచ్చాయి. కేంద్రం నిర్ణయించిన ధరలకే వాటిని అమ్ముతారు. 

Updated Date - 2020-03-26T09:36:38+05:30 IST