Abn logo
Apr 6 2020 @ 14:12PM

విజయనగరం సేఫ్ జోన్‌లో ఉండడానికి కారణమిదే!

ఇప్పటికి ‘సేఫ్‌’ 

జిల్లాలో ఇప్పటివరకూ వెలుగుచూడని కరోనా పాజిటివ్‌ కేసు

విదేశాల నుంచి తక్కువ మంది రావడమే కారణం

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నేరుగా ‘క్వారంటైన్‌’కు..

స్వచ్ఛంద వైద్య పరీక్షలకు ముందుకొచ్చిన ‘ఢిల్లీ’ సదస్సుకు హాజరైన ముగ్గురు 

ముందస్తు చర్యలతో యంత్రాంగం అప్రమత్తం

లాక్‌డౌన్‌ కొనసాగే వరకూ నిబంధనలు పాటించాలని అధికారుల విజ్ఞప్తి


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ఇంతవరకూ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినా విజయనగరంతో పాటు పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాలో నమోదు కాలేదు. జిల్లాకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని యంత్రాంగం చెప్పుకొస్తున్నా దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.


ప్రధానంగా జిల్లా నుంచి ఉద్యోగ, ఉపాధికిగాను విదేశాలకు వెళ్లిన వారు తక్కువ. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకుంటున్న వారు కూడా ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువ అని అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వెలుగుచూసిన తరువాత జిల్లాకు విదేశాల నుంచి 400 మంది వచ్చారు. వారందర్నీ గుర్తించిన యంత్రాంగం స్వీయ గృహ నిర్బంధం చేసి పర్యవేక్షించింది. ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సుకు హాజరైన వారు స్వస్థలాలకు చేరిన తరువాతే వైరస్‌ వ్యాప్తిచెందింది. కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సదస్సుకు జిల్లా నుంచి ముగ్గురు హాజరయ్యారు. వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వచ్చారు. వైద్య పరీక్షలు చేయగా ఎటువంటి వైరస్‌ లేదని తేలింది.


దీంతో పాటు రాష్ట్ర, జిల్లా సరిహద్దులను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్‌కు పంపించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాయి. జిల్లావాసులు ఎక్కువ మంది త్రివిధ దళాల్లో సైనికులుగా పనిచేస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరికి సెలవులు రద్దు అయ్యాయి. విమానాలు, రైళ్లు రద్దవ్వడంతో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. లక్షలాది మంది జిల్లావాసులు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లారు. అందులో కొద్దిమంది మాత్రమే స్వస్థలాలకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇలా చేరుకున్న వారికి అధికారులు పొలిమేరల్లో గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.


ఇటీవల కర్నాటక నుంచి 86 మంది మత్స్యకారులు జిల్లాకు చేరుకున్నారు. వీరిని ప్రభుత్వమే బస్సుల్లో తెప్పించింది. క్వారంటైన్‌కు తరలించి వైద్యసేవలందించింది. అలాగే రహదారులు, రైల్వేట్రాక్‌లపై నడిచి వస్తున్న వారిని సైతం గుర్తించి సమీప ఐసోలేషన్‌ కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇటువంటి వారు ప్రస్తుతం 100 మందికి పైగా క్వారంటైన్‌ కేంద్రాల్లో తలదాచుకున్నారు. ఒక వైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ... అటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గుర్తిస్తూ...అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగడం ద్వారా ఇప్పటివరకూ జిల్లాను ‘సేఫ్‌’ జోన్‌లో ఉంచగలిగారు. లాక్‌డౌన్‌ కొనసాగిన రోజులు జిల్లా ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని విజ్ఞప్తి చేస్తున్నారు.


పక్కా ప్రణాళికతో..

పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. అన్నిశాఖలు సమన్వయంతో వ్యవహరించడంతో కొంతవరకూ సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారిని త్వరితగతిన గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాం. కొంతమంది స్వీయ గృహ నిర్బంధంలో వైద్యసేవలందించాం. సహాయ చర్యల్లో సైతం జిల్లా ముందంజలో ఉంది. రూ.1000 సాయం పంపిణీలో రాష్ట్రంలో తొలిస్థానం దక్కడం ఆనందంగా ఉంది. 

- ఎం.హరిజవహర్‌లాల్‌, కలెక్టర్‌, విజయనగరం


కట్డుదిట్టమైన చర్యలు

కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించాం. స్వీయ గృహ నిర్బంధానికి పరిమితం చేశాం. అవసరమైన వారికి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాం. జిల్లా సరిహద్దులను కట్డుదిట్టం చేశాం. విశాఖలో కేసులు వెలుగుచూస్తున్న దృష్ట్యా  జిల్లాకు వచ్చేవారిపై దృష్టిపెట్టాం. అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారుల్లో చెక్‌గేట్లను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకాకపోవడం ఉపశమనం. 

             - బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం


Advertisement
Advertisement
Advertisement