Abn logo
Feb 11 2020 @ 01:18AM

కరోనా ఆర్థిక పాఠాలు

ఒక నిర్దిష్ట స్థాయిని దాటి అంతర్జాతీయ వాణిజ్యంతో మన ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేయకూడదు. ప్రయోజనాలు అధికంగా సమకూరి, చిక్కులు తక్కువగా సంభవించే విధంగా మాత్రమే ప్రపంచ వాణిజ్యంలో మనం భాగస్వాములమవ్వాలి. ప్రజల ఆరోగ్యాలను, దేశ ఆర్థికాన్ని కల్లోల పరుస్తున్న కరోనా మహమ్మారి ఈ వాస్తవాన్నే స్పష్టం చేస్తున్నది.

ప్రజల ఆరోగ్యాలూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ కరోనా మహమ్మారి కల్లోలంలో చిక్కుకుంటున్నాయి. చైనాలో పలు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎయిర్‌బస్ కంపెనీ విమానాల తయారీని తాత్కాలికంగా నిలిపివేసింది. మొబైల్ ఫోన్స్ ఉత్పత్తికి ఫాక్స్ కోన్ ప్రస్తుతానికి స్వస్తి చెప్పింది. చైనీస్ షేర్ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా ఈ పతనం, గ్లోబల్ షేర్ మార్కెట్లను కుదిపివేస్తోంది. చైనాకు విదేశీ పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. చైనా ప్రజలు తమ విదేశీ ప్రయాణాలను విరమించుకున్నారు. 

మన ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా కల్లోలం తాకిడి తీవ్రమవుతోంది. మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు ముడి రసాయనాలు, ఆటోమొబైల్ కంపెనీలకు విడిభాగాలతో సహా మన దిగుమతులలో 14 శాతం చైనా నుంచే జరుగుతున్నాయి. వజ్రాలు, చేపలు, సుగంధద్రవ్యాలు, రబ్బర్‌తో సహా మన ఎగుమతులలో ఐదు శాతం చైనాకు వెళుతున్నాయి. దిగుమతులు నిలిచిపోవడం, ఎగుమతులు కృశించిపోవడంతో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నది. 

అంతర్జాతీయ వాణిజ్యంతో ఏకీకృతమైన ఆర్థిక రంగాలనే కరోనా మహమ్మారి కల్లోల పరుస్తుండడం గమనార్హమైన విషయం. వివిధ వాహనాల విడి భాగాలను మనమే ఉత్పత్తి చేసుకొంటున్నట్టయితే మన ఆటోమొబైల్ పరిశ్రమలు కరోనా సంక్షోభంలో చిక్కుకునేవి కావు. ఆటోల విడిభాగాలను చౌకగా సమకూర్చుకోవాలనే ఆరాటం వల్లే వాటి అంతర్జాతీయ వాణిజ్యంలో మనం భాగస్వాములమయ్యాము. నిజానికి దేశీయ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ప్రపంచ వాణిజ్యంలో మనం చాలా విస్తృత స్థాయి భాగస్వాములమయ్యాము. ఉత్పత్తి వ్యయాలను స్వల్పస్థాయిలో తగ్గించుకునే ప్రయత్నంలో పెను సంక్షోభం భారిన పడ్డాము. ఈ వాస్తవం దృష్ట్యా, అంతర్జాతీయ వాణిజ్యంతో విస్తృత ఏకీకరణపై పునరాలోచన చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది. కరోనా కల్లోలం ఈ పునరాలోచనను అనివార్యం చేసింది. 

మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ప్రాతిపదిక అయిన రైతు ఆర్థిక కార్యలాపాలను పరిశీలనలోకి తీసుకుందాం. తన ఆర్థిక కార్యకలాపాలను పట్టణ వాణిజ్య రంగంతో ఏ మేరకు ఏకీకృతం చేయాలనే విషయాన్ని రైతు స్వయంగా నిర్ణయించుకోవలసి వుంటుంది. అతను తన వ్యవసాయ పనులకు ఒక ట్రాక్టర్‌ను బాడుగకు తెచ్చుకుంటాడు. ట్రాక్టర్ ఆపరేటర్‌ను దినసరి వేతనంపై నియమించుకుంటాడు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేస్తాడు. బోర్ వెల్ మరమ్మతులకు మెకానిక్‌ను పిలుస్తాడు.

ఈ పంట దినుసులు, సేవలు అన్నీ పట్టణం నుంచే సమకూర్చుకుంటాడు. పట్టణంలో ఇవన్నీ చౌకగా లభిస్తాయి గనుక రైతు పంట పెట్టుబడులు స్వల్ప స్థాయిలో వుంటాయి. అయితే తన వ్యవసాయానికి అవసరమైన పంట దినుసులు, సేవలకు పూర్తిగా పట్టణ మార్కెట్ పై ఆధారపడడం వల్ల తీవ్ర సమస్యలు తప్పక ఎదురవుతాయి. పట్టణం నుంచి పల్లెకు వచ్చే రోడ్లు పాడయిపోయినప్పుడు, పట్టణంలో రాజకీయ, సామాజిక ఆందోళనలు ప్రజ్వరిల్లినప్పుడు , మరీ ముఖ్యంగా అంటు వ్యాధులు ప్రబలిపోయినప్పుడు రైతుకు అవసరమైన సేవలు సకాలంలో అంత సులభంగా లభించవు. అటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోవలసివస్తుంది. క్రిమి సంహారక మందులు సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల పంట దెబ్బ తినడం ఖాయం. సహజసిద్ధమైన క్రిమిసంహారక మందులపై ఆధారపడితే అతనికి నష్టం సంభవించే అవకాశముండదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే రైతు తన వ్యవసాయ పనులకు పట్టణ మార్కెట్‌పై ఆధారపడడం రెండు పరస్పర విరుద్ధ ప్రభావాలకు కారణమవుతున్నది. 

సేద్య కార్యకలాపాలను పట్టణ మార్కెట్‌తో ఏకీకృతం చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గిపోతున్నది. అయితే అదే సమయంలో తీవ్ర చిక్కులు కూడా విధిగా ఏర్పడుతున్నాయి. ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రభావాల మధ్య ఒక ‘అభిలషణీయ’ స్థాయిలో మాత్రమే సమన్వయాన్ని విధిగా నెలకొల్పుకోవాలి. ఆ సమన్వయం అసాధ్య విషయమేమీ కాదు. పట్టణం నుంచి తీసుకువచ్చే హైబ్రిడ్ విత్తనాలతో చాలా ప్రయోజనాలు వున్నాయి. పల్లెలో వాటికి ప్రత్యామ్నాయం లభించదు. హైబ్రిడ్ విత్తనాలతో సమస్యలు కూడా తక్కువగా వుంటాయి. కాగా శ్రామిక సేవలను పట్టణం నుంచే సమకూర్చుకోవడం వల్ల చెప్పుకోదగిన లబ్ధి సమకూరదు. పెద్ద నష్టం కూడా సంభవించవచ్చు. పట్టణం నుంచి వచ్చిన శ్రామికులు పండుగలు, పబ్బాలకు విధిగా పట్టణానికి పోతారు. పని నష్టం జరుగుతుంది. ఈ వాస్తవాల దృష్ట్యా పట్టణ వాణిజ్య వ్యవస్థపై ఆధారపడడం వల్ల చేకూరే లాభాలు, నష్టాలను రైతు నిరంతరమూ అంచనా వేసుకొంటూ తగు నిర్ణయాలు తీసుకోవలసివుంటుంది. ప్రయోజనాలు అధికంగానూ, చిక్కులు తక్కువగాను వుండే విధంగా మాత్రమే పట్టణ మార్కెట్‌పై ఆధారపడడమే రైతుకు మేలు చేస్తుంది. 

రైతు మాదిరిగానే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక అభిలషణీయ స్థాయిలో మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యంతో ఏకీకృతమవ్వాలి. ఉదాహరణకు ఫాస్ఫేట్ ఎరువులు, అధునాతన సాంకేతికతలను దిగుమతి చేసుకోవడం వల్ల ప్రయోజనాలు అధికంగాను, చిక్కులు తక్కువగాను వుంటాయి. ఆటో విడి భాగాలు లాంటి వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అనవసర సమస్యల పాలు కావలసివస్తుంది. కరోనా కల్లోలంతో ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థకు ఇటువంటి చిక్కులే ఏర్పడుతున్నాయి.

వివిధ వాహనాలకు అవసరమైన విడిభాగాలను మనం మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం మనకు సంపూర్ణంగా వున్నది. అయితే వాటిని చౌకగా దిగుమతి చేసుకోవడానికి ఆరాటపడుతుండడం వల్లే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి మూలంగా ఆపదలో పడ్డది. చెప్పవచ్చినదేమిటంటే ఒక నిర్దిష్ట స్థాయిని దాటి అంతర్జాతీయ వాణిజ్యంతో మన ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేయకూడదు. ఈ ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి, పాటించక పోవడం వల్లే మనం భారీగా నష్ట పోతున్నాం. బహుళజాతి కంపెనీల పరిస్థితి ప్రాథమికంగా భిన్నమైనది. మనం ఎదుర్కొనే సమస్యలు వాటికి ఎదురయ్యే అవకాశం లేదు. అంతర్జాతీయ వాణిజ్యంతో ఎంత గరిష్ఠ స్థాయిలో ఏకీకృతమయితే అంత గరిష్ఠంగా అవి ప్రయోజనం పొందుతాయి. ప్రత్యామ్నాయాలు అపారంగా లభించడమే అందుకు కారణం. ఉదాహరణకు ఫాక్స్ కోన్ యాపిల్ మొబైల్ ఫోన్స్‌ను మలేసియా, చెక్ రిపబ్లిక్, దక్షిణ కొరియా, సింగపూర్, ఫిలిప్పీన్స్ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి చేస్తుంది. కరోనా మహమ్మారి చైనాలో విజృంభించింది. దీనివల్ల కొరియా, సింగపూర్‌లో ఉత్పత్తికి ఆటంకమేర్పడినా చెక్ రిపబ్లిక్‌లో ఉత్పత్తిని పెంచుతుంది. భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామిక వేత్తకు ఇటువంటి ప్రత్యామ్నాయాలు లేవు. ఫ్యాక్టరీలను విధిగా వేరే ప్రాంతాలకు తరలించవలసివుంటుంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద నష్టం సంభవిస్తుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో వుంచుకొని మన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వాణిజ్యంతో ఏకీకృతం చేసేందుకు ఒక అభిలషణీయ స్థాయిని గుర్తించి, ఆ స్థాయికే ఏకీకరణను పరిమితం చేయాలి. ఇందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

-(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...