కట్టడికి కసరత్తు

ABN , First Publish Date - 2021-04-21T05:52:08+05:30 IST

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ కలకలం రేపుతోంది.

కట్టడికి కసరత్తు
రేగొండ పీహెచ్‌సీలో వాక్సిన్‌ కోసం బారులు తీరిన జనం

కరోనా విజృంభణతో అధికారులు అప్రమత్తం 

 వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముమ్మర చర్యలు

 జోరుగా వ్యాక్సినేషన్‌  

 కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి

 కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని కృత నిశ్చయం 

 మహారాష్ట్ర సరిహద్దులో తనిఖీలు


 (ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే నలుగురు ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,549 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,818 మంది కోలుకున్నారు. 731 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒక్క మంగళవారం నాడే  జిల్లాలో 104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ములుగు జిల్లాలోనూ కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో మొత్తం 6,001 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 5,667 మంది కోలుకున్నారు. 29 మంది వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, ప్రభుత్వ క్వారంటైన్‌లో 101 మంది, హోమ్‌ ఐసోలేషన్‌లో 204 మంది ఉన్నారు.  ఇప్పటి వరకు 12 మంది కరోనాతో మృతి చెందారు. మాజీ మంత్రి చందులాల్‌ ఈ వైరస్‌ బారిన పడి కన్నుమూశారు. ఒక్క మంగళవారం నాడే ములుగు జిల్లాలో 84 కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కంటైన్మెంట్‌ జోన్లపై నజర్‌

కరోన కట్టడికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కంంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ మండలం ఎడపల్లి గ్రామంలో 50 పాజిటివ్‌ కేసులు, మజీదుపల్లిలో 27, కాటారం మండలం గంగపురి గ్రామంలో 25, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో 22,  చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామంలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి మండలం నాగారంలో 30 మందికి పాజిటివ్‌ గా తేలటంతో ఇక్కడ కూడా కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ములు గు జిల్లాలో మంగపేట మండలం వాగొడ్డుకాలనీలో 33 మందికి పాజిటివ్‌ కేసులు, ములుగు మండలం రామచంద్రాపురం గ్రామంలో 30 కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలా మందికి నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ హోం క్వారంటైన్‌లోనే చాలా మంది ఉంటున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వైద్యశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.  వీరు ఎప్పటికప్పుడు కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటిస్తున్నారు. కరోనా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి,  మందులు ఎలా వాడి..? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.  హోంక్వారంటైన్‌ ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు కంటైన్మెంట్‌ జోన్‌లో ఉంటున్న వారికి నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు బయటకు వస్తే మరింతా వైరస్‌ వ్యాపిస్తుందని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

‘మహా’ సరిహద్దులో నిఘా

పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  అక్కడి నుంచి తెలంగాణలోకి వస్తున్న వారి ద్వారా కరోనా తరలి వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి సరిహద్దులో ఉన్న కాళేశ్వరం ఆలయంతో పాటు ప్రాజెక్టుల వద్దకు  భక్తులు, పర్యాటకులు, మహదేవపూర్‌, మహముత్తారం, పలిమెల, కాటారం మండలాల్లో కూలీలు చాలా మంది వచ్చి పోతుంటారు. 

దీంతో పోలీసులు కాళేశ్వరం వంతెనతో పాటు మేడిగడ్డ బ్యారేజీ వంతెన వద్ద తనిఖీలు చేపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వారికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఇసుక లారీల ద్వారా  కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. మహదేవపూర్‌ మండలం ఎడపల్లిలో కరోనా పెరగడానికి లారీల రాకపోకలే కారణమని స్థానికులు అంటున్నారు.  ఇసుక డ్రైవర్లు, క్లీనర్లకు టెస్టులు నిర్వహించాకే లారీలను పంపించాలని కాళేశ్వర ప్రాంత వాసులు కోరుతున్నారు.

అక్కడక్కడ వాక్సిన్‌ కొరత

భూపాలపల్లి జిల్లాలో కరోనా వాక్సినేషన్‌ను జోరుగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లాలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు 45 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 45 సంవత్సరాలు నిండిన 32,178 మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించారు. అలాగే ములుగు జిల్లాలో కూడా వ్యాక్సినేషన్‌ స్పీడ్‌గా సాగుతోంది. జిల్లాలో 29,203 మందికి టీకా వేశారు.  అయితే భూపాలపల్లి జిల్లాలో చాలా చోట్ల  వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. మంగళవారం చిట్యాల ఏరియా అస్పత్రిలో 50మందికే వాక్సిన్‌ ఇచ్చారు. మరో 20 మందిని వెనక్కి పంపించారు. వ్యాక్సిన్‌ కొరత ఉందని చెప్పటంతో నిరాశతో చాలా మంది వెనతిరిగారు. అలాగే మొగుళ్లపల్లి పీహెచ్‌సీలో కూడా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. ఇక్కడ 30 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చి మరో 15 మందికి  డోస్‌లు లేవని చెప్పి వెనుకకు పంపించారు. భూపాలపల్లి పీహెచ్‌సీలో వెయ్యి డోసులు కేటాయించగా, 700 డోసులు పూర్తయ్యాయి. ఇంకా 300 డోస్‌లు మాత్రమే నిల్వ ఉన్నాయి. తాటిచర్ల పీహెచ్‌సీలో 100 డోసులు, అంబట్‌పల్లిలో 90 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరికీ మే 1 నుంచి వ్యాక్సిన్‌ వేయనున్నట్టు  ప్రభుత్వం ప్రటించింది. ప్రభుత్వం ద్వారానే కాకుండా ప్రైవేటుగా కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. దీంతో కరోనా వైరస్‌ నుంచి మరింత రక్షణ లభించనుంది. మొత్తానికి కరోనా కట్టడికి అంతటా అప్రమత్తం అవుతున్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-04-21T05:52:08+05:30 IST