మీ.. ముహుర్తానికో నమస్కారం!

ABN , First Publish Date - 2021-05-05T17:09:28+05:30 IST

కరోనా రెండో దశ తీవ్రతను..

మీ.. ముహుర్తానికో నమస్కారం!

శుభకార్యాలకు భయపడుతున్న పురోహితులు 

ఒప్పుకున్నవాటినీ వదులుకుంటున్న వైనం

కేవలం జపాలు, హోమాల నిర్వహణకే సుముఖత 

కరోనా రెండోదశలో సీను రివర్సు


ఆంధ్రజ్యోతి-విజయవాడ: కరోనా రెండో దశ తీవ్రతను గమనించిన పురోహితులు అడుగు బయటికి వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.. బయటికెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవటం కంటే ఇంట్లోనే వేద పారాయణం చేసుకోవటం మేలనే భావన పురోహితుల్లో కనిపిస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ముహూర్తాలు బలంగా ఉన్నాయి. ఎంతోమంది తమ ఇళ్లల్లో శుభకార్యాలు జరిపించాలంటూ ఆఫర్లు ఇస్తున్నా పురోహితులు మాత్రం సున్నితంగా తిరస్కరిస్తున్నారు. 


గృహప్రవేశంలో ఆవును దాటించేందుకు పురోహితులు అడుగు బయటకు వేయటం లేదు. పెళ్లి పీటలపై నవదంపతులతో తలంబ్రాలు పోయించటానికి తటపటాయిస్తున్నారు. కరోనా రెండవ దశ విజృంభణ పురోహితును కలవరానికి గురిచేస్తోంది. మొదటి దశలో లాక్‌డౌన్‌ కారణంగా శుభకార్యాలను నిర్వాహకులు పూర్తిగా రద్దు చేసుకున్నారు. దీంతో పురోహితులు ఆర్థికంగా కుదేలైపోయారు. తరువాత కొన్నిరోజులు పర్లేదు అనిపించినా రెండోదశలో మాత్రం సీన్‌ రివర్స్‌ అయిపోయింది. తమ ఇళ్లలో శుభకార్యాలు నిర్వహించాలని అడుగుతున్నా తమవల్ల కాదని పురోహితులు చేతులెత్తి నమస్కిరించేస్తున్నారు. 


వదులుకున్నవి పదికిపైనే..

విజయవాడ నగరంలో పురోహితులు, వారి సహాయకులు మొత్తం దాదాపుగా 15 నుంచి 20 వేల మంది ఉంటారు. ప్రధాన పురోహితులు 8వేల మంది వరకు ఉంటారని అంచనా. వివాహ శుభకార్యాలు, గృహ నిర్మాణ శంకుస్థాపనలు, గృహప్రవేశాలతో పాటు ఉపనయనాలను నిర్వహిస్తూ ఉంటారు. వీరికి సహాయకులుగా ఒక్కొక్కరి వద్ద ఐదారుగురు ఉంటారు. ప్రధాన పురోహితులు సీజన్లలో 10 నుంచి 12 ముహుర్తాల వరకు ఒప్పుకుంటారు. వాటిని సహాయకుల చేత చేయిస్తుంటారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ముహుర్తాలు బలంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం నుంచే ప్రారంభం కాగా జూలై (ఆషాడం) వరకు ఉన్నాయి. దీంతో గత ఏడాది కోల్పోయిన ఉపాధి ఈ ఏడాది దక్కుతుందని పురోహితులంతా ఆశతో ఉన్నారు. కానీ ఊహించని రెండోదశ వారి ఆశలపై నీళ్లు జల్లింది. ఐదారు శుభ ముహుర్తాలను ఒప్పుకున్న పురోహితులు వాటినీ వదులుకున్నారు. ఒక్కో కార్యక్రమానికి ఒక్కో విధంగా సంభావన ఉంటుంది. భారీగా జరిగే పెళ్లిళ్లకు రూ.30 నుంచి రూ.50వేల వరకు తీసుకుంటారు. అదే ఒక మాదిరి అయితే రూ.10 నుంచి రూ.12వేల వరకు తీసుకుంటారు. ఒక్కో పురోహితుడు ఐదారు ముహుర్తాలు ఒప్పుకున్నా ఆదాయం బాగానే ఉంటుంది. అయినా కరోనా భయంతో వదులుకుని ఉన్నదాంట్లోనే తిందామన్న నిర్ణయానికి వచ్చేశారు. 


శాంతులు, హోమాలైతే ఓకే..!

శుభకార్యాల నిర్వాహణకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి, గృహ ప్రవేశాలకు 50 మందికి మించి అతిథులు ఉండరాదు. అదే ఖర్మలకు 20మంది వరకు నిర్దేశించింది. నిర్వాహకులు ముందుగా తహసీల్దార్‌ అనుమతి తీసుకోవాలి. వివరాలను అందజేయాలి. పరిమిత సంఖ్యలో నిర్వహించుకుంటున్నామని చెప్పినా జరిపించే ధైర్యం తమకు లేదని పురోహితులు తెగేసి చెబుతున్నారు. శాంతులు, హోమాలకయితేనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ కార్యాక్రమాల్లో అయితే కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాబట్టి. ఈ కార్యక్రమాల్లో సంభావన తక్కువే అయినా అదే పదివేలు అనుకుంటున్నారు. అంతేకాక ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. నేటి నుంచి మధ్యాహ్నం నుంచి కూడా కర్ఫ్యూ ఉంటుంది. ఇన్ని ఆంక్షల నడుమ వెళ్లేకంటే వదులుకోవటమే మేలనే భావనలో పురోహితులు ఉన్నారు.


రిస్క్‌ చేయదలుచుకోలేదు: వరమోహన్‌ శర్మ, పురోహితుడు

ఈ ఏడాది ముహుర్తాలు బాగానే ఉన్నాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు. ఒప్పుకున్న ముహూర్తానే వదిలేస్తున్నాం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో పరిస్ధితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. అలాంటి నరకంలోకి వెళ్లటం కన్నా, ఇంట్లోనే చిన్న చిన్న ఇబ్బందులు పడటమే మేలనిపిస్తోంది. పరిమిత సంఖ్యలో శుభకార్యాలు చేయాలని నిర్వాహకులు అనుకున్నా జరిపించే ధైర్యం పురోహితులకు లేదు. 


శుభకార్యాలను వదులుకుంటున్నాం: కామేశ్వర శర్మ, పురోహితుడు

ప్రస్తుతం ముహుర్తాలు ఒప్పుకున్నా పెరుగుతున్న కరోనా కేసుల వల్ల నిర్వహించే ధైర్యం చేయలేకపోతున్నాం. గత ఏడాది ముహూర్తాలను నిర్వాహకులు వద్దనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వాహకులు ముందుకొచ్చినా ఒప్పుకోలేకపోతున్నాం. ముహుర్తాలు ఎక్కువగా రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున వరకు ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం 12గంటల వరకే పర్మిషన్‌ ఇస్తే ఈ గ్యాప్‌లో వెళ్లటంలో ఇబ్బందులు ఎదుర్కొంటాం.

Updated Date - 2021-05-05T17:09:28+05:30 IST