లక్ష్మణ రేఖను దాటొద్దు..

ABN , First Publish Date - 2020-03-30T10:20:33+05:30 IST

‘ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైర్‌సకు మందు లేదు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఎవరికి వారే డాక్టరు. కరోనా నుంచి బయట పడాలంటే మీకు మీరే ముందస్తు జాగ్రత్తలు

లక్ష్మణ రేఖను దాటొద్దు..

  • ‘కరోనా’ను తెచ్చుకోవద్దు: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైర్‌సకు మందు లేదు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఎవరికి వారే డాక్టరు. కరోనా నుంచి బయట పడాలంటే మీకు మీరే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ, పరిశుభ్రత పాటిస్తూ, లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు లోబడి మీ ఇళ్లలోనే ఉండండి. లక్ష్మణ రేఖను దాటి, ప్రాణాంతక కరోనా వ్యాధిని కొని తెచ్చుకోకండి’’ అని ప్రజలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన ఆదివారం ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి చిన్న పనికి షాపింగ్‌కు వెళ్లడం, అవసరం లేకున్నా బయటకు వెళ్లడం, బంధువులను కలవడం వంటి పనులు చేయకండి. కొన్ని ఇబ్బందులున్నా ఇళ్లలోనే ఉండండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. సీతమ్మవారు లక్ష్మణరేఖ దాటి ఎలాంటి కష్టాలు పడ్డారో మీకు తెలుసు.   ఇంటి గడప దాటి అలాంటి కష్టాలను తెచ్చుకోవద్దు’’ అని సూచించారు.


ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచిన ప్రధాని

ప్రధాని మోదీ ‘మన్‌ కీ  బాత్‌’ ద్వారా కరోనాపై ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచారని, వైరస్‌ వల్ల ఇబ్బంది పడుతున్న రోగులు, వైద్య సిబ్బందికి మరింత మనోధైర్యం పెంచారని కిషన్‌రెడ్డి అన్నారు. కరోనాను ఓడించాలి. భారత్‌ తప్పకుండా విజయం సాధిస్తుందంటూ ప్రజల్లో ప్రధాని విశ్వాసం కలిగించారని చెప్పారు. ఎవరి ఊరును వారు రక్షించుకోవాలని, ఎవరి కుటుంబాన్ని వారు రక్షించుకోవాలని, మన దేశాన్ని మనందరం కాపాడుకోవాలని, దేశమంతా సుఖసంతోషాలతో ఉండాలని.. అది మీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. కరోనాపై యుద్ధంలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకులు రవాణా చేసే డ్రైవర్లు, హోం డెలివరీ చేస్తున్న యువకుల సేవను ప్రధాని అభినందించడం హర్షణీయమని కిషన్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2020-03-30T10:20:33+05:30 IST