పీటీడీకి కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2022-01-24T06:24:13+05:30 IST

ప్రజార వాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌కు కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ దెబ్బ తగిలింది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రయాణాలు సాగించేందుకు ప్రజలు భయపడుతున్నారు.

పీటీడీకి కరోనా దెబ్బ

కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో తగ్గిన ప్రయాణికులు

పడిపోయిన ఆక్యుపెన్సీ రేషియో

సగటు ఓఆర్‌ 72 శాతం 

శని, ఆదివారాల్లో 54 శాతమే!


ద్వారకాబస్‌స్టేషన్‌, జనవరి 23: ప్రజార వాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌కు కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ దెబ్బ తగిలింది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రయాణాలు సాగించేందుకు ప్రజలు భయపడుతున్నారు. సంక్రాంతి ముగిసిన తరువాత తిరుగుప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని పీటీడీ అధికారులు అంచనా వేశారు. కానీ సాధారణ రోజుల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్య కూడా లేకపోయింది. గత మూడు రోజులఆక్యుపెన్సీ రేషియో పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. 

విశాఖ రీజియన్‌ పరిధిలో పది డిపోలకు చెందిన 1,051 బస్సులు షెడ్యూల్‌ ప్రకారం ప్రయాణికులకు సేవలు అందిస్తే సగటున 72 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. తద్వారా కోటి రూపాయల ఆదాయం వస్తుంది. అయితే కరోనా వైరస్‌ వ్యాపి ఎక్కువగా ఉండడంతో చాలా మంది తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమో లేదా రద్దు చేసుకోవడమో చేశారు. హైదరాబాద్‌, విజయవాడ. తిరుపతి, చెన్నై వంటి  దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కూడా తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో  ఓఆర్‌ బాగా పడిపోయింది. అదే విధంగా జోనల్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. దీంతో ఆదివారం ఎనిమిది షెడ్యూల్‌ బస్సులను రద్దు చేశారు. కనీస స్థాయింలో కూడా ప్రయాణికులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సగటు ఓఆర్‌ 58 శాతం నమోదుకాగా శని, ఆదివారాల్లో 54 శాతానికి పడిపోయింది. సోమ, మంగళవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-01-24T06:24:13+05:30 IST