ఎంతెంత దూరం!

ABN , First Publish Date - 2020-03-30T09:42:13+05:30 IST

ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరోనా జిల్లాకు మధ్య దూరం 326 కిలోమీటర్లు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 39ఏళ్ల రణ్‌వీర్‌ సింగ్‌ సొంత ప్రాతం మొరోనా జిల్లాలోని ఓ మారుమూల పల్లె! లాక్‌డౌన్‌తో రెస్టారెంట్‌ బంద్‌

ఎంతెంత దూరం!

  • ఢిల్లీ నుంచి భారీగా స్వస్థలాలకు వలస కూలీలు, కార్మికులు
  • ఆకలితో చస్తామనే భయం.. 
  • స్వస్థలాలకు చేరితే గంజితాగి బతకొచ్చనే ఆశ


న్యూఢిల్లీ, మార్చి 29: ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరోనా జిల్లాకు మధ్య దూరం 326 కిలోమీటర్లు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 39ఏళ్ల రణ్‌వీర్‌ సింగ్‌ సొంత ప్రాతం మొరోనా జిల్లాలోని ఓ మారుమూల పల్లె! లాక్‌డౌన్‌తో రెస్టారెంట్‌ బంద్‌ చేయడంతో సొంతూరువైపు నడక సాగించాడు. ఓ 200కిలోమీటర్ల మేర నడక పూర్తి చేశాడు. అలా నడుస్తూనే ఛాతీలో నొప్పి అంటూ తనతో వస్తున్న ఇద్దరు మిత్రులకు చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికే రోడ్డుమీదే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మరి.. ఎండలో అంత ప్రయాష పడి నడవడం ఎందుకు? ఉన్నచోటే హాయిగా ఉండొచ్చు కదా? అని అడిగితే ’’కరోనా వస్తే చస్తామో లేదో తెలియదు గానీ అంతకన్నా ముందు ఇక్కడుంటే ఆకలితో చచ్చేట్టున్నాం’’ అని ఢిల్లీలోని మురికివాడలో ఉంటున్న 30 ఏళ్ల సావిత్రి అనే వలస కార్మికురాలు వాపోయింది. ‘‘నా చంటి బిడ్డ పాల కోసం ఏడుస్తోంది.. ఆ బాధ నాకు తెలుసు. సాయం చేసేందుకు  ఇక్కడ ఎవ్వరూ లేరు’’ అని చెప్పింది. తనకు సంబంధించిన వస్తువుల మూటను నెత్తిన పెట్టుకొని 400 కిలోమీటర్ల దూరం యూపీలోని కనౌజ్‌ జిల్లావైపు సాగుతోంది!  ..వలస కార్మికులు ఆగడం లేదు! లాక్‌డౌన్‌ను పట్టించుకోవడం లేదు. 


మండె ఎండలో ఆకలిదప్పులతో కడుపు మాడుతున్నా.. ఆఖరుకు ప్రాణాలే పోతున్నా నడక ఆపడం లేదు. ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో వలసదార్లు.. బిహార్‌, యూపీ, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోని తమ సొంతూళ్లకు నడుచుకుంటూ వెళుతున్నారు. లాక్‌డౌన్‌ గడువు ముగిసేదాకా ఢిల్లీలోని వలసదార్లు రాష్ట్రం వీడి వెళ్లొద్దని, పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని.. వలసదార్ల కోసం సరిపడా ఏర్పాట్లు చేశామని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు. కేరళలోని కొట్టాయంలో వందల మంది వలసదార్లు రోడ్లమీద పడ్డారు. ఆప్రమత్తమైన అధికారులు వారిని శిబిరాలకు తరలించారు. అక్కడ అన్ని వసతలు కల్పిస్తున్నా.. సొంతూళ్లకు వెళతామంటూ పట్టుబడుతున్నారు. ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మాదిరిగా తమను సొంత ప్రాంతాలకు తరలించేందుకు వాహన సౌకర్యం కల్పించాలంటూ వేడుకుంటున్నారు. తమ రాష్ట్రంలో ఉంటున్న యూపీ వలసదార్ల తరలింపునకు హరియాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 800 పైచిలుకు బస్సులను ఏర్పాటు చేసింది. 


యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా వసలదార్లను తరలిస్తోంది. ఢిల్లీ, బిహార్‌ నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన వలసదార్లను స్వస్థలాలకు తరలించేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా 1500 బస్సులను ఏర్పాటుచేసింది.  వలసదార్లు కంగారు పడొద్దని.. భోజన వసతి కల్పిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే భరోసా ఇచ్చారు. దినసరి కూలీలు, వలస కార్మికులకు సాయం చేయాలని రాష్ట్రాల్లోని పార్టీ యూనిట్లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. అన్నార్తులకు తిండి,  నిత్యావసరాలు అందజేసేందుకు బడా వ్యాపారాలు విరాళాలివ్వాలని త్రిపుర సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ కోరారు. ఒడిసాలో చిక్కుకున్న వలసదార్లకు ఆహారం, వసతులు కల్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వలసదార్లకు సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ ఆదేశించింది.


కార్మికుల జీతాలు తగ్గించొద్దు

చండీగఢ్‌: పంజాబ్‌లోని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు కార్మికులను పనుల్లోంచి తొలగించొద్దని, జీతాలు తగ్గించొద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌తో తాత్కాలికంగా మూతపడ్డ కర్మాగారాల్లోని కార్మికులను విధు ల్లో ఉన్న వారిగానే గుర్తించాలని తెలిపింది.

Updated Date - 2020-03-30T09:42:13+05:30 IST