ఐటీ కంపెనీల్లో గుబులు

ABN , First Publish Date - 2020-02-22T07:23:36+05:30 IST

చైనాను ఠారెత్తిస్తున్న కరోనా వైరస్‌.. భారత ఐటీ కంపెనీలనూ భయపెడుతోంది.

ఐటీ కంపెనీల్లో గుబులు

  • భయపెడుతున్న కరోనా
  • వచ్చే 2-3 వారాలు అత్యంత కీలకం

ముంబై: చైనాను ఠారెత్తిస్తున్న కరోనా వైరస్‌.. భారత ఐటీ కంపెనీలనూ భయపెడుతోంది. ప్రస్తుతానికైతే భారత ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం పెద్దగా లేదు. అయితే వచ్చే రెండు మూడు వారాల్లో పరిస్థితి అదుపులోకి రాక పోతే మాత్రం తిప్పలుతప్పక పోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనాలోని అనేక తయారీ కంపెనీలు భార త ఐటీ కంపెనీల ఖాతాదారులు కావడమే ఇందుకు కారణం.


ఉద్యోగులపై ప్రభావం 

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ వంటి భారత ఐటీ కంపెనీలకు చైనాలో యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల ద్వారా ఈ కంపెనీలు చైనాలోని తయారీ కంపెనీలకు అవసరమైన ఐటీ సేవలు అందిస్తున్నాయి. ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు సగం మంది స్థానిక చైనీ యులే. వైరస్‌ భయంతో భారత ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని చేయమని తమ ఉద్యోగులకు చెప్పాయి. లేదా వైరస్‌ ప్రభావం లేని ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి పని చేయిస్తున్నాయి. దీంతో ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


7 శాతం ఆదాయం చైనా నుంచే..

ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలకు చైనా ఏమంత పెద్ద మార్కెట్‌ కాదు. అమెరికా, ఐరోపా దేశాలే ఈ కంపెనీలకు పెద్ద మార్కె ట్లు. అయితే ఆసియా, పసిఫిక్‌ దేశాల నుంచి వచ్చే ఐటీ ఆదాయాల్లో 5-7 శాతం వాటా  చైనాదే. 

కరోనా వైరస్‌ దెబ్బతో చైనా జీడీపీ వృద్ధి రేటు 0.3 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. త్వరలో పరిస్థితి కుదుటపడకపోతే పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఆ ప్రభావం చైనాలో పని చేస్తున్న భారత ఐటీ కంపెనీలపైనా తప్పదు. మున్ముందు పరిస్థితి ఇంకా దయనీయంగా మారితే భారత ఐటీ కంపెనీల రాబడులకు మరింత గండిపడే అవకాశాలు లేకపోలేదు. 


కొన్ని భారత ఐటీ కంపెనీలు చైనాలోని తయారీ కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్నాయి. మధ్య, దీర్ఘకాలంలో ఈ కంపెనీలపై కరోనా  ప్రభావం తప్పకుండా ఉంటుంది.

 - ప్రవీణ్‌ రావు, వైస్‌ చైర్మన్‌, నాస్కామ్‌ 

Updated Date - 2020-02-22T07:23:36+05:30 IST