ఎయిర్‌లైన్స్‌పై కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-02-22T07:14:42+05:30 IST

ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ప్రయాణానికి విమానాలు ఎంతో ముఖ్యమైనవి. అతి తక్కువ సమయంలో ఈ లోహ విహంగాలు కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

ఎయిర్‌లైన్స్‌పై కరోనా దెబ్బ

  • రూ.2 లక్షల కోట్ల ఆదాయానికి గండి: ఐఏటీఏ

ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ప్రయాణానికి విమానాలు ఎంతో ముఖ్యమైనవి. అతి తక్కువ సమయంలో ఈ లోహ విహంగాలు కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వీటి రాకపోకల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు. ప్రయాణికుల సంఖ్య తగ్గితే విమాన కంపెనీలకు నష్టాలూ తప్పవు.  అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ విమానయాన సంస్థల పాలిట శాపంలా మారింది. ఇప్పటికే ఈ వైరస్‌ చాలా మంది ప్రాణాలను బలిగొంది. వేలాది మంది దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దీని వల్ల విమాన కంపెనీలు భారీ స్థాయిలో రాబడిని కోల్పోతాయన్న అంచనాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. 


ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో 2,780 కోట్ల డాలర్లు

ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన కంపెనీలు ఈ ఏడాదిలో ఉమ్మడిగా 2,780 కోట్ల డాలర్ల రాబడిని కోల్పోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) చెబుతోంది. కరోనా వైరస్‌ సంక్షోభమే ఇందుకు కారణంగా పేర్కొంది. పూర్తి ఏడాదికి ప్రయాణికుల డిమాండ్‌లో 13 శాతం తగ్గుదల ఉంటుందన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపింది. ‘‘ఏడాది ఎయిర్‌లైన్స్‌కు చాలా కష్టమైన సంవత్సరం’’ అని ఐఏటీఏ సీఈఓ అలెగ్జాండర్‌ దీ జునియాక్‌ తెలిపారు. విస్తరిస్తున్న వైర్‌సను నియంత్రించడం అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. ఇంతకు ముందు 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పటివరకెన్నడూ ఈ స్థాయిలో విమాన ప్రయాణ డిమాండ్‌ తగ్గలేదని ఆయన చెప్పారు. 


ప్రయాణికుల రాకపోకలు 4.7ు తగ్గే చాన్స్‌

ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల రాకపోకలు 4.7 శాతం తగ్గవచ్చని ఐఏటీఏ భావిస్తోంది. చైనాలోని ఎయిర్‌లైన్స్‌ దేశీయ మార్కెట్లోనే 1,280 కోట్ల డాలర్ల రాబడిని కోల్పోయే అవకాశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌ వెలుపలి విమానయాన కంపెనీలు 150 కోట్ల డాలర్ల నష్టాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ కారణంగా ఎయిర్‌లైన్‌ కంపెనీలు 2,930 కోట్ల డాలర్లు (రూ.2లక్షల కోట్లు) కోల్పోవచ్చని అంచనా వేస్తోం ది. ఒకవేళ వైరస్‌ ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో మరింతగా విస్తరిస్తే ఇతర ప్రాంతాల్లోని ఎయిర్‌లైన్స్‌పై కూడా ప్రభా వం ఎక్కువగా ఉంటుందని ఐఏటీఏ హెచ్చరిస్తోంది. అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లోని ఎయిర్‌లైన్స్‌ 4.8 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు తలక్రిందులయ్యాయి. అయితే కొన్ని అంశాలతో మాత్రం ఎయిర్‌లైన్‌ ఇబ్బందులు కాస్త తగ్గడానికి అవకాశం ఉందంటున్నారు. 


విమానాల రద్దు

చైనాలో కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలైన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఆస్ర్టేలియాకు చెందిన క్వాంటాస్‌, అమెరికాకు చెందిన మూడు అతిపెద్ద విమానయాన కంపెనీలు చైనాకు విమాన సర్వీసులను రద్దు చేశాయి. కొన్ని సందర్భాల్లో విమాన సర్వీసుల రద్దు ఏప్రిల్‌ లేదా మే వరకు కొనసాగవచ్చంటున్నారు. ఉద్యోగులు మూడు వారాల పాటు వేతనం లేని సెలవు తీసుకోవాలని క్యాథేపసిఫిక్‌ కోరింది. చాలా దేశాలు చైనాకు వెళ్లవద్దని తమ దేశ పౌరులకు సూచిస్తున్నాయి. చాలా మంది స్వచ్చందంగా తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. 


‘‘ప్రభుత్వం ద్రవ్య, పరపతి విధానాన్ని ప్రతికూల ఆర్థిక ప్రభావాల నుంచి బయటపడేయడానికి వినియోగించే అవకాశం ఉంది. ఇంధన ధరలు తక్కువగా ఉన్నందు వల్ల కొన్ని విమానయాన కంపెనీలకు కొంత ఉపశమనం లభించవచ్చు. అయితే ఇది ఎంత కాలం అన్న దాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. ఇక కంపెనీలు రాబడులను కోల్పోతే వాటి లాభాలపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందన్న దాని గురించి ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు తమ సామర్థ్యాలను తగ్గించుకుంటున్నాయి. కొన్ని రూట్లకు సర్వీసులను తగ్గిస్తున్నాయి’’ 

                   - ఐఏటీఏ 

Updated Date - 2020-02-22T07:14:42+05:30 IST