విద్యాసంస్థలపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-01-17T05:44:30+05:30 IST

విద్యాసంస్థలపై మరోసారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. అందరూ ఊహిస్తున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల సెలవులను మరో 15 రోజులపాటు పొడిగించింది.

విద్యాసంస్థలపై కరోనా ఎఫెక్ట్‌

- 30 వరకు సెలవుల పొడిగింపు

- మెడికల్‌ కళాశాలలకు మినహాయింపు

- ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 16: విద్యాసంస్థలపై మరోసారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. అందరూ ఊహిస్తున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల సెలవులను మరో 15 రోజులపాటు పొడిగించింది. మెడికల్‌ కళాశాలలకు మినహా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలన్నింటికి ఈనెల 30 వరకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవో ఆర్టీ4, తేదీ 16.1.2022ను జారీ చేశారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ కారణంతో సెలవులను 30వ తేదీ వరకు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌)తోపాటు మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పూర్తిస్థాయిలో కొవిడ్‌ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకొని ప్రత్యక్ష బోధన తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వేడుకలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పండుగలు, పబ్బాలకు అనుమతిచ్చి  విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం ఏమిటని పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా దెబ్బతిన్న విద్యావ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఈ సమయంలో మళ్లీ సెలవులు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. 

ఫ సెలవుల పొడిగింపు సరికాదు

- డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోహెడ చంద్రమౌళి 

కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులను పొడగించడం సరికాదు. ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబరు 1 నుంచి భౌతిక తరగతులను ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే తరగతులు, సిలబస్‌ గాడిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా సెలవులు పొడగించడం సరికాదు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం వెంటనే పాఠశాలలను తెరవాలి.

ఫ సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి 

- ‘ట్రస్మా’

రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఈనెల 30 వరకు పొడగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూధన్‌, కోశాధికారి ఐవీ రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు.  మార్కెట్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌, వైన్స్‌, బార్లు, క్లబ్బుల్లో ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నింటిని విడిచిపెట్టి  విద్యనందించే విద్యాసంస్థలను మూసివేయడం సరికాదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-01-17T05:44:30+05:30 IST