America లో సీన్ రివర్స్.. తాజా సర్వేలో వెల్లడయిన నిజాలివి..!

ABN , First Publish Date - 2021-11-16T20:04:18+05:30 IST

America లో సీన్ రివర్స్.. తాజా సర్వేలో వెల్లడయిన నిజాలివి..!

America లో సీన్ రివర్స్.. తాజా సర్వేలో వెల్లడయిన నిజాలివి..!

అమెరికా విద్యపై కరోనా పిడుగు!

15% తగ్గిన వర్సిటీ ప్రవేశాలు.. 13 శాతం తగ్గిన భారత విద్యార్థులు


వాషింగ్టన్‌/ఢిల్లీ, నవంబరు 15: అమెరికా విద్యపై ఈ ఏడాది కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరే భారత్‌ సహా అన్ని దేశాల విద్యార్థుల సంఖ్య కరోనా నేపథ్యంలో 15%తగ్గిపోయింది. ఇలా జరగడం 1948 తర్వాత ఇదే తొలిసారి అని విదేశీ విద్యార్థుల చేరికపై సర్వే నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోమవారం విడుదల చేసిన నివేదిక ‘ఓపెన్‌ డోర్స్‌’లో పేర్కొంది. సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం విదేశీ విద్యార్థుల సంఖ్య 4% మాత్రమే పుంజుకుంది. అయితే.. ఇది మెరుగైన ఫలితమే. ఎందుకంటే డెల్టా వేరియంట్‌ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు అమెరికా వచ్చే సాహసం చేయరని ఇక్కడి విద్యాసంస్థలు భయపడ్డాయి. ఇలాంటి సమయంలోనూ 4% మేర విద్యార్థుల ప్రవేశాలు పుంజుకోవడం విశేషం. విదేశీ విద్యార్థులకు వీసా సమస్య కూడా వెంటాడుతోంది. ‘‘కరోనా అనంతరం ఉప్పెనలా విద్యార్థులు వస్తారని భావిస్తున్నాం’’ అని అమెరికా తాత్కాలిక సహాయ మంత్రి మాథ్యూ ల్యూసెన్‌హాప్‌ తెలిపారు.


 దేశవ్యాప్తంగా 70% కాలేజీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య 20% తగ్గిపోగా.. 10% మాత్రమే నిలకడగా ఉంది. అంతర్జాతీయంగా 10 వేల మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా.. ఆయా విద్యాసంస్థల్లో చేరే సరికి 28శాతం తగ్గుదల నమోదైంది. ప్రతిష్టాత్మక న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో 14% ప్రవేశాలు తగ్గాయి. రోచెస్టర్‌ యూనివర్సిటీ, ఇతర ప్రఖ్యాత సంస్థల్లోనూ 70 శాతం ప్రవేశాలే ఉన్నాయి. ఆయా సంస్థల్లో ఎన్‌రోల్‌ చేసుకున్న వారిలోనూ 65% మంది మాత్రమే క్లాసులకు హాజరవుతున్నారు. కొన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విధానాలు అవలంభిస్తుండడంతో ఇబ్బందులు తగ్గాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఫీజులు కూడా ఒక కారణమే. చాలా కాలేజీలు ద్వితీయ సంవత్సరం ఫీజులను తగ్గించలేదు. ఆస్ట్రేలియా, కెనడా సహా ఇతర దేశాల్లోని విద్యాసంస్థల పోటీ తత్వం వల్ల కూడా విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. విదేశీ విద్యార్థులు పుంజుకునేలా అధ్యక్షుడు జోబైడెన్‌ చర్యలు చేపట్టాలని విద్యాసంస్థలు కోరుతున్నాయి. 


భారత విద్యార్థులూ తగ్గుముఖం

అగ్రరాజ్యంలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా 2020-21లో 13% తగ్గిపోయిందని ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదిక వెల్లడించింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో 62 వేల మంది భారత విద్యార్థులకు వీసా మంజూరు చేసినట్టు ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయ సీనియర్‌ అధికారి ఆంథోనీ మిరిండా తెలిపారు. విదేశీ విద్యపై కరోనా ప్రభావం పడిందని.. అయితే.. త్వరలోనే మళ్లీ పుంజుకుంటామని వివరించారు.


న్యూయార్క్‌-ఢిల్లీ విమానం షురూ

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ న్యూయార్క్‌-ఢిల్లీ విమాన సర్వీసును ఈ నెల 12 నుంచి ప్రారంభించింది. ఈ బోయింగ్‌ 777-300 విమానంలో 8 ఫస్ట్‌ క్లాస్‌, 52 బిజినెస్‌ క్లాస్‌, 28 ప్రీమియం ఎకానమీ, 216 ఎకానమీ క్లాస్‌ సీట్లు ఉంటాయని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెల్లడించింది. 


Updated Date - 2021-11-16T20:04:18+05:30 IST