కరోనా సెకండ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోరేం..!?

ABN , First Publish Date - 2021-04-19T06:47:39+05:30 IST

వ్యాపార, వైద్యపర, వ్యక్తిగత తదితర అవసరాలతో నిత్యం లక్షలాది మంది హైదరాబాద్‌కు వచ్చి....

కరోనా సెకండ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోరేం..!?

  • కరోనా రవాణా
  • వైరస్‌ ప్రభావిత రాష్ట్రాల నుంచి ప్రయాణికులు
  • వారికి పరీక్షలు, వారిపై పర్యవేక్షణ కరువు
  • పాజిటివ్‌ల నుంచి ప్రయాణికులకు, సిబ్బందికి ముప్పు
  • 15 మంది కాచిగూడ స్టేషన్‌ సిబ్బందికి కరోనా
  • మహారాష్ట్ర, కర్ణాటక ప్రయాణికుల నుంచేనన్న అనుమానాలు 
  • సెకెండ్‌ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోని రైల్వే అధికారులు 

వ్యాపార, వైద్యపర, వ్యక్తిగత తదితర అవసరాలతో నిత్యం లక్షలాది మంది హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటారు. కరోనా పీడిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, కేరళ నుంచి నిత్యం నగరానికి రాకపోకలు సాగుతుంటాయి. ప్రధాన రవాణా సాధనాలైన రైళ్లు, బస్సుల ద్వారా వచ్చేవారిపై కనీస పర్యవేక్షణ విధానాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆ ప్రయాణికులలో కరోనా బాధితులు ఎవరైనా ఉంటే వారిని అక్కడికక్కడే గుర్తించే ఏర్పాట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 


అడ్డగుట్ట, ఏప్రిల్‌ 18 ( ఆంధ్రజ్యోతి) : పెరుగుతున్న కరోనా కారణంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అవగాహన కల్పించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తెల్లవారుఝామున 4 గంటల నుంచి మధ్యరాత్రి 11.45 గంటల సమయంలో స్పెషల్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజూ 1.20 లక్షల మంది ప్రయాణికులు వెళ్లి వస్తున్నారు. తొలుత రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసేవారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో మానేశారు. స్టేషన్‌కు వచ్చే వాళ్లు నేరుగా టర్మినేటర్‌ యంత్రం నుంచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులను కంప్యూటర్‌ ద్వారా స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. కానీ, కరోనాకు అందులో ఎలాంటి సూచికలూ లేవని తెలుస్తోంది. ఆ స్ర్కీనింగ్‌ ద్వారా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులు ఇప్పటి వరకూ లేరు. 


ఎన్నో దారులు

ప్రయాణికులందరూ స్టేషన్‌ ప్రధాన ముఖ ద్వారం మీదుగా రావడం లేదు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బోయగూడ వైపు రెండో ద్వారం, రేతిఫైల్‌ బస్టాండు నుంచి కూడా లోపలకి వెళ్లొచ్చు. ఇలాంటి దారులు అనేకంగా ఉన్నప్పటికీ ఎక్కడా థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు లేవు. ప్రధాన ద్వారం వద్ద మాత్రమే ఆ యంత్రాలు కనిపిస్తున్నాయి.  


మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్‌కు 

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఉంది. పుణె, మహారాష్ట్ర, నాందేడ్‌ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి చిరు ఉద్యోగులు, వ్యాపారులు ప్రత్యేక రైళ్లలో నగరానికి వచ్చేస్తున్నారు. వారికి ఎటువంటి పరీక్షలూ ఇక్కడ చేయడం లేదు. 


ప్రత్యేక రైళ్లు ఇవే

మహారాష్ట్ర, నాందేడ్‌ వంటి ముఖ్యమైన కరోనా ప్రభావిత కేంద్రాల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. 

02720 సికింద్రాబాద్‌ - నాందేడ్‌ 

02713 సికింద్రాబాద్‌ - నాందేడ్‌ 

07064 సికింద్రాబాద్‌ - నాందేడ్‌ 

07058 సికింద్రాబాద్‌ - నాందేడ్‌ 

09714 సికింద్రాబాద్‌ - నాందేడ్‌ 

02085 సికింద్రాబాద్‌ - నాందేడ్‌ 

02702 సికింద్రాబాద్‌ - పూణే

02756 సికింద్రాబాద్‌ - పూణే 


కాచిగూడలో కరోనా వ్యాప్తి 

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ఇతర రాష్ట్రాల నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులతో కరోనా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఏపీ రాష్ట్రాల నుంచి అధికంగా ప్రయాణికులు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 15 మంది సిబ్బందికి కరోనా వారి నుంచే వచ్చి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, కర్నాటక సంపర్క్‌ క్రాంతి, ఏపీ సంపర్క్‌ క్రాంతి, మైసూరు - కాచిగూడ, వైన్‌ గంగా, ఓకా, యశ్వంత్‌పుర్‌ - లక్నో, గోరఖ్‌పుర్‌ - యశ్వంత్‌పుర, అమరావతి - తిరుపతి, నాందేడ్‌ - ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్‌ గుండా వెళ్తుంటాయి. కరోనా ప్రభావిత అధికంగా ఉన్న ఆయా రాష్ట్రాల నుంచి ప్రయాణికులు కాచిగూడ రైల్వే స్టేషన్‌ గుండా బయటకు వస్తున్నారు. స్టేషన్‌లో ఎటువంటి తనిఖీలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 


15 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 15 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతుండడం రైల్వే అధికారులను కలవరపెడుతోంది. ఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి, రైల్వే ఎలక్ట్రికల్‌ ఉద్యోగికి, టెలికామ్‌ విభాగం అధికారి కరోనా బారినపడ్డారు. రిజర్వేషన్‌ కేంద్రంలో ఒకరు, విచారణ కేంద్రంలో ఇద్దరు, రైల్వే స్టేషన్‌లో టికెట్‌లను తనిఖీ చేసే వారిలో ముగ్గురు, రైళ్లల్లో టికెట్‌ తనిఖీ చేసే అయిదుగురు కరోనా బారినపడ్డారు. 


మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రయాణికులు నగరానికి వస్తున్నారు. వారికి రైల్వేస్టేషన్‌లో థర్మల్‌ స్ర్కీనింగ్‌తో పాటు ఎలాంటి టెస్టులూ చేయడం లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. అందువల్ల లక్షణాలు ఉంటే క్వారంటైన్‌కు పంపే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు

Updated Date - 2021-04-19T06:47:39+05:30 IST