శ్రామిక వాడ.. కరోనా పీడ

ABN , First Publish Date - 2021-05-15T07:02:54+05:30 IST

పెద్ద పరిశ్రమలకు చిన్న పరిశ్రమలు

శ్రామిక వాడ.. కరోనా పీడ

- పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకం

- ఉపాధిపై కరోనా కాటు

- ఉత్పత్తికి వైరస్‌ కాటు

- ఊరెళ్లి పోతున్న వలస కార్మికులు

- వారిని కాపాడుకునే ప్రయత్నాల్లో యాజమాన్యాలు

చిన్న పరిశ్రమలకు అతిపెద్ద గండం వచ్చిపడింది. సంవత్సరం కింద మొదలైన కరోనా పీడ పరిశ్రమల ఉసురు తీస్తోంది. అప్పులు చేసి, రాత్రనకా, పగలనకా కష్టపడి పరిశ్రమలు స్థాపించిన వారు ఈ గండం గడిచేదెలాగో దారిచూపమని దేవుళ్లను వేడుకుంటున్నారు. ఈ పరిశ్రమలపైనే ఆధారపడ్డ వేలాది కార్మికులు కూడా జీవితంపై భయంతో నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. వలస కార్మికులది ఇంకా విషమ పరిస్థితి. ఇన్నాళ్లూ అన్నం పెట్టిన పరిశ్రమను వదలలేరు.. పోనీ ఉండిపోదామా అంటే ‘రేపు’  ఏమిటో అన్న దిగులు. నగరానికి నలుమూలలా విస్తరించిన పారిశ్రామిక వాడలపై వైరస్‌ చిమ్ముతున్న విష ప్రభావాలపై ప్రత్యేక కథనాలు మీ కోసం..


బాలానగర్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : 

పెద్ద పరిశ్రమలకు చిన్న పరిశ్రమలు ఆయువు పట్టుగా పని చేస్తుంటాయి. అటువంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కరోనా ఉధృతికి కొట్టుకుపోయేలా కనిపిస్తున్నాయి. గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికి పోయిన నిర్వాహకులు, రెండో దశలో మరోసారి ఇక్కట్ల పాలవుతున్నారు. కార్మికులకు జీతాలు చెల్లించే ఆర్థిక సౌలభ్యం లేకపోవడంతో సంఖ్యను తగ్గించుకుని తామూ ఒక వర్కర్‌గా పని చేస్తూ పరిశ్రమలను నడిపించుకుంటున్నారు. 


మూగబోయిన పారిశ్రామిక వాడలు 

సూది నుంచి మొదలుకుని మిస్సైల్స్‌, ఫార్మా, ఫుడ్‌, రైస్‌మిల్స్‌, గ్యాస్‌ సిలిండర్లు, బోర్‌ పంపులు, ఆటోమొబైల్‌ రంగానికి కావలసిన జనరల్‌ విడిభాగాల తయారీ కేంద్రాలు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు. బాలానగర్‌, గౌతమీనగర్‌, నవజీవన్‌నగర్‌, శోభనాకాలనీ, ఫతేనగర్‌, ప్రశాంతినగర్‌, గాంధీనగర్‌, రంగారెడ్డినగర్‌, జీడిమెట్ల చర్లపల్లి, పటాన్‌ చెరువు, కాటేదాన్‌, మేడ్చల్‌, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో పని చేసే వారంతా ఒడిశా, బిహార్‌, జార్ఖండ్‌, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన వారే. వీరికి నిర్వాహకులు రూ. 10వేల నుంచి 30 వేల వరకు వేతనాలు చెల్లిస్తూ ఉంటారు. లాక్‌డౌన్‌ ప్రకటనతో కార్మికుల, పరిశ్రమల నిర్వాహకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.


ట్రేడింగ్‌ వైపు మొగ్గు 

ఇప్పటి వరకు ఉత్పత్తి రంగాలకు కావలసిన విడి భాగాలు తయారుచేసే  చిన్న పరిశ్రమల నిర్వాహకులు ట్రేడింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. కరోనా కాలానికి ఉపయోగ పడే వాటిని తయారు చేయడం లేదా తయారు చేసిన వారి నుంచి కొనుగోలు చేసి మార్కెట్‌లో రిటైల్‌గా విక్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, తదితర వాటిపై దృష్టి పెడుతున్నారు. 


జంకుతున్న వలస కార్మికులు  

పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులు లాక్‌డౌన్‌ పదం వింటేనే జంకుతున్నారు. గతేడాది అనుభవాల నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తూ ముందుగానే ఊళ్లకు బయలుదేరిపోతున్నారు. లాక్‌డౌన్‌కు ముందే చాలా మంది ఊర్లకు వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఇంకొంత మంది ఊరిబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కొందరు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.


వెసులుబాటు కల్పించాలి

లాక్‌డౌన్‌ నుంచి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు వెసులు బాటు కల్పించాలని నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకరిద్దరు కార్మికులతో కలిసి తాము కూడా రోజంతా కష్టపడితే కానీ, ఆర్డర్లు సకాలంలో ఇచ్చేందుకు ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది. తమనే నమ్ముకుని ఉన్న కార్మికులను పొమ్మన లేక, ఉంచుకుని జీతాలు ఇవ్వలేక, మనోవేదనకు గురి కావలసి వస్తోందని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే ఉన్నతాధికారులు, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో పరిశ్రమలకు ఆంక్షలతో కూడిన వెసులు బాటు కల్పించాలని నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


అసలు పని పక్కనబెట్టి

- ఉపేందర్‌రెడ్డి, మౌనిక ఇంజనీరింగ్‌, గీతానగర్‌, నవజీవన్‌ నగర్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ అధ్యక్షుడు. 

ఆస్మార్‌ పేరుతో మినీ డ్రాఫ్టర్‌, సెట్‌స్కేర్స్‌ తయారు చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలకు విక్రయించేవాడిని. కరోనా దెబ్బకు కళాశాలలన్నీ మూత పడడంతో తయారు చేసిన స్టాక్‌, ముడిసరుకు (సుమారు రూ. 20లక్షలు) అంతా అలాగే ఉండి పోయింది. కొన్ని నెలల క్రితం భారీ వర్షాలతో కంపెనీలోకి నీరు చేసి  మిషనరీ దెబ్బతింది. అందుకే డ్రాఫ్టర్‌ తయారీని పక్కన పెట్టి వేరే ప్లాస్టిక్‌ మౌల్డింగ్‌ వర్క్‌ చేయాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ ప్రకటన రాక ముందే వలస కార్మికులు వెళ్ళి పోయారు. ఇప్పుడు పనులు చేసుకోలేని పరిస్థితి. 


వలస కార్మికులను పట్టించుకోవడం లేదు

- అంబటి సునీల్‌ కుమార్‌, బాలానగర్‌ మైక్రో, స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు.

రాబోయే రోజుల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయంగా ఉంది. వలస కార్మికులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అద్దెలు పెంచుతూ యజమానులు వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు స్థలాలను కేటాయించాలి.


అనుమతి ఇవ్వండి

- దిడ్డి ప్రభాకర్‌, అధ్యక్షుడు, అక్షయ్‌ ఎన్‌క్లేవ్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.

గత లాక్‌డౌన్‌తో పరిశ్రమలు ఇప్పటికీ కోలుకోలేదు. ఆ తర్వాత వర్షాలు ముంచేశాయి. ఇపుడు కరోనా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తే మంచిది. 

Updated Date - 2021-05-15T07:02:54+05:30 IST