కరోనా నుంచి కోలుకున్న యువకుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన కలెక్టర్, ఎస్పీ

ABN , First Publish Date - 2020-04-04T19:04:32+05:30 IST

కరోనా కట్టడికి రానున్న పది రోజులు మరింత కీలకం కావడంతో జిల్లా పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది. అటు లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు అధికంగా ఉండడం, పాజిటివ్‌ కేసులు పెరగడంపై కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన బయటకు వచ్చినవారికి రెండేళ్ల జైలుశిక్ష కూడా విధించడానికి వెనుకాడవద్దని ఆదేశించింది.

కరోనా నుంచి కోలుకున్న యువకుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన కలెక్టర్, ఎస్పీ

మరింత పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుకు పోలీసుశాఖ సన్నాహాలు

రానున్న 10 రోజులు కరోనా కట్టడికి చాలాకీలకం కావడంతో అప్రమత్తం

బయట తిరిగే వారి సంఖ్య క్రమేపీ ఎక్కువవుతుండడంపై ఆందోళన

అటు లాక్‌డౌన్‌ ఉల్లంఘనతో పాజిటివ్‌ కేసులు పెరగడంపై కేంద్రం హెచ్చరిక

నయం కావడంతో ఆసుపత్రి నుంచి రాజమహేంద్రవరం యువకుడి డిశ్చార్జి

ఆ యువకుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు, నేతలు

ఇటు కరోనా అనుమానిత లక్షణాలతో మరో 26 మంది కాకినాడ రాక

శుక్రవారం మరో రెండు కేసులు పాజిటివ్‌.. 11 కేసులకు నెగిటివ్‌ రిపోర్టు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ): కరోనా కట్టడికి రానున్న పది రోజులు మరింత కీలకం కావడంతో జిల్లా పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది. అటు లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు అధికంగా ఉండడం, పాజిటివ్‌ కేసులు పెరగడంపై కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన బయటకు వచ్చినవారికి రెండేళ్ల జైలుశిక్ష కూడా విధించడానికి వెనుకాడవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పక్కాగా అమలుచేయడంపై ఎక్కువ దృష్టిసారించింది. ఉదయం తొమ్మిది దాటిన తర్వాత అత్యవసర సేవలకు మినహా ఎవరిని అనుమతించకూడదని అన్ని స్థాయిల్లో పోలీసు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. అటు స్వయంగా ఏలూరు రేంజీ డిఐజీ, జిల్లా ఎస్పీ సైతం జిల్లాలో లాక్‌డౌన్‌ అమలును శుక్రవారం పరిశీలించారు.


ఇతర జిల్లాలను ఆనుకుని ఉన్న చెక్‌పోస్టులు తనిఖీ చేశారు. బయటి వారిని అనుమతించవద్దని సూచించారు. ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు నిత్యావసరాలకు బయటకు పరిమిత సంఖ్యలో జనం బయటకు రావాలని ఆదేశాలు ఉన్నా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో అనేకచోట్ల అమలవడం లేదు. ఏమాత్రం బాధ్యత లేకుండా భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా సంచరిస్తున్నారు. దీంతో శనివారం నుంచి ఆయా రద్దీ ప్రాంతాల్లో మరింత ఎక్కువమంది పోలీసులను మోహరించాలని నిర్ణయించారు. అలాగే సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు పూర్తి నిషేధం అమల్లో ఉన్నా ఆరు బయట తిరిగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో రాత్రివేళ కూడా జిల్లాలో నగరాలు, పట్టణాల్లో పోలీసు బందోబస్తును శుక్రవారం నుంచి పెంచారు. అటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, పంటకోతకు ఇబ్బందులు ఉండడంతో ఈ పనులకు గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆటంకాలు ఉండవని పోలీసుశాఖ ప్రకటించింది. కూలీలు పనులు చేయడానికి ఇబ్బందులు రావని వెల్లడించింది. అటు జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వాహనదారులపై 283 కేసులు నమోదుచేశారు. 


26 మంది ఐసోలేషన్‌కు...

శుక్రవారం జిల్లావ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలతో 26 మంది కాకినాడ జీజీహెచ్‌ ఐసోలేషన్‌కు వచ్చారు. వీరంతా కోనసీమకు చెందినవారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహానికి హాజరై వచ్చారు. దీంతో కరోనా లక్షణాలు కనిపించడంతో కాకినాడకు వీరిని తరలించారు. వీరి నుంచి శుక్రవారం రాత్రి జీజీహెచ్‌ వైద్యులు శాంపిళ్లు స్వీకరించారు. వీటికి ఫలితాలు శనివారం రానున్నాయి. కాగా శుక్రవారం 11 కేసులకు సంబంధించి నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఇందులో ఇద్దరు ఢిల్లీ సమావేశానికి వెళ్లి జిల్లాకు వచ్చినవారు. మరో ఆరుగురి ఫలితాలు శనివారం వెలువడతాయి. కాగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జీజీహెచ్‌కు రోజుకు 200 వరకు శాంపిళ్లు వస్తున్నాయి. కానీ 60 వరకు మాత్రమే వైద్యులు ల్యాబ్‌కు పంపించగలుగుతు న్నారు. మరోపక్క లండన్‌ నుంచి రాజమహేంద్రవరానికి తిరిగి వచ్చిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, గత నెల 20న పాజిటివ్‌ వచ్చింది. అయితే ఇన్ని రోజుల తర్వాత పూర్తిగా నయం కావడంతో అన్ని పరీక్షలు చేసి వైరస్‌ లేదని తేలిన తర్వాత సదరు యువకుడిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. మరోపక్క ఈ డిశ్చార్జి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, కాకినాడ ఎంపీ తదితరులంతా ఉదయం జీజీహెచ్‌కు హాజరయ్యారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి జీజీహెచ్‌కు వచ్చీరాగానే కరోనా నుంచి కోలుకున్న యువకుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అటు కనీసం భౌతిక దూరం పాటించకుండానే ప్రజాప్రతినిధులు, అధికారులు సదరు యువకుడితో కలిసి ముచ్చటించడం విశేషం.


కరోనా తొలి పాజిటివ్‌ కేసు డిశ్చార్జి

తూర్పు గోదావరి జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిన యువకుడిని జీజీహెచ్‌లో మెడికల్‌ ఐసోలేషన్‌లో అడ్మిన్‌ ఇచ్చి పూర్తిస్ధాయి చికిత్స అందించి శుక్రవారం పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ చేశామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి చెందిన ఈ యువకుడు లండన్‌లో చదువుకుంటూ ఇటీవల రాజమహేంద్రవరం వచ్చాడన్నారు. అప్పటికే కొవిడ్‌-19 వైరస్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా వచ్చిన వివరాల మేరకు ఆ యువకుడిని గుర్తించామన్నారు. కాకినాడ జీజీహెచ్‌ మెడికల్‌ ఐసోలేషన్‌కు తీసుకొచ్చి వైద్యులు పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందించిన చికిత్సతో యువకుడు పూర్తిగా కోలుకున్నాడని ఆయన తెలిపారు. చాలామంది ఈ వైరస్‌పై లేనిపోని అపోహలు, ఆందోళనలు రేకేత్తిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌ పట్ల పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. భౌతికదూ రం పాటిస్తూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు.


మంచినీళ్లు తరుచుగా తాగాలని, ఇంటి వద్దనే ఎక్కువ సేపు ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, ఊహాగానాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చేవారిని 36 మందిని గుర్తించామని చెప్పా రు. వీరిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారని, 34 మంది జిల్లాకు వచ్చారన్నారు. వీరికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. వీరికి కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందజేస్తున్నామన్నారు. మిగిలినవారిని వారి కుటుంబ సభ్యులకు 200 మందికి శ్వాబ్‌ శాంపిల్స్‌ తీశామన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాగానికి సహకరిస్తున్నారని కలెక్టర్‌ సం తృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ సజావుగా అమ ల్లో ఉందన్నారు.


నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు తిరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు అటువంటి వారిపై సెక్షన్‌ 188 ప్రకారం చర్య లు తీసుకుని 458 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాకినాడ ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వైరస్‌ నియంత్రణకు పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలకసంస్థ, మున్సిపాల్టీల సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. యు వకుడిని సురక్షితంగా ఇంటికి పంపుతున్న జీజీహెచ్‌ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరిటిండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, స్పెషలిస్టులు డాక్టర్‌ మూర్తి, డాక్టర్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T19:04:32+05:30 IST