‘కరోనా’తో కలతలెన్నో!

ABN , First Publish Date - 2020-05-20T07:18:33+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ కార్పొరేట్‌ కంపెనీల స్వల్పకాలిక ఆందోళనలపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. దీర్ఘకాల ప్రపంచ ఆర్థిక మాంద్యం...

‘కరోనా’తో కలతలెన్నో!

  • దీర్ఘకాలిక మాంద్యం, పెరగనున్న నిరుద్యోగం..  
  • వైరస్‌ పునర్‌ వ్యాప్తి, స్వీయ రక్షణ విధానాలు 
  • ప్రపంచ కార్పొరేట్‌ కంపెనీల ఆందోళనలపై డబ్ల్యూఈఎఫ్‌ అధ్యయన నివేదిక 


న్యూఢిల్లీ/జెనీవా: కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ కార్పొరేట్‌ కంపెనీల స్వల్పకాలిక ఆందోళనలపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. దీర్ఘకాల ప్రపంచ ఆర్థిక మాంద్యం.. భారీగా పెరగనున్న నిరుద్యోగ సమస్య.. వైరస్‌ పునర్‌ విజృంభణ.. వాణిజ్యపరంగా స్వీయ రక్షణ విధానాలు.. కంపెనీలను అధికంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశాలివేనని రిపోర్టు వెల్లడించింది. సమాజం, పర్యావరణం, ఆధునిక సాంకేతిక వినియోగంపై అవాంఛిత ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని డబ్ల్యూఈఎఫ్‌ హెచ్చరించింది. ప్రపంచ నాయకులు పటిష్ఠ చర్యలు చేపట్టగలిగితే పర్యావరణ పునరుద్ధరణతో పాటు మరింత హుషారైన, సమైక్య, సమ్మిళిత, సమ సమాజాలను ఏర్పాటు చేసుకోగలమని రిపోర్టు అభిప్రాయపడింది. కొవిడ్‌-19తో చిక్కులు, పొంచి ఉన్న ముప్పులకు సంబంధించి మార్ష్‌ అండ్‌ మెక్‌లెనన్‌, జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ గ్రూప్‌తో కలిసి డబ్ల్యూఈఎఫ్‌ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. 350 మంది సీనియర్‌ రిస్క్‌ ప్రొఫెషనల్స్‌ (ముప్పును ముందుగా అంచనా వేసే నిపుణులు) నుంచి అభిప్రాయాలు సేకరించింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో ప్రపంచం, వ్యాపారాలకు అధిక ఆందోళనకరమైన అంశాలకు ర్యాంకింగ్‌ ఇవ్వాలని కోరింది.  


  1. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ నాయకులు, వ్యాపారాలు, విధానకర్తలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వచ్చే ఏడాదిన్నర కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడితో పాటు సామాజిక అసంతృప్తి తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది 
  2. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా స్థిరమైన, సమసమాజ ఏర్పాటుకు అవకాశం లభించనుంది. తద్వారా ఆర్థిక సమృద్ధి శకాన్ని ఆవిష్కరించుకోవచ్చు
  3. పర్యావరణ సంక్షోభం, భౌగోళిక రాజకీయ కుదుపులు, ఆర్థిక అసమానతలు, పౌరుల్లో మానసిక ఒత్తిడి, సాంకేతిక నిర్వహణలో అంతరాలు ఆకస్మిక వ్యవస్థాగత షాక్‌లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి. లేదంటే, ఇవి సమాజం, పర్యావరణం, సాంకేతిక పాలనపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉంది 
  4. ఎకానమీలో డిజిటైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ దాడులు, డేటా చౌర్యం తదిరత మోసాల ముప్పు పెరగనుంది.

Updated Date - 2020-05-20T07:18:33+05:30 IST