గంటకు 150 మరణాలు!

ABN , First Publish Date - 2021-05-08T08:56:22+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విలయం అసాధారణ స్థాయిలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్‌లో మరణాలు నమోదవుతున్నాయి. వరుసగా పదో రోజు 3 వేల మందిపైగా మృతి చెందారు. ఈ వ్యవధిలో 36,110 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే..

గంటకు 150 మరణాలు!

దేశంలో కరోనా మృత్యు ఘంటికలు

పది రోజుల్లో 36 వేల మంది మృతి

ప్రపంచంలో భారత్‌లోనే ఈ ఉధృతి

రెండో రోజూ 4 లక్షలకు పైగా కేసులు

వైర్‌సకు మరో 3,915 మంది బలి

కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

రాజస్థాన్‌లో సోమవారం నుంచి..

యూపీలో మరో బీజేపీ ఎమ్మెల్యే మృతి


న్యూఢిల్లీ/బెంగళూరు, మే 7(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా మహమ్మారి విలయం అసాధారణ స్థాయిలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్‌లో మరణాలు నమోదవుతున్నాయి. వరుసగా పదో రోజు 3 వేల మందిపైగా మృతి చెందారు. ఈ వ్యవధిలో 36,110 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే.. గంటకు 150 మంది చొప్పున మృతి చెందారు. అమెరికా కంటే భారత్‌లో రోజువారీ మరణాలు ఐదు రెట్లు ఉంటున్నాయి. అగ్రరాజ్యంలో గురువారం 780 మంది చనిపోగా.. మనదగ్గర ఆ సంఖ్య దాదాపు 4 వేలు ఉండటం గమనార్హం. మరోవైపు వరుసగా రెండో రోజు దేశంలో 4 లక్షలపైగా కేసులు నమోదయ్యాయి. గురువారం 4,14,188 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 3,915 మంది మృతి చెందారు. క్రితం రోజుతో పోలిస్తే పాజిటివ్‌లు స్వల్పంగా పెరగ్గా.. మరణాలు తగ్గాయి. మొత్తమ్మీద వారంలో మూడోసారి నాలుగు లక్షలపైగా కేసులు నమోదయ్యాయి. 


జూ తాజా కేసుల్లో దాదాపు 50% మహారాష్ట్ర(62,194), కర్ణాటక (49,058), కేరళ(42,464), ఉత్తరప్రదేశ్‌(26,622) తమిళనాడు (24,898)లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 853 మం ది చనిపోగా ఉత్తరప్రదేశ్‌(350) తర్వాతి స్థానంలో ఉంది. ఢిల్లీలో కేసు లు 20 వేల దిగువకు వచ్చినా మరణాలు 300కు తగ్గడం లేదు. మొ త్తం 13 రాష్ట్రాల్లో వందకు మించి మరణాలుంటున్నాయి. రాజస్థాన్‌ (161), హరియాణ(177), పంజాబ్‌(154), ఉత్తరాఖండ్‌(151), జా ర్ఖండ్‌(133), బెంగాల్‌(117)లో ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. 


కర్ణాటకలో 10 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ 

కొవిడ్‌ నియంత్రణకు మరో మార్గం లేదని తీర్మానించిన కర్ణాటక  ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది.  సీఎం యడియూరప్ప శుక్రవారం వైద్య నిపుణులు, కేబినెట్‌ మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ వరకు సంపూ ర్ణ లాక్‌డౌన్‌ అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వైద్య ఆరోగ్యం, పోలీసులు, జైళ్లశాఖతోపాటు అత్యవసర, రెవెన్యూ విభాగాలు మాత్ర మే పనిచేస్తాయన్నారు. నిత్యావసరాలు, పాలు కొనుగోళ్లకు ఉదయం 6 నుంచి 10 వరకు వెసులుబాటు ఉంటుందన్నారు.  వివాహాలకు 50 మందికి అనుమతి ఉంటుందన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం సోమవారం నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. కేరళలో శనివారం నుంచి లాక్‌డౌన్‌ అమలు కానుంది.


ఈ నేపథ్యంలో ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయం సహా తమ పరిధిలోని 1,200 దేవస్థానాలను మూసివేయనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. గోవాలో ఆదివారం నుంచి 15 రోజులు కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు సీఎం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని సాలోన్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే దాల్‌ బహదూర్‌ కోరి (64) కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. యూపీలో కరోనాతో రెండు వారాల్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మృతి చెందడం గమనార్హం.


తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు: కేంద్రం

దేశంలోని 24 రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు 15పైగా ఉందని.. 9 రాష్ట్రాల్లో 5 నుంచి 15 మధ్య ఉందని కేంద్రం తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్‌, బిహార్‌, హరియాణ, ఒడిషా, ఉత్తరాఖండ్‌లో పాజిటివ్‌లు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా శుక్రవారం వెల్లడించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు మించి యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు 50 వేలు-లక్ష మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల్లో 8 రాష్ట్రాలకు 10.25 లక్షల టీకాలు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు లేవు. గురువారం ఉదయం వరకు దేశంలో 17.35 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.


వృథాతో కలిపి వీటిలో 16.44 కోట్ల డోసులను రాష్ట్రాలు వినియోగించినట్లు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 90.30 లక్షల టీకాలు ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో 3.84 లక్షల డోసులున్నట్లు వెల్లడించింది. ఏపీకి ఇప్పటివరకు 72,96,280 టీకాలు ఇవ్వగా, 70,70,226 డోసులను వినియోగించారని స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-08T08:56:22+05:30 IST