Abn logo
May 27 2020 @ 04:42AM

కేటీపీఎస్‌ బదిలీ కార్మికుల్లో కరోనా భయం

 వైటీపీఎస్‌కు వెళ్లేందుకు విముఖత

 ఏడో దశలోనే నింపాలని వేడుకోలు


కేటీపీఎస్‌(పాల్వంచ), మే 26: కరోనా భయం నేపధ్యంలో ఎక్కడో యాదాద్రి జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (వైటీపీఎస్‌)కు వెళ్లేదిలేదని ఇటీవల కేటీపీఎస్‌నుంచి బదిలీ అయిన కార్మికులు తేల్చి చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా కనీసం నివాస సముదాయం లేని ప్రదేశంలో తాము ఎలా ఉండాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 31తో కేటీపీఎస్‌ పాతప్లాంటు మూసివేస్తున్న నేపధ్యంలో పాల్వంచలోని కేటీపీఎస్‌ నుంచి ఇటీవల టీఎస్‌ జెన్‌కో బారీ బదిలీలు చేపట్టింది. వైటీపీఎస్‌కే 130మంది మొదటి గ్రేడ్‌ ఫోర్‌మెన్‌లు, 29మంది రెండో గ్రేడ్‌ ఫోర్‌మెన్‌లు, 33మంది నాలుగో గ్రేడ్‌ ఫోర్‌మెన్‌లు, 65మంది ప్లాంట్‌ అటెండెంట్‌(పీఏ), 160మంది జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ (జేపీఏ)లు మొత్తం 417మందిని బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా దామరచర్లలో ఒక్కోటి 800మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో 201లో వైటీపీఎస్‌కు శంకుస్థాపన చేశారు.


అయితే అక్కడ ఇంకా ఒక్కయూనిట్‌ కూడా నిర్మాణం పూర్తిచేసుకోలేదు. స్థానిక పరిస్థితుల నేపధ్యంలో యూనిట్ల ఏర్పాటుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేటీపీఎస్‌ బదిలీ కార్మికులు అక్కడకు వెళ్లటానికి ససేమిరా అంటున్నారు. తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు అక్కడ విధులు నిర్వర్లించటంతో వైరస్‌ సోకవచ్చనే ఆందోళనలో కార్మికులు ఉన్నారు. దాంతో అధికారులు తమను కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోనే ఉంచాలనే డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే 1535 జాతీయ అధ్యక్షుడు ఎంఎ వజీర్‌, టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చారుగండ్ల రమేష్‌లు జెన్‌కో సీఎండీకి బదిలీల నిలుపుదలపై లేఖలు ఇచ్చిన నేపధ్యంలో రెండు నెలల పాటు వాయిదా వేసిన అధికారులు మరోసారి బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

Advertisement
Advertisement