May 17 2021 @ 01:21AM

కరోనా ఫస్ట్‌ వేవ్‌ నథింగ్‌

‘‘ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులతో పోలిస్తే... కరోనా ఫస్ట్‌ వేవ్‌ నథింగ్‌’’ అని హీరోయిన్‌ తమన్నా అన్నారు. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా బారిన పడిన తారల్లో ఆమె ఒకరు. హైదరాబాద్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ చేస్తున్న సమయంలో లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. కొవిడ్‌ అనుభవం గురించి తమన్నా మాట్లాడుతూ ‘‘సాధారణంగా నా వయసు ఉన్న వారు ఆస్పత్రిలో చేరడం అరుదు. ఆస్పత్రికి వెళ్లే ముందు రోజు వరకూ చిత్రీకరణ చేశా. నా విషయంలో అన్నీ స్పీడుగా జరిగాయి. కొంతమంది వైరస్‌ లక్షణాలు కనిపించినా... చాలా లైట్‌ తీసుకుంటారు. అటువంటి వాళ్లను చూస్తే, భయం వేస్తుంది. నేనెలా కాదు... వెంటనే స్పందించి చికిత్స తీసుకున్నా. అసలు, ప్రస్తుతానికి వస్తే... కుటుంబాలకు కుటుంబాలు తుడిచి పెట్టుకుపోతున్నాయి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి బయటకు వెళ్లకుండా... ఇంట్లోనే ఉండే అవకాశం ఉన్నవాళ్లందరూ ఆ పని చేయండి’’ అని చెప్పారు.