రైనా అవుట్‌

ABN , First Publish Date - 2020-08-30T09:58:45+05:30 IST

ఐపీఎల్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టిన మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. శుక్రవారం జట్టులో ఓ

రైనా అవుట్‌

అర్ధంతరంగా ఇంటికి 

ఐపీఎల్‌లో  కరోనా కల్లోలం

చెన్నై జట్టులో మరో ఆటగాడికి పాజిటివ్‌


దుబాయ్‌: ఐపీఎల్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టిన మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. శుక్రవారం జట్టులో ఓ పేసర్‌ సహా 13 మంది కరోనా పాజిటివ్‌గా తేలగా.. శనివారం ఆ సీఎస్‌కేపై మరో గట్టి దెబ్బ పడింది. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సురేశ్‌ రైనా హఠాత్తుగా ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ వెల్లడించాడు. ‘వ్యక్తిగత కారణాలతో రైనా యూఏఈ నుంచి భారత్‌కు వెళ్లాడు. ఇక అతడు ఐపీఎల్‌కు దూరమైనట్టే. ఈ కష్టకాలంలో అతడికి, కుటుంబానికి సీఎస్‌కే మద్దతుగా ఉంటుంది’ అని జట్టు అధికారిక ట్విటర్‌ పేజీలో విశ్వనాథన్‌ పోస్ట్‌ చేశాడు. శనివారం ఉదయమే రైనా భారత్‌కు తిరిగి వచ్చాడు. ఈనెల 15నే ధోనీతో పాటు రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

రుతురాజ్‌కు కరోనా

సీఎ్‌సకే జట్టులో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో బ్యాట్స్‌మన్‌ ఈ వైరస్‌ బారినపడ్డాడు. శుక్రవారం పేసర్‌ (దీపక్‌ చాహర్‌) పాజిటివ్‌గా తేలగా.. శనివారం వెల్లడించిన ఫలితాల్లో మహారాష్ట్రకు చెందిన యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నట్టు సమాచారం. దేశవాళీల్లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. అయితే అతడి పేరును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో మొత్తం చెన్నై టీమ్‌లోనే 13 మంది కరోనా బారిన పడినట్టు తేలింది. వీరిని ఐపీఎల్‌ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తెలిపింది. 

ఆందోళనలో ఆటగాళ్లు..

సీఎ్‌సకేలో పలువురు పాజిటివ్‌గా తేలడం ఆ జట్టు ఆటగాళ్లను ఆందోళనలో పడేసింది. ‘మేమైతే షాక్‌లో ఉన్నాం.  భయం కూడా వేస్తోంది. బీసీసీఐ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మా జట్టును కరోనా వీడడం లేదు’ అని జట్టు సభ్యుడు తెలిపాడు.

శిబిరమే కొంప ముంచిందా..?

అన్ని జట్లు యూఏఈకి రాకముందు ఒక్క సీఎ్‌సకే మాత్రం చెన్నైలో ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో శిబిరం నిర్వహించింది. ఇది కెప్టెన్‌ ధోనీ ఒత్తిడి మేరకే జరిగిందని ఇప్పటికే సీఈవో కాశీ విశ్వనాథన్‌ ప్రకటించాడు. ఇప్పుడు జట్టులో కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో అంతా ఆ శిబిరంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్యాంపు చెపాక్‌ స్టేడియంలో జరగగా, దీని పక్కనే ఎక్కువ కేసులు నమోదైన ట్రిప్లికేన్‌ ఏరియా ఉంది. ప్రస్తుతం అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండోస్థానంలో ఉంది. కాబట్టి ఈ క్యాంపు ప్రభావం చూపిందేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అప్పట్లోనే బోర్డు అధికారులు సీఎ్‌సకేకు శిబిరం అనవసరమని చెప్పినట్టు సమాచారం.

సీఎ్‌సకేను హెచ్చరించండి..

చెన్నై జట్టులో కరోనా కేసులతో ఇతర ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో ఆ జట్టు శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు నిబంధనలను కూడా పలువురు ఆటగాళ్లు బేఖాతరు చేశారని ఆరోపిస్తున్నాయు. ఈనేపథ్యంలో వారిని గట్టిగా హెచ్చరించాలని బీసీసీఐని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. అన్ని జట్లు కూడా మాస్కులు, భౌతిక దూరాన్ని పాటిస్తే సీఎ్‌సకే సభ్యులు ఇవేమీ లేకుండానే స్వేచ్ఛగా తిరిగారని చెబుతున్నాయి. దీనికితోడు రెండు వారాల క్రితం చాహర్‌ సోదరుల మధ్య ట్వీట్స్‌ కూడా వైరల్‌ అవుతోంది. మాస్కులు, భౌతిక దూరం ఎందుకు పాటించడం లేదని రాహుల్‌ చాహర్‌ అడిగితే.. అందరం రెండుసార్లు నెగెటివ్‌గా తేలాం.. ఇక మాస్కులెందుకు అని దీపక్‌ సమాధానమిచ్చాడు.


కరోనానే కారణమా..?

చెన్నై జట్టులో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడం రైనాను భయాందోళనకు గురిచేసినట్టు సమాచారం. రెండు రోజుల్లోనే కేసుల సంఖ్య 13కు చేరడంతో అతను  తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడట. ‘శుక్రవారం రాత్రి ఈ విషయమై కోచ్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోనీతోపాటు సహచర ఆటగాళ్లకు రైనా పదే పదే కాల్‌ చేస్తూ తన భయాన్ని వ్యక్తం చేశాడు. అతడిని సముదాయించేందుకు ధోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మానసికంగా అతను ఇబ్బందిపడుతున్నాడు. ఈ పరిస్థితిలో  అతడిని ఇక్కడే ఉంచడం అనవసరం అనిపించింది’ అని జట్టు ప్రతినిధి తెలిపాడు. ఇదిలావుండగా అతడి బాబాయ్‌ను ఎవరో హత్య చేశారని, అందుకే రైనా భారత్‌కు వచ్చినట్టు కూడా కథనాలు వినిపించాయి.

Updated Date - 2020-08-30T09:58:45+05:30 IST