కార్మిక చట్టాలకూ కరోనా!

ABN , First Publish Date - 2020-05-12T06:08:04+05:30 IST

కరోనా సంక్షోభాన్ని అడ్డంపెట్టుకొని కొన్ని రాష్ట్రాలు కార్మికచట్టాలను కాలరాసేందుకు సిద్ధపడుతున్నాయి. చుట్టుముట్టిన వైరస్, అది సృష్టించిన ఆర్థిక సంక్షోభానికి తోడుగా, ఇకపై ఏ రక్షణలూ లేని స్థితిలో కార్మికులు పనిచేయాల్సిన దుస్థితిని పాలకులు కల్పిస్తున్నారు...

కార్మిక చట్టాలకూ కరోనా!

కరోనా సంక్షోభాన్ని అడ్డంపెట్టుకొని కొన్ని రాష్ట్రాలు కార్మికచట్టాలను కాలరాసేందుకు సిద్ధపడుతున్నాయి. చుట్టుముట్టిన వైరస్, అది సృష్టించిన ఆర్థిక సంక్షోభానికి తోడుగా, ఇకపై ఏ రక్షణలూ లేని స్థితిలో కార్మికులు పనిచేయాల్సిన దుస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వరుసపెట్టి కార్మికచట్టాలను నిర్వీర్యం చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. కరోనా దెబ్బకు చైనానుంచి పారిపోతున్న కంపెనీలన్నింటికీ మనం రెడ్ కార్పెట్ పరవాలన్న మోదీ మాటల్లో అంతరార్థాన్ని ఈ రాష్ట్రాల పాలకులు గ్రహించినట్టు ఉంది. దేశీయ కార్మిక చట్టాలన్నింటినీ రద్దుచేసి, చైనా ప్రత్యేకార్థికమండళ్ళలో కార్మికులు చేస్తున్న వెట్టికంటే అధికంగా ఇక్కడి పరిశ్రమల్లో  కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. కార్మికచట్టాల్లో రాష్ట్రాలు చేపట్టిన ఈ సవరణలను కేంద్రం ఆమోదించకూడదని కార్మిక సంఘాలు కోరుతున్నప్పటికీ, అందివచ్చిన ఈ అవకాశాన్ని అది మాత్రం ఎందుకు వదులుకుంటుంది?


ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో, పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ పరిశ్రమలు వేగంగా కోలుకోవడం లక్ష్యంగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు అతిముఖ్యమైన కార్మికచట్టాలనుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులను ప్రకటించాయి. తాత్కాలికమంటూనే కీలకచట్టాలనుంచి మూడేళ్ళకు పైబడి మినహాయింపులు ప్రకటించిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తొలగించడంలో యాజమాన్యాలకు నిరంకుశమైన అధికారాలు దఖలుపరిచాయి. వారితో 8గంటలే పనిచేయించాలన్న గత నిబంధనల స్థానంలో ఏకంగా పన్నెండుగంటలు చాకిరీ చేయించుకొనేందుకు అనుమతించాయి. తనిఖీలను మరింత కుదించి, నామమాత్రం చేయడం ద్వారా మిగిలిన ఆ నాలుగు చట్టాలు సవ్యంగా అమలు జరుగుతున్నదీ లేనిదీ కూడా పట్టించుకోబోమని తేల్చేశాయి. కార్మికుల వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు నిర్ణయించడంలోనూ, కత్తెరవేయడంలోనూ యాజమాన్యాలకు పూర్తిస్వేచ్ఛ దఖలుపడుతున్నది. ఉన్న పరిశ్రమలతో పాటు రానున్న పరిశ్రమలకు కూడా వర్తించబోయే ఈ వెసులుబాట్లు తాము ఎంతో కాలంగా కోరుతున్నవీ, ఎదురుచూస్తున్నవేనని పరిశ్రమల సంఘాలు సంతోషిస్తున్నాయి. ఈ దేశంలోకి  ఇంతకాలమూ పెట్టుబడులు ప్రవహించకపోవడానికి ఈ బలమైన కార్మికచట్టాలే అడ్డుపడినట్టు, ఇకపై పరిశ్రమలకు, వ్యాపారాలకు ఎన్నడూ లేనంత ఉత్తేజం రాబోతున్నట్టు అవి మాట్లాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒకే ఆర్డినెన్సుతో 38 కార్మికచట్టాల్లో మూడు మాత్రమే అమలులో ఉంచి, మిగతావన్నింటినీ మూడేళ్ళపాటు రద్దుచేసింది. పారిశ్రామిక వివాదాలు, ట్రేడ్ యూనియన్, కాంట్రాక్టు ఉద్యోగాలతో వ్యవహరించే చట్టాలన్నీ రాష్ట్రం కత్తెరవేసినవాటిలో ఉన్నాయి. కార్మికులకు నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించి, పనిప్రదేశాల్లో వారి ఆరోగ్యాన్ని కాపాడాలనీ, భద్రత చూడాలని నిర్దేశిస్తున్న చట్టాలు మధ్యప్రదేశ్ లో మాయమైనాయి. కొత్తగా పరిశ్రమలు పెట్టబోయేవారు కార్మికుల జీవితాలతో చిత్తంవచ్చినట్టు ఆడుకొనే రీతిలో గుజరాత్ ప్రభుత్వం చాలా సవరణలు చేసింది. పారిశ్రామిక వివాదాలు, కార్మిక ఒప్పందాల చట్టం వంటివి తొలగిపోవడంతో ఇకపై యాజమాన్యాలు వందమంది ఉద్యోగులను కూడా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే దెబ్బతో తీసిపారేయవచ్చు.


సుదీర్ఘ పోరాటాలతో కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకొని పాలకులు హరించివేస్తున్నారు. కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడవేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికచట్టాలను నిర్వీర్యం చేసే ప్రక్రియ శరవేగంతో సాగుతున్నది. బహుళజాతి కంపెనీలు సైతం మనదేశానికి వచ్చేసరికి చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న విషయాన్ని విశాఖ విషవాయు ఘటన తాజాగా తెలియచెప్పింది. పరిశ్రమలు మూతబడి, కోట్లాదిమంది కార్మికులు పొట్టచేతబట్టుకొని స్వగ్రామాలకు తరలిపోతున్న స్థితిలో, వారిని ఆదుకోవడం చేతకాని పాలకులు ఇప్పుడు చైనాను చూసి వాతపెట్టుకొనే క్రమంలో కార్మికులకు ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నారు. వారికి తాగునీరు, గాలి, వెలుతురు, క్యాంటీన్లు, ప్రథమచికిత్స ఇత్యాది అవసరాలు కూడా తీర్చనక్కరలేదంటూ పరిశ్రమల యాజమాన్యాలకు చెప్పడం కంటే అమానుషం ఇంకేమైనా ఉంటుందా? కరోనాతో సహజీవనం తప్పదన్న వాదనతో, పరిశ్రమలను వేగంగా తెరిపించేందుకు సిద్ధపడుతున్న పాలకులు ఇకపై కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడమే కాదు, వారిని రోగం నుంచి రక్షించేందుకు కూడా సిద్ధంగా లేరని ఈ చట్టసవరణలు తెలియచెబుతున్నాయి.

Updated Date - 2020-05-12T06:08:04+05:30 IST