‘ఉస్మానియా’లో కలవరం

ABN , First Publish Date - 2020-06-03T11:26:46+05:30 IST

ఉస్మానియా మెడికల్‌ కళాశాల పీజీ విద్యార్థులను కరోనా భయం వెంటాడుతోంది. ఆది వారం నుంచి మంగళవారం వరకు

‘ఉస్మానియా’లో కలవరం

పీజీ విద్యార్థులకు కరోనా

ఇప్పటి వరకు 12 మందికి వైరస్‌

ఒకరి నుంచి మరొకరికి మహమ్మారి

సౌకర్యాల లేమిపై ఆందోళన

అలాంటిదేమీ లేదంటున్న అధికారులు


మంగళ్‌హాట్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా మెడికల్‌ కళాశాల పీజీ విద్యార్థులను కరోనా భయం వెంటాడుతోంది. ఆది వారం నుంచి మంగళవారం వరకు పన్నెండు మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాలలోని 286 మంది వైద్య విద్యార్థులు పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తుంటారు. పీజీ విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడడంతో కొన్ని రోజులుగా వారు చదువుకునేందుకు లైబ్రరీకి వెళ్తున్నారు. కరోనా సోకిన ఓ విద్యార్థి వారం క్రితం తోటి విద్యార్థులతో కలిసి లైబ్రరీకి వెళ్లినట్లు సమాచారం. పేట్లబురుజు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి అతను రూమ్మేట్‌ కావడంతో ఇద్దరికీ ఒకే రోజు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మరుసటిరోజు ముగ్గురికి, తర్వాత ఏడుగురికి కరోనా సోకింది. మొత్తంగా 12 మంది పీజీ వైద్య విద్యార్థులతో పాటు ఓ విద్యార్థి తమ్ముడికీ కరోనా సోకడంతో వారిని గాంధీకి తరలించారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న పీజీ విద్యార్థి ఓపీలో ఉన్న సమయంలో ఆమెకు వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆమె మెడికల్‌ కళాశాలలో నలుగురితో కలిసుంటోంది. ఆమె ద్వారా  వైరస్‌ వ్యాప్తిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. 


సౌకర్యాలేవీ.. 

ఉస్మానియా మెడికల్‌ కళాశాల విద్యార్థులు పేట్లబురుజు, ఉస్మానియా, నిలోఫర్‌, ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్‌ తదితర ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తుంటారు. వారికి కరోనా నుంచి రక్షణ పొందేందుకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో వైరస్‌ బారిన పడుతున్నట్లు  ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లోని ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉంటున్నారు. ఒకరికి వైరస్‌ సోకితే గదిలో ఉండేవారికీ సోకుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 


ఓపీ వైద్య సేవలతోనే ముప్పు..

అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్క ఉస్మానియా ఆస్పత్రిలో రోజుకు 1,500 నుంచి 1,600 మంది ఓపీ చికిత్సల కోసం వస్తుంటారు. వారికి వైద్య విద్యార్థులు, వైద్యులు గ్లౌజులు, మాస్క్‌లు ధరించి చికిత్సలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా కరో నా ఉంటే వారి ద్వారా వైరస్‌ బారిన పడుతున్న ట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించిన వాటికి మాత్రమే ప్రభుత్వం నాణ్యమైన పీపీఈ కిట్లు అందజేసిందని, మిగిలిన ఆస్పత్రులకు నామమాత్రంగానే పీపీఈ కిట్లు సరఫరా చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 


అసలు ఎంత మంది...?

‘ఉస్మానియా’ పీజీ విద్యార్థులకు పాజిటివ్‌ సంఖ్య మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆది, సోమవారాల్లో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మరో ఏడుగురికి వచ్చినట్లు అధికారికంగా చెప్పారు. అయితే, మెడికల్‌ కాలేజీలో పాజిటివ్‌ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పది మంది విద్యార్థులు మంగళవారం ఒక్కరోజే గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. దీనిపై అధికారులు ఎవరూ స్పందించడం లేదు. వాట్సాప్‌ గ్రూపుల్లోనూ విద్యార్థుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, అవన్నీ వాస్తవాలు కాదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 


వంద మంది రిపోర్టులు రావాల్సి ఉంది

ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో చదువుతున్న 12 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం మొత్తం 96 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్‌గా తేలింది. మరో 100 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 40 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. 

- ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళా రెడ్డి


పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి 

ఉస్మానియా ఆస్పత్రిలో 13 వేలకు పైగా పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అనుమతించిన కంపెనీల నుంచి తెప్పించిన కిట్లు కావడంతో అవసరమైన వారికి ఇస్తున్నాం. ఎన్‌- 95 మాస్కులు సైతం ఎప్పటి కప్పుడు అందిస్తున్నాం. 

- ‘ఉస్మానియా’ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌


ఓపీ పెరిగింది...

ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ పెరిగింది. లక్షణాలు కనిపించని వారికి కూడా చికిత్సలు అందిస్తున్నాం. సాధారణ ఓపీలో   ఎవరు కరోనా పాజిటివ్‌, ఎవరు కాదో తెలియ ని పరిస్థితి. ఇలాంటి సమయంలో తోటి విద్యార్థులకు వైరస్‌ సోకుతోంది. మెరుగైన మాస్కు లు, కిట్లు అందించాల్సిన అవసరం ఉంది. 

- డాక్టర్‌ నరేష్‌, సలహాదారు, తెలంగాణ జూనియర్‌ వైద్య విద్యార్థుల సంఘం

Updated Date - 2020-06-03T11:26:46+05:30 IST