కరోనాపై జీవీఎంసీ యుద్ధం

ABN , First Publish Date - 2020-04-03T11:30:34+05:30 IST

ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి నగరంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వైరస్‌ను మొ

కరోనాపై జీవీఎంసీ యుద్ధం

  • 30 టన్నులు బ్లీచింగ్‌
  • 20 మెట్రిక్‌ టన్నుల సోడియం హైపోక్లోరైడ్‌
  • రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఫైర్‌ ఇంజన్లతో పిచికారి
  • పారిశుధ్య కార్మికులు విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు
  • ప్రజలకు అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు
  • ఐసోలేషన్‌లో ఉన్నవారి ఇళ్లకు మ్యాపింగ్‌

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం) ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి నగరంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వైరస్‌ను మొగ్గదశలోనే తుంచేందుకు వీలుగా కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రద్దీప్రాంతాలు, పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలతోపాటు విదేశాలకు వెళ్లివచ్చినవారి నివాసాలు, వారి బంధువులు, స్నేహితులకు సంబంధించిన గృహాలు ఉన్న ప్రాంతాలను హైరిస్క్‌జోన్‌లుగా గుర్తించి వైరస్‌ ఉంటే నశించిపోయేలా కార్యక్రమాలు ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఫైర్‌ ఇంజన్లతో సోడియం హైపోక్లోరోక్విన్‌ ద్రావణాన్ని పిచికారి చేయడం ద్వారా కరోనాపై యుద్దంలో తమ దోరణి ఎలా ఉండబోతోందనే ది స్పష్టం చేసినట్టయింది. 


   జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికం కకావడంతో జిల్లాయంత్రాంగంతోపాటు జీవీఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకూ వైరస్‌ బారినపడివారంతా విదేశాలకు వెళ్లివచ్చినవారు, వారి కుటుంబసభ్యులే కావడంతో వారినుంచి ఇతరులకు వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన కమిషనర్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నగర పరిధిలో నివాసముంటున్నవారిలో 2,200 మంది ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లివచ్చినట్టు గుర్తించారు. వారందరిని స్వీయగృహనిర్బంధంలో ఉండాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేయడంతోపాటు వారి ఇళ్లకు ఇతరులు వెళ్లవద్దని తెలిసేలా స్టిక్కర్లు అతికించారు. వారి ఇళ్లను స్థానిక అధికారులు నిత్యం పర్యవేక్షించేందుకు వీలుగా పదేసి ఇళ్లు చొప్పున మ్యాపింగ్‌ చేశారు. అలాగే నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం ప్రజలకు తెలిసేలా ఎఫ్‌ఎం రేడియో, స్థానిక టీవీ ఛానళ్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వైరస్‌ ఉంటే నశించిపోవడం, మురికివాడల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్లీచింగ్‌ జల్లాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికే 30 మెట్రిక్‌ టన్నుల బ్లీచింగ్‌ పౌడర్‌ను తెప్పించి జోన్‌లవారీగా పంపిణీ చేశారు. అలాగే సోడియం హైపోక్లోఉరోక్విన్‌ రసాయనం కూడా 20మెట్రిక్‌ టన్నులు తెప్పించారు. 


రాష్ట్రంలోనే మొదటిసారి ఫైర్‌ ఇంజన్లతో పిచికారీ:

నగరంలోని చేపలమార్కెట్లు, ఇతర మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, హైరిస్క్‌గా గుర్తించిన ప్రాంతాల్లో వైరస్‌ ఉంటే నశించిపోయేలా సోడియం హైపోక్లోరోక్విన్‌ రసాయనాన్ని రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఫైర్‌ఇంజన్లతో పిచికారీ చేయడం ప్రారంభించారు. తర్వాత నగరంలోని అన్నిప్రాంతాల్లోనూ పిచికారీ చేస్తారు. అలాగే పారిశుధ్య విధులు నిర్వర్తించే సిబ్బంది వైరస్‌ భారినపడకుండా ఉండేందుకు వీలుగా అవసరమైన హ్యాండ్‌ శానిటైజర్‌, గ్లౌజ్‌లు, మాస్క్‌లను తతెప్పించి అందజేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది విధులకు హాజరవడం ఇబ్బందిగా మారడంతో వారికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేశారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చేస్తుండడంతో వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున ఫోన్‌లో ఆర్డరు ఇస్తే ఇంటికే ఆయా సరుకులు అందజేసేలా రిలయెన్స్‌, హెరిటేజ్‌, మోర్‌, బిగ్‌బాస్కెట్‌ వంటి సంస్థలతో చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో పనిచేసి కరోనా నుంచి నగరానికి ఉపసమనం కలిగించేందుకు కృషి చేస్తామని అదనపు కమిషనర్‌ వి.సన్యాసిరావు తెలిపారు.

Updated Date - 2020-04-03T11:30:34+05:30 IST