కరోనా హాట్‌స్పాట్‌ విశాఖ

ABN , First Publish Date - 2020-04-05T09:32:41+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ముప్పు వున్న..

కరోనా హాట్‌స్పాట్‌ విశాఖ

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన

కేసులు పెరుగుతుండడమే కారణం

తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు

‘పాజిటివ్‌’ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో వైరస్‌ కట్టడికి చర్యలు

మూడు కిలోమీటర్లు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటన

ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డుల్లో 200 మంది

మరోవైపు జిల్లాలో వైద్యులు, సిబ్బందికి అందుబాటులో లేని మాస్క్‌లు, పీపీఈలు

నోరు మెదపని జిల్లా యంత్రాంగం


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ముప్పు వున్న ప్రాంతాల జాబితాలో విశాఖపట్నం చేరింది. జిల్లాను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రంగా గుర్తించింది. దేశంలో ఇప్పటికే 20 హాట్‌స్పాట్‌లను గుర్తించగా, తాజాగా సవరించిన జాబితాలో విశాఖను కూడా చేర్చింది. ఇక్కడ పెరుగుతున్న కరోనా కేసులే అందుకు ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


విశాఖ జిల్లాలో శనివారం నాటికి మొత్తం 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు పలువురు హాజరై వుండడం, వారిలో పలువురికి పాజిటివ్‌ రావడం, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కూడా సోకడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇది సామాజిక వ్యాప్తి దశకు చేరకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక అధికారులు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి పలు చర్యలు తీసుకుంటున్నారు.


ఆయాచోట్లకు కొత్తవారు వెళ్లకుండా నిరోధిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని విస్తృతంగా పిచికారీ చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి, ఇంటింటికీ ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలను పంపించి, వ్యాధి లక్షణాలు ఎవరికైనా వున్నాయోమేనని సర్వే చేయిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని వెంటనే క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఎవరికైనా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలోషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 78 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి, వాటిలో 5,010 పడకలు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో రైల్వే ఆస్పత్రి, గాజువాక వికాస్‌ కాలేజీ, భీమిలి, ఎలమంచిలి, నర్సీపట్నం ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాలలో 138 మందిని చేర్చారు. వీరికి అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చి, 14 రోజుల వరకు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు.


ఐసోలేషన్‌లో 200 మంది 

విశాఖపట్నంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో 200 మంది ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉన్నారు. ఛాతీ ఆస్పత్రిలో 122 మంది, ఈఎన్‌టీ ఆస్పత్రిలో 64 మంది, గీతం ఆస్పత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నంలో మొత్తం 25 ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి, అందులో 4,434 పడకలు సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు 472 మందిని ఐసోలేషన్‌లో వుంచగా, నెగెటివ్‌ రిపోర్టులు రావడం, వ్యాధి లక్షణాలు లేకపోవడంతో 272 మందిని డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేశారు. 


పరికరాల కోసం వెంపర్లాట

విశాఖపట్నంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా... బాధితులకు చికిత్స చేసే వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి అవసరమైనన్ని పరికరాలు అందుబాటులో లేవు. ఎన్‌-95 మాస్క్‌లు, పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ)తో పాటు శానిటైజర్లు, గ్లౌజులు, మందులు అవసరమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి సరఫరా అతి తక్కువగా వుండడంతో వారు వాటి కోసం సేవా సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అయితే జిల్లా అధికారులు ఈ విషయాలన్నీ దాచిపెట్టి అన్నీ వున్నాయని అవాస్తవాలు చెబుతున్నారు. వారం రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని విశాఖపట్నంలో కోవిడ్‌-19పై సమీక్ష సమావేశం నిర్వహించి, విశాఖకు కరోనా నివారణకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు ఏమిటో తనకు నివేదిక ఇస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడి, వాటిని మంజూరు చేయిస్తానని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు చెప్పారు.


వారం దాటిపోయినా...దానిపై అధికారులు ఎవరూ నోరు విప్పడం లేదు. ఇక్కడి నుంచి ఏమి కోరుతూ నివేదిక పంపారు? అక్కడి నుంచి ఏమి వచ్చాయి? వాటిని ఎవరికి, ఎక్కడ ఎన్నెన్ని చొప్పున పంపిణీ చేశారో తెలియడం లేదు. వైద్య వర్గాల నుంచి సరైన రక్షణ పరికరాలు లేవని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు తమకు సాధారణ మాస్కులే ఇస్తున్నారని, శానిటైజర్లు లేవని వాపోతున్నారు. పారిశుధ్య పనుల్లో పాల్గొంటున్న జీవీఎంసీ సిబ్బందికి కూడా మాస్క్‌లు అందడం లేదని చెబుతున్నారు. మరోపక్క ప్రభుత్వం సరఫరా చేసిన మాస్క్‌లు, ఇతర పరికరాలను కొంతమంది బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారని సమాచారం. ఆన్‌లైన్‌ పేమెంట్లను, కార్డ్‌ పేమెంట్లను అంగీకరించడం లేదు. నగదు ఇచ్చిన వారికే వాటిని సరఫరా చేస్తున్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం ఈ అంశంపై దృష్టిసారించాల్సి ఉంది. కచ్చితంగా అవసరమైనవి ఏమిటో వెల్లడిస్తే ప్రభుత్వం సమకూరుస్తుంది. 

Updated Date - 2020-04-05T09:32:41+05:30 IST