కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈ కాలనీ ఆదర్శం..

ABN , First Publish Date - 2020-03-24T16:18:02+05:30 IST

కరోనా నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటూ..

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈ కాలనీ ఆదర్శం..

కరోనా నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటూ.. ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని భోలక్‌పూర్‌ డివిజన్‌ పద్మశాలి కాలనీ వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు.


హైదరాబాద్/ముషీరాబాద్‌: పద్మశాలి కాలనీలో 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపు రెండు వేల జనాభా ఉంటుంది. కరోనా వైరస్‌ చైనాలో బయటపడిన నాటి నుంచి కాలనీవాసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పది రోజుల క్రితం కాలనీవాసులు మాస్క్‌లను ఇంటింటికీ పంపిణీ చేశారు. హోమియోపతి మందులను అందజేశారు. వైరస్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను ముద్రించి అందరికీ అందించారు.


ఇళ్లల్లో పాచిపని చేసే వారికి పరిశుభ్రత పాటించేందుకు ఇంట్లోకి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడానికి సబ్బులను ఉచితంగా అందజేశారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే కార్మికులకు చెత్త డబ్బాలు కాకుండా ప్రత్యేక కవర్లను జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అందజేశారు. డబ్బాలతో తీసుకెళ్తే వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయంతో కవర్ల ద్వారా చెత్తను సేకరించడానికి ఏర్పాట్లు చేశారు. కాలనీవాసులు శుభకార్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. అంతే కాకుండా కాలనీవాసులు ఎవరూ ఎలాంటి కార్యక్రమాలకూ వెళ్లకూడదని తీర్మానించుకున్నారు. 


కరోనాను తరిమి కొట్టడమే లక్ష్యం 

మహమ్మారిని మా కాలనీ దరి చేరకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై స్థానికులకు పూర్తి అవగాహన కలిగించాం. పరిశుభ్రత ద్వారానే వ్యాధిని నివారించవచ్చు. మేం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. - సుందర్‌పటాలే, పద్మశాలి కాలనీ అధ్యక్షుడు.


ఇంటింటికీ ప్రచారం చేస్తున్నాం 

వైరస్‌ నివారణకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలకు కరపత్రాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో పంపిణీ చేశాం. ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు సబ్బులు, మాస్క్‌లు అందజేశాం. శుభకార్యాలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టాం. - ఆర్‌.ఆంజనేయులు, పద్మశాలి కాలనీ ప్రధాన కార్యదర్శి


నిర్ణయం భేష్‌ 

కరోనా నివారణకు పద్మశాలీకాలనీ చేపట్టిన కార్యక్రమాలు భేష్‌. కాలనీవాసులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. ఇళ్లల్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు వైరస్‌ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - అమూల్య, గృహిణి.

Updated Date - 2020-03-24T16:18:02+05:30 IST