రెండేళ్లలోపు చిన్నారులకే కరోనా ముప్పు ఎక్కువ

ABN , First Publish Date - 2021-05-22T17:05:31+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మొదటి వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ సెకండ్‌ వేవ్‌ మాత్రం రోగులను ఎక్కువ సంఖ్యలో పొట్టన పెట్టుకుంది. ముఖ్యంగా

రెండేళ్లలోపు చిన్నారులకే కరోనా ముప్పు ఎక్కువ

వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువే

న్యుమోనియా, డయేరియా తరహా లక్షణాలు

8-16 ఏళ్ల పిల్లలకు ‘మెస్సీ’ ముప్పు 

స్కూళ్లు, పార్కులు, జన సమూహాల్లోకి వెళ్లనివ్వొద్దు

గర్భిణులకు టీకాతో రిస్క్‌ కన్నా ప్రయోజనాలే ఎక్కువ

రెయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రి సీఎండీ 

డాక్టర్‌ రమేష్‌ కంచర్లతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ


హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మొదటి వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త  తక్కువగా ఉన్నప్పటికీ సెకండ్‌ వేవ్‌ మాత్రం రోగులను ఎక్కువ సంఖ్యలో పొట్టన పెట్టుకుంది. ముఖ్యంగా 40-60 ఏళ్ల వారిని కబళించింది. ఇదే ఇంత భయంకరంగా ఉంటే... థర్డ్‌ వేవ్‌ రాబోతోందని అంటున్నారు. తల్లిదండ్రులు కనురెప్పలుగా భావించే చిన్నారులపై వైరస్‌ విరుచుకుపడనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు వైరస్‌ సోకకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఏ వయసు పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది? గర్భిణుల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై చిన్న పిల్లల వైద్యానికి సంబంధించిన రెయిన్‌బో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ), పీడియాట్రిక్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలివీ.. 


మూడోవేవ్‌ ప్రభావం ఎలా ఉండొచ్చు? 

మూడో వేవ్‌ వస్తుందన్న వార్తలున్నాయి. కానీ... అది వస్తుందో లేదో, ఎప్పుడు వస్తుందో, ఎంత తీవ్రత ఉంటుందో అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేయడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వైద్య సదుపాయాలను పెంచడం వంటి చర్యలు చేపట్టాలి. థర్డ్‌ వేవ్‌కు ముందస్తుగానే వివిధ కరోనా మ్యుటెంట్లపై పరిశోధనలు జరగాలి. తదనుగుణ చికిత్సా విధానాలు అందుబాటులోకి రావాలి. 


ఏ వయసు వారికి రిస్క్‌ ఎక్కువ?

రెండేళ్ల నుంచి 18 ఏళ్లలోపు వయసు పిల్లల కంటే రెండేళ్లలోపు పిల్లలపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. న్యుమోనియా సులభంగా అటాక్‌ అవుతుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. అందుకే ఈ గ్రూపు పిల్లలకు కరోనాతో రిస్క్‌ ఎక్కువ. 8-16 ఏళ్లలోపు పిల్లలపై ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(మెస్సీ)’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే 18 ఏళ్లలోపు వారు 30 శాతానికి పైగా ఉన్నందున వీరి విషయంలో అప్రమత్తత అవసరం. 


మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందా? 

కరోనాతో పిల్లల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడే అవకాశాలున్నాయి. రెండు విద్యా సంవత్సరాల కాలాన్ని వారికి దూరం చేశాం. ఇళ్లల్లోనే బంధించి ఉంచుతున్నాం. దీంతో ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ దెబ్బ తింటున్నాయి. వారిపై ఒత్తిడి పెరిగిపోతోంది.ఇదే పద్ధతి దీర్ఘకాలికంగా కొనసాగితే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి ప్రవర్తనలో మార్పులు రావచ్చు. 


బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఉంటుందా? 

పిల్లలకు బ్లాక్‌ ఫంగస్‌ భయం పెద్దగా లేదు. స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వినియోగించిన రోగుల్లోనే ఈ సమస్య ఉంటుంది. చిన్న పిల్లలకు కరోనా సోకినా స్టెరాయిడ్స్‌ను వైద్యులు ఎక్కువగా ప్రిస్కైబ్‌ చేయరు. దీంతో వారికి బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఉండదు.


గర్భిణులు భయపడుతున్నారు.. మీ సలహా?

ఆస్పత్రుల్లో ప్రసవాల విషయంలో గర్భిణులు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి రిస్క్‌ తలెత్తినా వెంటనే వైద్యం అందుతుంది. ఇక గర్భిణులకు టీకా వేయాలా వద్దా అనే చర్చ సాగుతోంది. నిజానికి గర్భిణులకు కూడా టీకా వేస్తేనే మంచిదన్నది నా అభిప్రాయం. అమెరికన్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, గైనకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ వంటి వైద్యుల సంఘాలు టీకా వేయడమే ఉత్తమమని చెప్పాయి. టీకా వల్ల గర్భిణులకు రిస్క్‌ కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నందున.. వారికి వ్యాక్సినేషన్‌ ఆమోదయోగ్యమే.


పిల్లల్లో ఏయే లక్షణాలుండొచ్చు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? 

కరోనా సోకిన ఎక్కువ మంది పిల్లల్లో తీవ్ర జ్వరం, జలుబు, కొంతమందిలో న్యుమోనియా, డయేరియా(విరేచనాలు) వంటి లక్షణాలను గుర్తించాం. కొంత మందిలో దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటివి పరిశీలించాం. మూడో వేవ్‌లోనూ ప్రభావం ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం. అయితే ఇన్ఫెక్షన్‌  లక్షణాలను ఇప్పుడే అంచనా వేయడం అసాధ్యం. కాకపోతే.. జ్వర తీవ్రతతో ముడిపడిన కేసులు ఎక్కువగా ఉండొచ్చు. పిల్లల వ్యాక్సిన్లపై ఇంకా ప్రయోగ పరీక్షలు నడుస్తున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేసి పిల్లలకు టీకాలను అందుబాటులోకి తేవాలి. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, స్కూళ్లు, పార్కుల్లోకి పిల్లలను తీసుకెళ్లకూడదు. 


Updated Date - 2021-05-22T17:05:31+05:30 IST