Abn logo
Jul 9 2020 @ 05:44AM

అలసత్వమే అసలు సమస్య

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు 

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చెంతన వైరస్‌

మాస్క్‌ ఉందన్న దీమాలో భౌతికదూరాన్ని విస్మరిస్తున్న జనం


ఖమ్మం, జూలై 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందే ఈ వైరస్‌ బారినపడగా తాజాగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చెంతకు ఈ మహమ్మారి చేరింది. కరోనా భయంతో ఎవరు ఎటు వెళ్లాలన్నా హడలిపోతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు ‘కోవిడ్‌’ సోకిందన్న ప్రచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు కొందరు ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉండే సహాయకులకు కూడా కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఎవరికి ఎప్పుడు పాజిటివ్‌ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో ముఖ్య ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌కు, భద్రతా సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన పర్యటనలో పాల్గొన వారిలో కరోనా భయం పట్టుకుంది.


మీడియా సిబ్బందిలోనూ కరోనా ఆందోళన పెరుగుతోంది. ఇక అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే వారికీ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు స్థానికంగా పరీక్షలు చేయించుకుంటే పరపతి దెబ్బతింటుందన్న ఆలోచనతో హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. పాజిటివ్‌ వస్తే ఖమ్మంలోని తమ నివాసంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ కేసుల సంఖ్య బయటకు రావడంలేదు. ఖమ్మం నగరంలోని పలు అపార్టుమెంట్లలోనూ కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు చర్చ జరుగుతోంది. ఇలాంటి వారంతా అపార్టుమెంట్లలోనే హోంక్వారంటైన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 133పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 51మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 74యాక్టివ్‌ కేసులున్నాయి. 8మంది మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోను రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. హైదరాబాదుతోపాటు పొరుగున ఆంధ్రా సరిహద్దునుంచి కరోనా వ్యాపిస్తోంది. కొత్తగూడెం కలెక్టరేట్‌లోని ఒక ఉద్యోగికి పాజిటివ్‌ రిపోర్టు రావడంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  


కానరాని భౌతిక దూరం..

ఉమ్మడి జిల్లాలో కరోనా ప్రారంభ సమయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో ఇప్పుడు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మాస్కులు పెట్టుకున్నామన్న ధీమాతో భౌతికదూరం పాటించడంలేదు. వ్యాపార సముదాయాలు, దుకాణాల వద్ద ఎవరూ భౌతికదూరం పాటించడంలేదు.  జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల్లో భౌతికం దూరం కనిపించడంలేదు. ప్రజాప్రతినిధుల పర్యటనల్లో కేడర్‌ను కొంత దూరంగా ఉంచుతున్నా నేతల పర్యటనల్లో వారికి చేరువ కావాలనే ఆత్రంలో ఒకరిమీద ఒకరు పడుతూ భౌతికదూరం నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా జిల్లాలో ప్రజాప్రతినిధులు పర్యటనలలో భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మంతోపాటు ఇతర పట్టణాల్లో, మండల కేంద్రాల్లో కూడా షాపులవద్ద కనీసం శానిటైజర్‌ కూడా ఉండడంలేదు. భౌతికదూరం పాటించకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు.


ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్‌షాపులవద్ద ఎక్కడా శానిటైజర్లు కనిపించడంలేదు. ఎవరికి వారు తమకు కరోనా లేదు.. రాదు అన్నధీమాతో వ్యవరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సామూహిక వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ కిక్కిరిసి ఉంటుంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద పక్కపక్కనే వాహనాలు ఉండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలోనూ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇకనైనా ప్రజలు అప్రమంత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  

Advertisement
Advertisement