అసలేం జరుగుతోంది ?

ABN , First Publish Date - 2020-06-01T09:54:31+05:30 IST

కరోనా కేసుల సమాచారం లేకపోవడంతో జిల్లాలో మహమ్మారి పూర్తిగా తగ్గిపోయిందన్న భావనతో

అసలేం జరుగుతోంది ?

రెవెన్యూ, పోలీసుల చేతుల్లోనే కరోనా సమాచారం 

నిమిత్తమాత్రులుగా వైద్యశాఖాధికారులు

వైరస్‌ ఎక్కడ ఉందో తెలియక అజాగ్రత్తగా ఉంటున్న ప్రజలు

దాతలు ఇచ్చిన మాస్క్‌లు, కిట్లు ఎక్కడ

జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఆవేదన

జిల్లాలో అస్తవ్యస్తంగా కరోనా వ్యవహారం


అనంతపురం వైద్యం, మే 30 : కరోనా కేసుల సమాచారం లేకపోవడంతో జిల్లాలో మహమ్మారి పూర్తిగా తగ్గిపోయిందన్న భావనతో ప్రజలు రోడ్లపై నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. రెవెన్యూ, పోలీసులకే కేసులు గురించి ముందుగా తెలుస్తోంది. వైద్యం అందించే వైద్యులకు కూడా తెలియడం లేదు. కేసులు లెక్కలు చెప్పకపోయినా కోలుకున్నారని డిశ్చార్జ్‌ చేస్తున్నప్పుడు పదుల సంఖ్యలో చూపుతున్నారు. వారంలో జిల్లాలో 141 మంది కరోనా బాధితులను ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అంతకుముందు 140 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ఈ లెక్కన ఇప్పటికే జిల్లాలో 281 మంది కరోనా బారిన పడి కోలుకున్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇంకా దాదాపు 40 మంది బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీన్నిబట్టి 320కుపైగానే జిల్లాలో కరోనా కేసులు నమోదైనట్లు కనబడుతోంది. ఇంకా ఎస్కేయూ క్వారంటైన్‌లో కూడా పాజిటివ్‌ బాధితులను ఉంచి చికిత్స చేస్తున్నారు. 


కేసులు చెప్పరూ అన్నీ డిశ్చార్జ్‌లే 

కరోనా పాజిటివ్‌ కేసులు లెక్కలు చెప్పడం లేదు. ఈ నెల 19వ తేదీ వరకూ జిల్లాస్థాయి సమాచారం ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర బులెటిన్‌లో ఇచ్చిన సమాచారం మాత్రమే చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో ఎన్ని కేసులు పాజిటివ్‌ వచ్చాయి. ఎక్కడెక్కడ అని గతంలో చెప్పేవారు. దీంతో ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తమై భయంతో ఉండేవారు. అయితే ఇప్పుడు ఎక్కడా ఎవరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కూడా తెలియడం లేదు. కానీ కరోనా బాధితులను మాత్రం కోలుకున్నారని ఎంతో గొప్పగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌లు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకూ 141 మందిని డిశ్చార్జ్‌ చేశారు.


అధికారిక లెక్కల ప్రకారమే ఈ నెల 20న ఏడుగురు, 22న నలుగురు, 25న 24 మందిని, 26న 32 మందిని, 27న 24 మందిని, 28న 34 మందిని, 29న 14 మందిని డిశ్చార్జ్‌ చేశారు. అంతకు ముందు 140 మందిని కోలుకున్న వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఈ లెక్కన 281 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఏడుగురు చనిపోయారు. ఇంకా ఆస్పత్రులలో 40 మంది దాకా చికిత్స పొందుతున్నారు. ఈ లెక్కన దాదాపు 330 కరోనా కేసులు జిల్లాలో నమోదైనట్లు కనబడుతోంది. కానీ అధికారులు మాత్రం 150 కేసులు వరకూ చూపించి ఆ తర్వాత కేసులు సమాచారం గుంభనంగా పెట్టుకుంటున్నారు.


మాస్క్‌లు, శానిటైజర్లు ఎక్కడ ?

 జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అలాంటప్పుడు బాధితులకు వైద్య చికిత్సలు, ఇతరత్రా సేవలు అందించేవారికి మాస్క్‌లు, శానిటైజర్స్‌, గ్లౌజ్‌లు ఎంతో అవసరం. కానీ వాటిని అందించకపోవడంతో వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిందని చెబుతున్నారు. ఎంతో మంది దాతలు మాస్క్‌లు, కిట్లు, శానిటైజర్స్‌, ఇతర రక్షణ పరికరాలను ఆస్పత్రికి అందించారు. ప్రధానంగా ఆర్డీటీ, పుట్టపర్తి సత్యసాయి ట్రస్టు పెద్ద ఎత్తున మాస్కులు, కిట్లు అందజేశాయి. కలెక్టర్‌ సమక్షంలో వైద్యశాఖకు ఆ సంస్థలు అప్పగించాయి.


అయితే ఆస్పత్రులలో మాస్క్‌లు, శానిటైజర్స్‌, గ్లౌజ్‌లు లేక వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్‌లు ఆందోళన చెందుతున్నారు. జిల్లా సర్వజనా స్పత్రిలో అయితే ఎన్‌-95 మాస్క్‌లు ఒక్కో షిఫ్ట్‌ ముగిసే వరకూ ఒక్కటే ఇస్తున్నారు. తాజాగా గ్లౌజ్‌లు, శానిటైజర్స్‌ కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని ఆవేదన చెం దుతున్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు ఇచ్చిన మాస్క్‌లు, కిట్లు ఎక్కడికి పోయాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు వాటిని పక్కదారి పట్టించారన్న ప్రచారం జరుగుతోంది. 


శాంపిల్స్‌, నిర్ధారణ పరీక్షలపై సందిగ్ధత 

కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరణ, నిర్ధారణ పరీక్షలపైనా సందిగ్ధత సాగుతూ వస్తోంది. గతంలో ఫలానా రోజు జిల్లాలో ఇంత మందికి శాంపిళ్లు తీశాం. ఇన్ని శాంపిళ్లకు ల్యాబ్‌లో పరీక్షలు జరిగాయి. అందులో పాజిటివ్‌, నెగిటివ్‌ కేసులు ప్రస్తావించేవారు. ఇప్పుడు శాంపిళ్లు, నిర్ధారణ పరీక్షలపై కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. శాంపిళ్లు తీస్తున్నా నిర్ధారణ పరీక్షలు నత్తనడకన సాగుతున్నాయని అంటున్నారు. వేలల్లో శాంపిళ్లు వస్తున్నా ల్యాబ్‌లో మాత్రం రోజుకు 800 నుంచి 900 వర కూ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది.


అయితే ఉన్నతాధికారులు మాత్రం రోజుకు 2000కుపైగా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశిస్తున్నారని తెలిసింది. ఒకే యంత్రం, మరోవైపు కిట్ల కొరత, టెక్నీషియన్ల సమస్య తీవ్రంగా ఉందని ల్యాబ్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో ఒక వ్యక్తికి శాంపిల్‌ తీసినా నిర్ధారణ పరీక్షల ఫలితం వచ్చే సరికి నాలుగైదు రోజులు అవుతున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అందులో పాజిటివ్‌ కేసులు ఉంటే ఆ వ్యక్తులు మరెందరికో కరోనా అంటించే అవకాశం ఉందని వైద్యవర్గాలు అంటున్నాయి. 


సూపర్‌ స్పెషాల్టీ కొవిడ్‌-19 విభాగం సంగతేంటి ?

జిల్లాలో కరోనా కేసులు అధికమవడంతో ప్రభుత్వం జిల్లాను రెడ్‌జోన్‌గా ఆదిలోనే గుర్తించింది. అందుకే ఇక్కడే కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలోనే కరోనా బాధితులకు నిరంతరం వైద్యసే వలు అందించడానికి ప్రత్యేక కరోనా విభాగం ఏర్పాటుకు ఆదేశించింది. జిల్లా కేంద్రంలోని శారదానగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రిలో ఈ విభాగం ఏర్పాటుకు నిర్ణయించారు. కలెక్టర్‌ సైతం నాలుగైదు సార్లు అక్కడికి వెళ్లి సీరియస్‌గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ రెండు నెలలైనా కొవిడ్‌-19 ప్రత్యేక చికిత్సా విభాగం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇలా అన్ని చూస్తుంటే జిల్లాలో అసలేం జరుగుతోందనే ఆవేదన, ఆలోచన అందరిలో మొదలవుతోంది. 

Updated Date - 2020-06-01T09:54:31+05:30 IST